ఫేక్ వీసాలతో మోసం చేసిన ఏజెంట్ అరెస్ట్​

ఫేక్ వీసాలతో మోసం చేసిన ఏజెంట్ అరెస్ట్​

మెట్ పల్లి, వెలుగు: దుబాయ్ పంపిస్తామని ఫేక్ వీసాలిచ్చి యువకులను మోసం చేసిన ఓ గల్ఫ్ ఏజెంట్​ను  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెట్​పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఏలేటి రమేశ్, కేరళకు చెందిన మహ్మద్ ​హాసిఫ్​తో పాటు మరో ముగ్గురు కొన్నేండ్ల నుంచి దుబాయ్​లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుబాయ్​ వీసాల దందా మొదలు పెట్టారు. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన సుమారు 40  మందికి వీసాలు పంపిస్తామని నమ్మించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి మొదటి కిస్తుగా రూ.26,500 తీసుకుని నకిలీ వీసాలిచ్చారు.

బాధితులంతా దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అధికారులు పరిశీలించి నకిలీ వీసాలుగా గుర్తించి ఆపేశారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెలలో మెట్​పల్లికి వచ్చిన ఏలేటి రమేశ్​ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రెండో నిందితుడు మహ్మద్ హసీఫ్​కూడా కేరళకు రాగా బుధవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు.