
అరట్టై (Arattai) యాప్ విజయవంతం తర్వాత, ఇప్పుడు జోహో (Zoho) నుండి వచ్చిన కొత్త యాప్ 'ఉలా బ్రౌజర్' (Ulaa Browser) యాప్ స్టోర్ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఇండియాలో తయారైన సాఫ్ట్‌వేర్‌లతో అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీ ఇస్తున్న జోహో సంస్థ ఇప్పటికే వాట్సాప్‌కు పోటీగా 'అరట్టై'ని లాంచ్ చేసింది. ఇప్పుడు, గూగుల్ క్రోమ్ (Google Chrome), ఆపిల్ సఫారీ (Apple Safari) వంటి బ్రౌజర్‌లకు పోటీ ఇవ్వడానికి 'ఉలా బ్రౌజర్'ను తీసుకొచ్చింది.
ఉలా బ్రౌజర్ ప్రత్యేకత : ఉలా బ్రౌజర్ Android, iOS, Windows, Mac, & Linux వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లో ఉంది. దీని గోప్ప ఫీచర్ గోప్యత (Privacy). ఉలా బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు, స్టోర్ చేయదు ఇంకా ఇతరులకు విక్రయించదు. గూగుల్ ప్రకటనల కోసం డేటాను సేకరిస్తుంది, కానీ ఉలా పూర్తిగా వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది.
యాడ్ బ్లాకర్, ట్రాకర్ ప్రొటెక్షన్: బ్రౌజింగ్ అనుభవం సురక్షితంగా ఉండేందుకు ఇందులో యాడ్ బ్లాకర్లు ఇంకా ట్రాకర్ ప్రొటెక్షన్ ఇన్-బిల్ట్ గా ఉన్నాయి. ఈ బ్రౌజర్‌లో ఐదు రకాల మోడ్‌లు ఉన్నాయి. వర్క్, పర్సనల్, కిడ్స్, డెవలపర్ (సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం), ఓపెన్ సీజన్.
ప్రభుత్వ గుర్తింపు: ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'ఇండియన్ వెబ్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్'ను కూడా ఉలా బ్రౌజర్ గెలుచుకుంది. యూజర్లు ప్రతిసారి లాగిన్ చేయకుండానే జోహో యాప్‌లో సులభంగా, సురక్షితంగా సైన్ ఇన్ చేయవచ్చు. అలాగే, వివిధ బ్రౌజర్ మోడ్‌లు జోహో యాప్స్ కోసం AI- ఆధారిత సెర్చ్ సిస్టమ్ 'జియా (Zia)' తో కూడా కనెక్ట్ అయి ఉంటాయి.
ప్రస్తుతానికి, ఉలా బ్రౌజర్‌లో గూగుల్ క్రోమ్, పెర్‌ప్లెక్సిటీ (Perplexity) వంటి వాటిల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు లేవు. బ్రౌజర్ రేసులో గూగుల్ క్రోమ్‌ను అధిగమించాలంటే, ఉలా బ్రౌజర్‌లో మరిన్ని అధునాతనమైన AI ఫీచర్లను తీసుకురావాల్సి ఉంటుంది.