సర్కారు బడుల్లో సీట్లకు మస్తు డిమాండ్​.. ప్రైవేటు స్కూళ్ల నుంచి రాక

సర్కారు బడుల్లో సీట్లకు మస్తు డిమాండ్​.. ప్రైవేటు స్కూళ్ల నుంచి రాక
  • ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చి చేరుతున్న స్టూడెంట్లు
  • ఆర్థిక ఇబ్బందులు, ఫీజుల దోపిడీ వల్ల ప్రభుత్వ స్కూళ్ల వైపు పేరెంట్స్‌‌
  • ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల అడ్మిషన్లు
  • ప్రైవేటు నుంచి సర్కారుకు 1.25 లక్షల మంది స్టూడెంట్లు
  • రానున్న రోజుల్లో ఇంకా పెరగొచ్చంటున్న అధికారులు

సూర్యాపేట జిల్లా నూతన్ కల్ జెడ్పీ హైస్కూల్​లో మొన్నటిదాకా 286 మంది స్టూడెంట్స్ ​ఉన్నారు. స్కూల్ రీ ఓపెన్ అయ్యాక చుట్టుపక్కల ప్రైవేట్ స్కూళ్ల నుంచి 114 మంది కొత్తగా జాయిన్ అయ్యారు.
మెదక్ పట్టణంలోని ఫతేనగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్​లో కొత్తగా 80 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. వీరంతా ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్లేనని హెచ్ఎం అశోక్ చెప్పారు.
హైదరాబాద్‌‌ గన్ ఫౌండ్రీ ఏరియా గర్ల్స్ హైస్కూల్​లో 401 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఏడాది 102 కొత్త అడ్మిషన్స్ వచ్చాయి. వీరిలో 50 శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు.

సూర్యాపేట / హైదరాబాద్, వెలుగు:

సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నయ్. ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు స్టూడెంట్లు క్యూ  కడుతున్నారు. కరోనా తెచ్చిన ఆర్థిక కష్టాలు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ భరించలేని పేద, మధ్య తరగతి పేరెంట్లు.. తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో మాన్పించి ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్​ చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ స్కూళ్లలో కొత్తగా 2.5 లక్షల అడ్మిషన్లు పెరిగాయని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 26,285 సర్కారు బళ్లలో 20,46,254 మంది.. 668 ఎయిడెడ్ స్కూళ్లలో 83,500 మంది.. 10,816 ప్రైవేట్ స్కూళ్లలో 32,13,333 మంది చదువుతున్నారు. 17 నెలల తర్వాత ఈ నెల 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్​అయ్యాయి. సర్కారు బడుల్లో అనూహ్యంగా అడ్మిషన్లు పెరిగాయి. ఈ క్లాస్ ఆ క్లాస్ అనే తేడా లేకుండా ఫస్ట్ నుంచి టెన్త్ దాకా స్టూడెంట్స్ అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. గతంలో స్కూళ్ల ప్రారంభానికి ముందు బడిబాట పేరిట ప్రతి ఇల్లూ తిరిగినా పెద్దగా స్టూడెంట్లు చేరేవాళ్లు కాదు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 2 లక్షల 50 వేలకు పైగా అడ్మిషన్లు వచ్చాయని, ఇందులో 1.25 లక్షల మంది ప్రైవేటు నుంచి సర్కారు బడులకు వచ్చారని ఆఫీసర్లు చెబుతున్నారు. ఫస్ట్ క్లాసులో 1.5 లక్షల మంది చేరారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చేరుతున్న స్టూడెంట్లు మళ్లీ ప్రైవేట్​వైపు పోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

