చికెన్ కర్రీలో ఎలుక: ఆ రెస్టారెంట్‌ను మూయించేశారు

చికెన్ కర్రీలో ఎలుక: ఆ రెస్టారెంట్‌ను మూయించేశారు

నాలుగు రోజుల క్రితం ముంబైలోని ఓ రెస్టారెంట్‌ యాజమాన్యం.. కస్టమర్‌కు చచ్చిన ఎలుకను వడ్డించిన విషయం తెలిసిందే. కడుపారా తిందామని ఫ్రెండ్‌తో క‌లిసి వచ్చిన ఓ వ్యక్తికి.. చికెన్ కర్రీలో ఎలకను కలిపి వడ్డించారు. నాలుగు ముక్కలు తిన్నాక గుర్తించిన వారిరువురు ఆవురావురమంటూ తిన్నదంతా బయటకు కక్కారు. అనంతరం ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేయడంతో వారు రెస్టారెంట్ మేనేజ‌ర్‌, చెఫ్‌పై కేసు న‌మోదు చేశారు. 

ఈ ఘటనపై విచారణలో భాగంగా సదరు రెస్టారెంట్‌ను తనిఖీ చేసిన మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగు చూడటంతో ఈ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం.. అన్ని మార్గదర్శకాలు పాటించే వరకూ రెస్టారెంట్‌ తెరవకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

అసలేం ఏం జరిగిందంటే..

ఆదివారం(ఆగష్టు 13) బాంద్రా వెస్ట్‌లోని పాలిహిల్‌లో భోజ‌నం చేసేందుకు అనురాగ్ సింగ్ అనే వ్యక్తి అతని స్నేహితుడు అమీన్ తో కలిసి వెళ్లాడు. అక్కడ చికెన్‌, బ్రెడ్‌తో మ‌ట‌న్ తాలి ఆర్డర్ చేశారు. ఆపై స‌ప్లై చేసిన ఫుడ్‌ను తింటుండ‌గా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించ‌డంతో చూడగా అందులో చిన్న ఎలుక క‌నిపించింది. ఈ ఘటనపై వారు రెస్టారెంట్‌ సిబ్బందిని ప్రశ్నించ‌గా.. స‌రైన స‌మాధానం ఇవ్వలేదు. అనంతరం ఈ ఘటనపై బాంద్రా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.