ఎన్నాళ్లకెన్నాళ్లకు... హన్మకొండలో ఆరేండ్ల తర్వాత డబుల్ ఇండ్ల పంపిణీ

ఎన్నాళ్లకెన్నాళ్లకు...  హన్మకొండలో ఆరేండ్ల తర్వాత డబుల్ ఇండ్ల పంపిణీ

 

  •  అంబేద్కర్‍ నగర్‍లో పాతోళ్లు, నిరుపేదలు, దివ్యాంగులకు ఉద్యమకారులకు ప్రయారిటీ
  • 2015లోనే ఇండ్ల నిర్మాణం కోసం గుడిసెలు  ఖాళీ చేసిన అధికారులు
  • 2018లో పూర్తయినా నేతల అవినీతి రాజకీయాలతో ముందరపడలే
  • ఎట్టకేలకు ఇండ్ల పంపిణీతో పేదల కండ్లల్లో ఆనందం.. అక్రమార్కుల్లో టెన్షన్‍

వరంగల్‍/హనుమకొండ, వెలుగు: నాటి సీఎం కేసీఆర్​ చెప్పిండని గుడిసెలు ఖాళీ చేసి జాగలిస్తే, అందులో డబుల్​ బెడ్​రూమ్  ఇండ్లు కట్టి, ఇచ్చేసరికి పదేండ్లు పట్టింది. హనుమకొండ టౌన్​ బాలసముద్రంలోని అంబేద్కర్‍ నగర్‍, జితేందర్‍ నగర్‍ కాలనీవాసులు ఈ పదేండ్లపాటు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 2018లోనే ఇండ్లు పూర్తయినా బీఆర్ఎస్​ లీడర్ల అవినీతి, అక్రమాల వల్ల పంపిణీ ముందరపడలేదు.

 ఎట్టకేలకు ఇండ్లు పూర్తయిన ఆరేండ్ల తర్వాత హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను సర్కారు పంపిణీ చేసింది.  రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి 592 మందికి ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు. ఏండ్ల నిరీక్షణ తర్వాత ఇండ్లు పొందిన లబ్ధిదారుల కండ్లలో ఆనందం కనిపిస్తుండగా, నాడు ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన అక్రమార్కుల్లో టెన్షన్‍ మొదలైంది.

2018లో నిర్మాణాలు పూర్తయినా.. 

2015లో వరంగల్‍ సిటీలో సీఎం కేసీఆర్ పర్యటించారు. అంబేద్కర్‍ నగర్‍, జితేందర్‍ నగర్‍ కాలనీల్లో కలియదిరిగారు. అక్కడి గుడిసెవాసులకు డబుల్‍ ఇండ్లు కట్టిస్తామని, ఏడాదిలోగా పూర్తి చేసి తానే స్వయంగా వచ్చి అందిస్తానని హామీ ఇచ్చారు. 2018 చివరలో 592 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. అప్పటి నుంచి వీటిని  పంపిణీ చేయలేదు. అయితే.. బీఆర్‍ఎస్‍ ప్రజాప్రతినిధులు, అనుచరులు దాదాపు 2 వేల మంది వద్ద డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో లబ్ధిదారులకు అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్‍ ఇచ్చేందుకు సాహసించలేదు.  

నాలుగైదుసార్లు లబ్ధిదారుల వడపోత..

హనుమకొండ ఏషియన్ మాల్‍ పక్కన నిర్మించిన డబుల్‍ ఇండ్ల కోసం దాదాపు 3 వేల అప్లికేషన్లు వచ్చాయి.  వీరిలో ఇండ్లులేని పేదలతో పాటు బీఆర్‍ఎస్‍ నేతలకు డబ్బులు ఇచ్చినోళ్లు ఉన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా ఉండడంతో  కలెక్టర్‍ ఆధ్వర్యంలో నాలుగైదు సార్లు అప్లికేషన్లను వడపోశారు. అసలైన లబ్ధిదారులను 592 మందిని గుర్తించి జాబితా సిద్ధం చేశారు. గుడిసెలు కోల్పోయిన 341 మందికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు.  