కారణాలెన్నో

క్లాసులను బట్టి, స్కూళ్ల స్థాయిని బట్టి ఏటా రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు పేరెంట్స్ ఫీజులు కట్టే వాళ్లు. ఏడాదిన్నర కాలంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులు అనేకమంది జీవితాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. బిజినెస్ నడవక చిరువ్యాపారులు నష్టాల్లో కూరుకుపోయారు. గతేడాది ఆన్​లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడంతో ట్యూషన్​ఫీజులే తీసుకోవాలని ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది కూడా జీవో నంబర్​75 జారీ చేసింది. సర్కారు మాటలు నమ్మిన పేరెంట్స్.. అప్పు చేసి మరీ తమ పిల్లలకు స్మార్ట్​ఫోన్లు, ట్యాబ్​లు కొనిచ్చారు. కానీ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ జీవోను పట్టించుకోకుండా మొత్తం ఫీజులు వసూలు చేశాయి. దీంతో ఫీజులు కట్టలేక చాలా మంది ఆన్​లైన్ క్లాసులను బంద్ ​చేయించారు. స్కూళ్లు రీ ఓపెన్​కాగానే ప్రైవేట్ స్కూళ్ల నుంచి టీసీలు తెచ్చుకొని గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్ స్కూళ్లు మూతపడడంతో ఇన్నాళ్లూ అక్కడ చదివించిన వారు కూడా సర్కారు బడులవైపే మొగ్గుచూపుతున్నారు.
ఫీజులు కడితేనే టీసీలు
8వ తరగతి వరకు స్టూడెంట్లకు టీసీలు అవసరం లేదని సర్కారు చెప్పింది. ప్రైమరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి టీసీ, బోనఫైడ్​ లేకుండానే గవర్నమెంట్ స్కూల్ లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ తొమ్మిది, పదో తరగతి పిల్లలకు మాత్రం ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని ప్రైవేట్​యాజమన్యాలు మెలిక పెడుతున్నాయి. దీంతో ప్రైవేట్​లో చదివించలేక, గవర్నమెంట్ లో అడ్మిషన్ తీసుకోవడం కుదరక పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. 9వ తరగతి స్టూడెంట్లకూ టీసీలు లేకుండా గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఆరేండ్ల కింద 280.. ఇప్పుడు 1,250
ఆరేండ్లలోనే సిద్దిపేటలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ పూర్తిగా మారిపోయింది. ఆరేండ్లకు ముందు స్కూలులో స్టూడెంట్ల సంఖ్య 280 కాగా, ఇప్పుడు 1,250కి చేరింది. మూడేండ్లుగా విద్యా సంవత్సరానికి ముందే ‘అడ్మిషన్లు ఫుల్’ అని బోర్డు పెడుతోంది. స్కూల్‌‌ హెచ్ఎంగా రామస్వామి బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. స్టూడెంట్ల సంఖ్యను పెంచే దిశగా కార్యాచరణ రూపొందించారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. స్కూలు మారిన తీరును వివరించి, పిల్లలను చేర్పించాలని ఇంటింటికి తిరిగి టీచర్లు చెప్పడం పనికొచ్చింది. స్టూడెంట్ల సంఖ్య క్రమంగా పెరిగింది. సాయంత్రం ఒక గంట జనరల్ నాలెడ్జ్ చెప్పడం, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం, మాతృ వందనం పేరిట స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, కార్పొరేట్ కంపెనీల సాయంతో సర్టిఫికెట్ కోర్సులు నేర్పిస్తుండటంతో అడ్మిషన్ల సంఖ్య బాగా పెరిగింది.
జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు డబుల్
ఈ ఏడాది గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు డబులయ్యాయి. కరోనా ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు కాలేజీల్లో చేర్పించలేక చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు. హైదరాబాద్‌‌లో గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో అడ్మిషన్లు 83% పెరిగాయి. గవర్నమెంట్, ఎయిడెడ్, మైనారిటీ, వెల్ఫేర్ కాలేజీల్లో 50 నుంచి 70% కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. సీట్లన్నీ అయిపోయినా.. స్టూడెంట్లను జాయిన్ చేసుకుంటున్నారు. ప్రత్యేక సెక్షన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సిటీలో 22 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సెకండ్ ఇయర్ లో 8,953 మంది, ఫస్ట్ ఇయర్ లో 16,743 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 7 వేల మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇలా ఈ ఏడాది ఒక్కో కాలేజీలో 300 అదనపు అడ్మిషన్లు అయ్యాయి. 274 ప్రైవేట్ కాలేజీల్లో కొన్నింటికి సర్కారు అనుమతి రాలేదు. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో సెకండ్ ఇయర్ లో 60 వేల మంది, ఫస్ట్ ఇయర్ లో 20 వేల మంది జాయిన్ అయ్యారు. 

రూ.50 వేలు కట్టలేక
నా భర్త సేల్స్ మన్ గా పని చేస్తున్నారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. ఫీజుల భయంతో ప్రైవేటు స్కూల్లో టీసీలు తీసుకుని.. ఇద్దరు అబ్బాయిలను గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరికి రూ.50 వేల ఫీజు కట్టే స్థోమత మాకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.
- పద్మావతి, కృష్ణానగర్, హైదరాబాద్

70 శాతం ప్రైవేట్ స్టూడెంట్సే
ఈ ఏడాది 70 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. అందులో 70 శాతం ప్రైవేట్ స్కూళ్లకు చెందిన స్టూడెంట్సే ఉన్నారు. ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా జాయిన్ చేసుకున్నాం. చాలా మంది పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వ స్కూళ్లకు షిప్ట్ చేస్తున్నామని చెప్పారు.
- శారద, హెచ్ఎం,    ప్రభుత్వ హైస్కూల్, మాసబ్ ట్యాంక్

ఆర్థిక ఇబ్బందుల వల్లే
మా పాప థర్డ్, బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నారు. గతేడాది వరకు పిల్లలిద్దరూ ప్రైవేట్ స్కూల్​లో చదివారు. కరోనా వల్ల 16 నెలల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. పైగా ఆన్​లైన్ క్లాసుల వల్ల పిల్లలకు చదువు రావట్లేదు. ఫీజులు మాత్రం బరాబర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు పిల్లలను గవర్నమెంట్ స్కూల్​లో జాయిన్ చేసినం.
- పిల్లుట్ల పుల్లయ్య, తాడ్వాయి, సూర్యాపేట