పోడు భూముల.. పట్టాల కోసం పోరుబాట

పోడు భూముల.. పట్టాల కోసం పోరుబాట
  • మెట్​పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్​ను ముట్టడించిన గిరిజనులు
  • అర్హత ఉన్నా తమను పక్కన పెట్టారని ఆవేదన

మెట్ పల్లి, వెలుగు
దశాబ్దాలుగా తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు వస్తాయని ఎదురుచూసిన ఆ రెండు తండాల ప్రజలకు నిరాశే ఎదురైంది.  మెట్​పల్లి మండలం కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా నుంచి 209 మంది పట్టాల కోసం అప్లై చేసుకున్నారు. అయితే సర్కారు వీరిని పక్కనపెట్టింది. దీంతో ఆగ్రహించిన తండావాసులు సర్కారు తీరుకు నిరసనగా బుధవారం పెద్దసంఖ్యలో తరలివచ్చి మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. తమ తాతలు, తండ్రులు దశాబ్దాల క్రితమే రాళ్లు రప్పలు ఉన్న భూములను లక్షలు ఖర్చుపెట్టి సాగు యోగ్యంగా మార్చుకున్నారన్నారు.  అప్పటి నుంచి సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఇన్నేండ్లుగా పట్టాల కోసం పోరాడుతున్నా తమను నాటి సమైక్య ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  పోడు భూములకు పట్టాలు ఇస్తామని  సీఎం కేసీఆర్​ చెప్పడంతో తమ బతుకులు మారుతాయని ఆశించామన్నారు. ఇటీవల దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో  కేసీఆర్ తండా నుంచి 115 మంది, ఏఎస్సార్ తండా నుంచి 94 మంది దరఖాస్తులు చేసుకున్నామని తెలిపారు.

 దరఖాస్తులు పరిశీలించిన ఆఫీసర్లు తమ భూములను సర్వే చేశారన్నారు. అనంతరం రెండు తండాలకు చెందిన గిరిజనులు పోడు పట్టాలకు అనర్హులుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ఇప్పుడు భూములు లేవంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు.  ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయాలతో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు.  కాగా, సబ్ కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించిన గిరిజనులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పోలీసులు, గిరిజనులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సై శ్యామ్ రాజ్ వారిని సముదాయించి అక్కడినుంచి పంపించేశారు. ఈ విషయమై ఆర్డీవో  వినోద్ కుమార్ ను వివరణ కోరగా గిరిజనులు పెట్టుకున్న అప్లికేషన్లను సర్కారు నిబంధనల ప్రకారం పరిశీలించామన్నారు. అర్హులైన వారికే పట్టాలు అందజేస్తామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని, ఆ విషయాన్ని  ప్రభుత్వానికి నివేదించి పై ఆఫీసర్ల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మా అప్లికేషన్లు రిజెక్ట్ చేసిన్రు

రాళ్లు రప్పలతో నిండి ఉన్న భూమిని లక్షలు ఖర్చు చేసి చదును చేసుకున్నం. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేసి వచ్చిన దాంట్లో కలోగంజో తాగుతున్నం. ఈ భూములు  మా చేతికి వచ్చి 22 ఏండ్లు అయింది. తెలంగాణ సర్కారు వస్తే మా బతుకులు బాగుపడ్తయ్​ అనుకున్నం. పట్టాలు ఇస్తామంటే దరఖాస్తు చేసుకున్నం.  ఆఫీసర్లు సర్వే కూడా  చేసిన్రు. ఏమైందో తెల్వదు. అందరూ అనర్హులమంటూ రిజెక్ట్ చేసిన్రు.  అర్హుల జాబితాలో మా తండా కు చెందిన ఒక్కరి పేరు కూడా లేదు.  ప్రభుత్వం మాకు అన్యాయం చేయొద్దు. మా అందరికీ పోడు పట్టాలు ఇయ్యాలే.
- గుగ్లావత్ శ్రీరాం, కేసీఆర్ తండా