Afghanistan Earthquake: భూకంప బాధితుల కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్

Afghanistan Earthquake: భూకంప బాధితుల కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్

ఆఫ్ఘనిస్తాన్ లోని ఆదివారం (ఆగస్టు 31) జరిగిన ఘోరమైన భూకంప ప్రమాదంలో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ఆదుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. ఒక ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు మంగళవారం (సెప్టెంబర్ 2)  ప్రకటించింది. కునార్ ప్రావిన్స్‌లో ఇటీవల సంభవించిన భూకంప బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు టీ 20 మ్యాచ్ ను నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ శుక్రవారం (సెప్టెంబర్ 5) మధ్యాహ్నం 2.30 గంటల నుండి ఖోస్ట్ ప్రావిన్స్‌లో రహమత్ వలీ మస్రూర్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.

ఈ లోకల్ మ్యాచ్ లో జాతీయ జట్టులోని అందరూ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఈ విపత్తులో కనీసం 3,251 మంది గాయపడ్డారని మరియు 8,000 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ గుర్తించింది. కొనుగోలు చేసిన ప్రతి టికెట్‌ను కునార్‌లోని భూకంప బాధితుల సహాయార్థం పూర్తిగా విరాళంగా ఇస్తామని బోర్డు ప్రకటించింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉచితంగా అందిస్తామని తెలిపింది. RTA స్పోర్ట్ ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా అందిస్తుందని ప్రకటించడంతో సంతోషిస్తున్నామని ఏసీబీ తెలిపింది. 

ALSO READ : ప్రమాదంలో ఇంగ్లాండ్ వన్డే క్రికెట్..

"ఛారిటబుల్ ఈవెంట్ కు హాజరు కావాలని మేము క్రికెట్ అభిమానులు, సంపన్న పౌరులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మీ టికెట్ కొనుగోళ్లు, విరాళాలు అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడతాయి". అని ఒక ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సోమవారం (సెప్టెంబర్ 1) షార్జా క్రికెట్ స్టేడియంలో యుఎఇ, ఆఫ్ఘనిస్తాన్ ట్రై సిరీస్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో సంభవించిన ఘోరమైన భూకంపంలో మరణించిన వారందరికీ ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు.