- నిశ్చితార్థం తర్వాత పెండ్లికి నో..
- పెట్టిన బంగారం, వెండి ఇచ్చేందుకు నిరాకరణ
- ఏపీకి చెందిన యువకుడిపై కేసు
మేడిపల్లి, వెలుగు: నిశ్చితార్థం అనంతరం ఓ యువకుడు పెండ్లికి నిరాకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన యువతి(27)కి ఏపీలోని కాకినాడకు చెందిన గామిని సిద్ధార్థ్‌తో ఫిబ్రవరి 28న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహాన్ని ఈ నెల 26న నిర్వహించాలని నిర్ణయించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేశారు.
నిశ్చితార్థం తర్వాత సిద్ధార్థ్ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఇటీవల చిన్నచిన్న కారణాలు చూపుతూ వివాహానికి నిరాకరించాడు. నిశ్చితార్థం సమయంలో యువతి తల్లిదండ్రులు వరుడికి 1.3 తులాల బంగారం, ఒక కిలో వెండి ఇచ్చారని, పెండ్లికి నిరాకరించిన యువకుడు వాటిని కూడా తిరిగి ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

