కోలుకుంటున్న కేరళ

కోలుకుంటున్న కేరళ

హిమాచల్​ను వదలని వరదలు

తిరువనంతపురం: భారీ వర్షాలతో వణికిపోయిన కేరళ మామూలు స్థితికి చేరుకుంటోంది. వర్షాలు తగ్గటంతో రిలీఫ్‌‌ క్యాంపుల్లో ఉన్న ప్రజలు ఇళ్లకు వెళ్తున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శనివారానికి మృతుల సంఖ్య 113కు చేరింది. గల్లంతైన  28 మంది కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మట్టిలో ఇరుక్కుపోయిన వారిని కనిపెట్టేందుకు హైదరాబాద్‌‌ నుంచి ‘గ్రౌండ్‌‌ పెనిట్రేటింగ్‌‌ రడార్స్‌‌’ (జీనీఆర్‌‌‌‌)లను తెప్పిస్తున్నామన్నారు. మల్లాపురం, వయనాడ్‌‌లో కొండచరియలు ఎక్కుగా విరిగిపడ్డాయని, గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు.  805 రిలీఫ్‌‌ క్యాంపుల్లో  1.29 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారన్నారు.

సిమ్లా: హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా శనివారం కాంగ్రా జిల్లాలో విద్యాసంస్థలను బంద్‌‌ చేశారు. పాలంపూర్‌‌ దగ్గర్లో వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కొండ చరియలు విరిగిపడడంతో కాంగ్రా, చంబా జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ట్రాఫిక్‌‌ నిలిచిపోయింది. వర్షాలు కొనసాగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు విద్యా సంస్థల్ని మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రా డిప్యూటీ కమిషనర్ రాకేశ్ కుమార్ ప్రజాపతి తెలిపారు. నూర్పూర్‌‌లోని మెహ్రా గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆయన చెప్పారు.

కోల్‌‌కతాలో కుండపోత

భారీ వర్షం కారణంగా శుక్ర, శనివారాల్లో కోల్‌‌కతాలో జనజీవనం స్తంభించింది. సిటీలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో ట్రాఫిక్‌‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 24 గంటల్లో 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు రైళ్లను రద్దు చేశారు. విమాన రాకపోకలపైనా వర్షం ప్రభావం పడింది. చాలా ఫ్లైట్స్‌‌ ఆలస్యంగా నడుస్తున్నాయి.