ఆఫ్రికా రెండుగా చీలుతుందా?

ఆఫ్రికా రెండుగా చీలుతుందా?

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా చీలిపోతోంది. రెండు భాగాలుగా విడిపోతుంది. విడిపోవడమంటే ఇండియా, పాకిస్తాన్ విడిపోయినట్టు ప్రాంతాలుగా కాదు. భూమి రెండుగా చీలిపోయి ఆఫ్రికాను రెండు ప్రాంతాలుగా వేరు చేస్తోంది. ఈ రెండింటి మధ్యలో మరో మహాసముద్రం కూడా ఏర్పడనుంది. కొన్ని దేశాలు ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారనున్నాయి. వినడానికి కాస్త వింతగా అనిపించినా జియోగ్రఫాలజిస్ట్​లు చెప్తున్న అక్షర సత్యాలివి. కాకపోతే... ఇదంతా జరగడానికి కొన్ని లక్షల ఏండ్లు పడుతుంది. 

ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోతోందని, ఆ భాగాల మధ్యలో కొత్త సముద్రం ఏర్పడుతుందని కొన్నాళ్ల నుంచి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే.. పూర్తిగా విడిపోయి, సముద్రం ఏర్పడడానికి కొన్ని మిలియన్ల ఏండ్లు పడుతుంది. సోమాలియా, కెన్యా, ఇథియోపియా, టాంజానియాలోని కొన్ని ప్రాంతాలు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల నుండి విడిపోతాయి.

అంతేకాదు.. ఈ ఖండంలోని కొన్ని దేశాలు రానున్న కాలంలో ద్వీపాలుగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్నేండ్ల క్రితం ఆఫ్రికా దేశమైన కెన్యా రాజధాని నైరోబీకి దగ్గర్లోని ఒక హైవే మీద చీలిక ఏర్పడింది. దాని వైశాల్యం రోజురోజుకూ పెరుగుతోంది. నైరోబీ ప్రాంతంలో భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లలో వస్తున్న కదలికల వల్లేఈ పగుళ్లు ఏర్పడ్డాయని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెప్పారు.

లక్షల ఏండ్ల క్రితం 

ఖండాలు విడిపోవడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం భూమ్మీద ఉన్న అన్ని ఖండాలు కొన్ని లక్షల ఏండ్ల క్రితం అలా విడిపోయినవే. సుమారు138 మిలియన్ ఏండ్ల క్రితం దక్షిణ అమెరికా కూడా ఆఫ్రికాలో భాగంగా ఉండేది. కానీ.. టెక్టానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్లు విడిపోవడం వల్ల దక్షిణ అమెరికా ఆఫ్రికాకు దూరంగా జరిగింది. అందువల్లే మధ్యలో సముద్రం ఏర్పడింది. 1858లో స్నిడర్–పెల్లెగ్రిని అనే సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేసిన మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రకారం.. అమెరికా, ఆఫ్రికన్ ఖండాలు ఒకప్పుడు ఎలా కలిసి ఉండేవనేది స్పష్టంగా తెలుస్తుంది. 

ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ

భూమిలోని టెక్టానిక్ ప్లేట్లు వేరయ్యే లేదా చీలిపోయే చోట ఏర్పడే లోతట్టు ప్రాంతాన్ని ‘రిఫ్ట్ వ్యాలీ’ అంటారు. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ లేదా ఆఫ్రో–అరేబియన్ రిఫ్ట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్నేళ్లుగా కదలికలు వస్తున్నాయి. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీని గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఇది చాలా పొడవైన వ్యాలీ. ఈ వ్యాలీలోని రెండు టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదులుతుండడంతో చీలికలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.

దీని ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమ్మీదే కాకుండా సముద్రంలో కూడా కనిపిస్తోంది. ఈ చీలిక వల్ల తూర్పున సోమాలి ప్లేట్, పశ్చిమాన నుబియన్ ప్లేట్ ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. ఈ  టెక్టానిక్  ప్లేట్ల మధ్య పెరుగుతున్న దూరాన్ని మొదటిసారిగా 2004లో నెదర్లాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్లు గమనించారు.

