ఆదివాసీలకూ ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి

ఆదివాసీలకూ ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి

ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకు 100% ఇవ్వాలని జీ వోనెం-3 ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖ ల్లోనూ ఇవ్వాలని ఉన్నా ఎన్నడూ సంపూర్ణంగా అమలయిన పాపాన పోలేదు . ఏజెన్సీ లో గిరిజనేతరుల వలసల కారణంగా జీవో3ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏజెన్సీలో గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తూ ఆదివాసీ ఉద్యోగాలను దొడ్డిదారిన దోచుకొని పోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొద్దోగొప్పో ఆదివాసీ ఉపాధ్యాయులు సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తున్నా కూడా పదోన్నతుల విషయంలో అన్యాయం చేస్తూ, వక్రభాష్యాలు పలుకుతూ  దశాబ్దాలుగా ఆదివాసీ ఉపాధ్యాయులకు దక్కాల్సిన వందలాది పోస్టులనూ అక్రమంగా గిరిజనేతరులకు చట్ట విరుద్దంగా దోచి పెడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆదివాసీ ఉపాధ్యాయులు స్థానిక ఏజెన్సీలో భారీగా నష్టపోతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తున్న సందర్భంలో ఆదివాసీల కు ఏజెన్సీ డీఎస్సీ పెట్టాలని ఆదివాసీ సంఘాల మేధావులు కోరుతున్నారు. ఏజెన్సీ ఆదివాసులు ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్న స్థితిలో వారికి ప్రత్యేక డీఎస్సీలను ఐటీడీఏ ద్వారా నిర్వహించాలి.  ఏజెన్సీ ఉత్తర్వు నెం. 3కు చట్ట బద్ధత కల్పించాలి. ఉద్యోగ నియామకాలతోపాటు పదోన్నతుల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఏజెన్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో గిరిజనులకు12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు ఏజెన్సీ ఉత్తర్వు 3 ప్రకారం, నూటికి నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తేనే ఆర్థిక ప్రగతితో కూడిన‘గిరిప్రగతి' లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏజెన్సీ వాసులకు అందుబాటులోనే ఉన్నత విద్యా సంస్థలను కూడా నెలకొల్పితే ఆదివాసులు సంపూర్ణ అక్షరాస్యులుగా ఎదుగుతారు.

- వూకె రామకృష్ణ