దశాబ్దాల కల నెరవేరడం ఆనందాన్నిస్తోంది: మోహన్ భగవత్‌

దశాబ్దాల కల నెరవేరడం ఆనందాన్నిస్తోంది: మోహన్ భగవత్‌

అయోధ్య: రామ మందిర భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని మోడీ, ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్​ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగితోపాటు పలువురు ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందిరం కోసం పోరాడిన వారిని భగవత్ గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల శ్రమకు ఫలితంగా గొప్ప సంతృప్తి కలిగిందన్నారు. అయోధ్యలో రామాలయం కోసం ఆర్‌‌ఎస్ఎస్ 30 ఏళ్ల పాటు పని చేసిందన్నారు.

‘మేం ఓ నిర్ణయాన్ని తీసుకున్నాం. మేం 20 నుంచి 30 ఏళ్ల పాటు శ్రమించాల్సి ఉంటుందని, అప్పుడే అది ఫలప్రదం అవుతుందని అప్పటి ఆర్‌‌ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ డియోరాస్ చెప్పేవారు. మేం పోరాటం చేశాం. ఇప్పుడు 30వ సంవత్సరంలో మా ఆశ ఫలించినందుకు సంతోషంగా ఉన్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. శతాబ్దాల కల నెరవేరినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. మనపై మనం స్వీయంగా ఆధారపడకపోవడమనే లోటు ఇన్నాళ్లూ ఉండేది. ఆత్మ విశ్వాసాన్ని పాదుకొల్పినందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. చాలా మంది త్యాగాలు చేశారు. కానీ వారిప్పుడు భౌతికంగా లేరు. మరికొందరు ఇక్కడకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అడ్వానీ జీ కచ్చితంగా ఇంటి నుంచి ఈ వేడుకను చూస్తూ ఉండుంటారు. ఇంకొందరు కూడా రావాల్సింది. కానీ కరోనా కారణంగా వారిని ఆహ్వానించలేదు’ అని భగవత్ చెప్పారు.