ప్రస్తుతం ఉత్తరాన ఎర్ర సముద్రం నుండి ఆఫ్రికన్ ఖండానికి ఆగ్నేయంలో ఉన్న మొజాంబిక్ వరకు3,500 కిమీ (2,174 మైళ్ళు) ఈ చీలిక విస్తరించి ఉంది. అమెరికన్ న్యూస్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ క్వార్ట్జ్ కథనం ప్రకారం.. ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయినప్పుడు రువాండా, బురుండి, మలావి, ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జాంబియా లాంటి భూపరివేష్టిత(సముద్ర తీరం లేకుండా చుట్టూ భూమి మాత్రమే సరిహద్దులు ఉన్న) దేశాలకు సముద్ర తీరం వస్తుంది. 

జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి.. 

సోమాలి ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్ నుండి విడిపోయే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది కాదు. 30 మిలియన్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. కానీ.. సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 20 ఏండ్ల క్రితం దాన్ని నిర్ధారించారు. అరేబియా ప్లేట్ ఆఫ్రికన్ ప్లేట్ నుండి యాక్టివ్ డైవర్జెంట్ రిడ్జ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూరంగా వెళ్తోంది. దీనివల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కూడా విడిపోతున్నాయి. ఇక్కడ చీలిక ‘Y’ ఆకారంలో ఉండడం వల్ల నుబియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్, సోమాలి ప్లేట్, అరేబియన్ ప్లేట్ కలిసే ప్రాంతంలో చీలిక వస్తుంది. ఈ ప్రాంతాన్ని ఎఫర్ ట్రిపుల్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గర మూడు టెక్టానిక్  ప్లేట్లు విడిపోతున్నాయి. క్వార్ట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం.. ఈ టెక్టానిక్  ప్లేట్ల ఫాల్ట్ లైన్లు ప్రతి ఏడాది ఏడు మిల్లీమీటర్లు విస్తరిస్తున్నాయి. 

2005లో... 

భూమి చీలుతుందనే విషయాన్ని ప్రజలు 2005లో గుర్తించారు. 2005 సెప్టెంబరు 26న ఇథియోపియా ఎడారిలో 55 కిలోమీటర్ల పొడవున ఒక చీలిక ఏర్పడింది. అయితే.. అదే టైంలో అక్కడ ఒక అగ్నిపర్వతం పేలడంతో ఆ చీలికకు కారణం అగ్నిపర్వతం పేలుడు అనుకున్నారు. కానీ..  చీలిక వెడల్పు ప్రతి ఏడాది పెరుగుతోంది. ఆ తర్వాత 2018లో కెన్యాలో  చీలిక కనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి చీలికలు మరిన్ని రావచ్చని ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది అక్కడి గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ కెన్యా రిఫ్ట్ వ్యాలీలో కనిపించిన చీలికలకు భారీ వర్షాలే కారణమని నమ్మారంతా. కానీ..  రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసలు విషయం బయటపడింది. 

ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియాను ఎప్పటికప్పుడు శత్రువులు, వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుతున్న హిమాలయాలు కూడా టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోవడం వల్లే ఏర్పడ్డాయి. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతం లోపల ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇండియన్ టెక్టానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పుల వల్ల హిమాలయాల్లో కూడా చీలిక వస్తుందని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెప్తున్నారు.

ఇంన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యురేషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్ల మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతుంటుందని పరిశోధనల్లో తెలిసింది. దానివల్ల హిమాలయ పర్వతాల ఎత్తు పెరిగి, ఆ ప్రాంతంలో ఉన్న టిబెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు ముక్కలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియోఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యానివర్సరీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూగర్భశాస్త్రవేత్తలు చెప్పారు. 

కదలిక.. 

