ఇంజక్షన్ వికటించి వ్యవసాయ కూలీ మృతి

ఇంజక్షన్ వికటించి వ్యవసాయ కూలీ మృతి
  • మృతదేహంతో ఆర్​ఎంపీ ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
  • ఖమ్మం జిల్లా అన్నారుగూడెంలో ఘటన 

తల్లాడ, వెలుగు: ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్​వికటించి ఖమ్మం జిల్లాలో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన కొంగల కృష్ణ(45) వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. బుధవారం అర్ధరాత్రి దగ్గుతోపాటు ఆయాసంగా ఉండడంతో సమీపంలోని ఆర్ఎంపీ అహ్మద్ పాషా వద్దకు వెళ్లాడు. ట్రీట్​మెంట్​లో భాగంగా కృష్ణకు ఆర్ఎంపీ ఓ ఇంజక్షన్ చేశాడు. ఇంజక్షన్ ​చేసిన తర్వాత దగ్గు, ఆయాసం తగ్గకపోగా ఎక్కువైంది. కుటుంబ సభ్యులను వెంటనే ఖమ్మంలోని హాస్పిటల్​కు తీసుకెళ్లాలని ఆర్ఎంపీ అహ్మద్​పాషా సూచించాడు. వెంటనే ఆటోలో తీసుకెళ్తుండగా దారిలోనే కృష్ణ చనిపోయాడు.

గురువారం మృతదేహంతో కృష్ణ కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇంజక్షన్ వికటించడంతోనే కృష్ణ మృతి చెందాడని ఆరోపించారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో మృతుని కుటుంబానికి పరిహారం కింద రూ.10 లక్షలు ఇస్తానని అహ్మద్​పాషా ఒప్పుకున్నారు. తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు.

మృతుడి కొడుకు జీవన్ కుమార్ ఫిర్యాదుతో కేసు ఫైల్​చేసినట్లు తల్లాడ ఎస్సై సురేశ్​తెలిపారు. అహ్మద్ పాషా ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్నాడని ఖమ్మం డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతికి బీజేపీ మండల అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు 2021లోనే ఫిర్యాదు చేశారు. ఆ టైంలో అధికారులు నోటీసులు ఇచ్చారు.