షాంపూలు, బిస్కెట్లు వంటి ప్రొడక్ట్స్ ఎక్కువ ​కొంటున్నరు

షాంపూలు, బిస్కెట్లు వంటి ప్రొడక్ట్స్ ఎక్కువ ​కొంటున్నరు

వెలుగు బిజినెస్​ డెస్క్ ​: రెండేళ్ల తర్వాత మళ్లీ రూరల్​ ఏరియాలలో షాంపూలు, బిస్కెట్లు,, సబ్బులు వంటి ప్రొడక్టులకు గిరాకీ పెరుగుతోంది. దేశంలోని మొత్తం ప్యాకేజ్డ్​ ఎఫ్​ఎంసీజీ (ఫాస్ట్​ మూవింగ్​ కన్జూమర్​ గూడ్స్​) సేల్స్​లో 35 శాతం గ్రామాల నుంచే వస్తోంది. ఈ సీజన్​లో పంటలు బాగా పండటంతోపాటు, లిక్విడిటీ మెరుగవడంతో రూరల్​ ఏరియాలలో అమ్మకాలు పుంజుకున్నట్లు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇన్​ఫ్రాపై ప్రభుత్వం ఖర్చు పెంచడంతోపాటు, పెండిండ్ల సీజన్​ కూడా డిమాండ్​ ఎక్కువవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. నవంబర్​ 2022లో రూరల్​ ఏరియాలో వాల్యూమ్స్​ 6–7 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు క్వార్టర్లలో ఈ వాల్యూమ్​ 2,3 శాతానికి మించలేదని పార్లే ప్రొడక్ట్స్​ కేటగిరీ హెడ్​ మాయాంక్​ షా చెప్పారు. 2022 ఫైనాన్షియల్​ ఇయర్లో పార్లే ప్రొడక్ట్స్​ కంపెనీ టర్నోవర్​ 2 బిలియన్​ డాలర్ల మార్కును దాటింది. పంటలు బాగుండడంతోపాటు, ఇన్​ఫ్లేషన్​ తగ్గడమే డిమాండ్​ పెరగడానికి కారణమని షా పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్​ రివైవల్​కు రూరల్​ డిమాండ్​ చాలా ముఖ్యం. గత మూడు వారాలుగా గిరాకీ పెరగడం చూస్తున్నామని, ముఖ్యంగా తక్కువ రేటుండే ప్యాక్స్​ (లో యూనిట్​ ప్యాక్స్​) బాగా అమ్ముడవుతున్నాయని డాబర్​ ఇండియా చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ అంకుష్​ జైన్​ వెల్లడించారు. వాటికా షాంపూ, ఫెమ్​ బ్లీచ్​వంటి ప్రొడక్టులను డాబర్​ అమ్ముతోంది. పెండ్లిండ్ల సీజన్​ కావడంతో  పర్సనల్​ కేర్​ ప్రొడక్టుల కేటగిరీలోనూ సేల్స్​ కొంత మెరుగయ్యాయని జైన్​ వివరించారు. డాబర్​ అమ్మకాలలో 47 శాతం రూరల్​ ఏరియాల నుంచే వస్తున్నాయని చెప్పారు. గిరాకీ ఊపందుకోవడంతో లక్ష గ్రామాలకు డైరెక్ట్​ డిస్ట్రిబ్యూషన్​ను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రూరల్​ ఏరియాలలో అమ్మకాలు పెరగడం తాము కూడా గమనించినట్లు ఇమామి మేనేజింగ్​ డైరెక్టర్​ హర్ష అగర్వాల్​ పేర్కొన్నారు. బోరోప్లస్​ క్రీమ్​ వంటి ప్రొడక్టులను ఈ కంపెనీ తయారు చేస్తోంది.ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచడంతో రూరల్​ ఏరియాలలో డిమాండ్​ మరింత పెరిగే ఛాన్స్​ ఉందని రేటింగ్స్​ ఏజన్సీ క్రిసిల్​ ఒక రిపోర్టులో వెల్లడించింది. మారికో, విప్రో కన్జూమర్​, బ్రిటానియా కంపెనీల ప్రతినిధులు సైతం గిరాకీ పెరిగినట్లు చెబుతున్నారు. ఆరు క్వార్టర్ల తర్వాత డిమాండ్​ పుంజుకుందని చెప్పారు.

రాబోయే రోజుల్లో మరింత జోరు....

రాబోయే రోజుల్లో డిమాండ్​ జోరు మరింత ఎక్కువవుతుందని ఆశిస్తున్నట్లు అగర్వాల్​ వెల్లడించారు. ఇమామి అమ్మకాలలో 45 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వచ్చాక, గత రెండేళ్లలో రూరల్​ ఏరియాలలో ఎఫ్ఎంసీజీ ప్రొడక్టుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. కరోనా కారణంగా సప్లయ్​చెయిన్​, డిస్ట్రిబ్యూషన్ సమస్యలను ఈ రంగంలోని కంపెనీలు ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత కమోడిటీల రేట్లు , ఫ్యూయల్​ ధర , ప్యాకేజింగ్​ ఖర్చులూ పెరగడంతో కంపెనీలు తమ ప్రొడక్టుల రేట్లను పెంచక తప్పలేదు. దీంతో తక్కువ రేట్లకు దొరికే ప్రొడక్టులను కొనడానికే రూరల్​ ఏరియాలలోని కన్జూమర్లు పరమితమయ్యారు. ఫలితంగా గిరాకీ పడిపోయింది.