ఇండియన్ టెక్టానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏటా సుమారు అయిదు సెంటీమీటర్లు కదులుతోంది. దీనివల్ల హిమాలయాల అడుగున ఒత్తిడి పెరుగుతుంది. ఆ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం కూడా ఉందని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అంటున్నారు. ఒకప్పుడు ఇండియా... గోండ్వానాలో భాగంగా ఉండేది. దాదాపు 10 కోట్ల ఏండ్ల క్రితం ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్టానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడిపోయి ఉత్తరం వైపు కదులుతూ వెళ్లింది. దాదాపు 5 కోట్ల ఏండ్ల నుంచి యురేషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఢీకొంటున్నది. అందువల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. 

భూకంపాలు 

ఇండియన్ ప్లేట్ ఏటా ఐదు సెంటీమీటర్లు కదులుతుండడం వల్ల హిమాలయాలపై ఒత్తిడి పెరుగుతోంది. అదొక్కటేకాదు భారీ భూకంపాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతోందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ)’కి చెందిన డాక్టర్​ ఎన్​ పూర్ణచంద్రరావు, చీఫ్​ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియన్ ప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కదులుతుండడంతో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పశ్చిమ భాగంలో  భూకంపాలు వస్తాయని చెప్పారాయన. 

టెక్టానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్లు 

మన పాదాల కింద ఉన్న నేల నిరంతరం కదులుతుందని ఎంతమందికి తెలుసు?వాస్తవానికి భూమిలోని పొరలు కదులుతూనే ఉంటాయి. కానీ.. ఏడాదిలో మన గోరు ఎంత పొడవు పెరుగుతుందో అంత... లేదా అంతకంటే తక్కువే కదులుతుంది. అందుకే కదులుతున్న విషయం మనకు తెలియదు. భూమి లోపల ఉన్న వేడి గోళం పైభాగంలో సన్నని టెక్టానిక్  ప్లేట్లు తేలుతుంటాయి. వాటివల్లే ఖండాలు, సముద్రాలు ఏర్పడ్డాయి. వీటి మధ్య ఉండే గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగాలన్నా, తగ్గాలన్నా కొన్ని మిలియన్ల ఏండ్లు పడుతుంది. భూకంపాలు, సునామీలు రావడానికి కూడా ఈ ప్లేట్లే కారణం. ఇవి ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నప్పుడు అలాంటి విపత్తులు వస్తుంటాయి.

ఆఫ్రికా గురించి.. 

    ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండం ఆఫ్రికా. ఇది సుమారు 30.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
    ఆఫ్రికాలో 54 గుర్తింపు పొందిన దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉన్న ఖండం కూడా ఇదే. 
    ఉత్తర ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి దాదాపు 3.6 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.
    
ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు అనేక ఇతర ఆఫ్రికన్ దేశాల గుండా ప్రవహించే నైలు నది 6,650 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనది.
    
ప్రపంచంలోనే అతిపెద్ద భూ క్షీరదం(పాలిచ్చే జంతువు) ఆఫ్రికన్ ఏనుగు. వేగవంతమైన భూమి క్షీరదం చిరుత  ఇక్కడే ఉన్నాయి. 
    
తూర్పు ఆఫ్రికాలో ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ భూమ్మీద ఉన్న అతిపెద్ద భౌగోళిక నిర్మాణం. అనేక రకాల ప్రత్యేకమైన మొక్కలు, జంతు జాతులకు ఇది నిలయంగా ఉంది.
    
ఆఫ్రికాలో మూడువేలకు పైగా విభిన్న జాతులు.. రెండు వేల కంటే ఎక్కువ భాషలు మాట్లాడే గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది.
    
అన్ని ఖండాలతో పోలిస్తే... ఆఫ్రికాలోనే జనాభా వేగంగా పెరుగుతోంది. ఆఫ్రికాలో 1.2 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఆసియా తర్వాత రెండో అత్యధిక జనాభా కలిగిన ఖండం. 
    
ఆఫ్రికాలో చమురు, గ్యాస్, వజ్రాలు, రాగి, యురేనియం, నికెల్, అల్యూమినియం, బాక్సైట్, బొగ్గు, వెండి, బంగారంతో సహా అనేక సహజ వనరులు ఉన్నాయి.