మిగతా వారిలో అర్హత కలిగిన నిరుపేదలు, ఉద్యమకారులు, దివ్యాంగులను గుర్తించి అందించారు. 37 బ్లాకుల్లో 4 అంతస్తుల్లో ఒక్కదాంట్లో 16 చొప్పున నిర్మించిన ఇండ్లను ఎలాంటి వివాదాలు లేకుండా అధికారులు పంపిణీ పూర్తి చేశారు.  గుడిసెలు కోల్పోయిన వాళ్లు ఫ్లెక్సీలు, పరదాల మాటున ఏండ్లుగా బిక్కుబిక్కు మంటూ గడిపారు. చివరకు పదేండ్ల తర్వాత ఇండ్లు చేతికి అందడంతో లబ్ధిదారులు ఆనందంతో మురిసిపోయారు.

డబుల్‍ ఇంటి ఖరీదు రూ.60 లక్షలు!

 ఒక్కో ప్లాట్‍ ఖరీదు రూ.60 లక్షలు విలువ చేస్తుందని మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.  హనుమకొండ బస్టాండ్‍, జవహర్‍లాల్‍ నెహ్రూ స్టేడియం, ఏషియన్‍ మాల్‍, గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍తో పాటు కార్పొరేట్‍ ఆస్పత్రుల మధ్యన ఉండే అంబేద్కర్‍ కాలనీలో గజం జాగా ధర రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతున్నట్లు చెప్పారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి రూపంలో 59 గజాలు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. 

 గ్రౌండ్‍ ఫ్లోర్‍ లో ఇవ్వడం గ్రేట్‍  

నాలుగు ఫ్లోర్లలో నిర్మించిన డబుల్‍ ఇండ్లల్లో దివ్యాంగులకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ఎలాంటి పైరవీలు లేకుండా, తమ బాధలను అర్థం చేసుకుని ఫస్ట్ ఫ్లోర్‍లో కేటాయించడం గ్రేట్‍. చాలా ఆనందంగా ఉంది.

- ఎస్‍.రంజిత్‍ కుమార్‍, లబ్ధిదారుడు-

చాలా సంతోషంగా ఉంది


అంబేద్కర్‍ భవన్‍ కాలనీలోని పేద లబ్ధిదారులకు ఎక్కువగా ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సిటీ నడిబొడ్డున ఉన్న ఇండ్లు కావడంతో ఎవరికి ఇస్తారోననే ఆందోళన ఉండే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేదలకే ఇండ్లలో అధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులకే ఇండ్లు దక్కాయి. మా లబ్ధిదారుల తరఫున ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు.      - బేబి, లబ్ధిదారు 

ఇది మాకు పండుగ రోజు  ..

డబుల్‍ ఇండ్ల కోసం 10 ఏండ్లుగా ఎదురు చూశాం. కొందరు లీడర్లు మధ్యలో వీటిని అమ్ముకునే కుట్ర చేశారు.  మాకు దక్కు తాయోలేదోనని  భయపడ్డం.  ఇబ్బందులు లేకుండా ప్రస్తుత ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చింది. నిజంగా ఇది మాకు పండుగ రోజు.  
- గుగులోతు కల్పన, లబ్ధిదారు 

ఉద్యమకారులకు దక్కిన గౌరవం

తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని కట్టుబాట్లు దాటి 15 ఏండ్లు రోడ్డెక్కి కొట్లాడినా. కేసీఆర్‍ నుంచి కేటీఆర్‍, హరీశ్​రావు నా ఉద్యమ తీరును మెచ్చుకున్నారు. తీరా బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం వచ్చాక కనీస గౌరవం ఇవ్వలేదు సరికదా అవమానించారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం మా కుటుంబానికి డబుల్‍ బెడ్‍రూమ్ కేటాయించడమంటే ఉద్యమకారులను గౌరవంగా భావిస్తున్నా.

- రహీమున్నీసా,ఉద్యమకారిణి-