పొలాలకు సబ్సిడీ.. దునియాకు డేంజరే

పొలాలకు సబ్సిడీ.. దునియాకు డేంజరే
  • పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యవసాయ సబ్సిడీలు
  • భారీగా ఎరువులు, మందుల వాడకం.. భూమి, నీరు, గాలి కలుషితం
  • అడవులు పెంచేందుకు మళ్లించాలంటున్న సైంటిస్టులు

ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి రూ.7 కోట్ల వరకు వ్యవసాయ సబ్సిడీ కింద రైతులకు అందుతోందట. ఇంతలా డబ్బు ఖర్చు చేస్తున్నారంటే రైతులకు, జనాలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని, తక్కువ ధరకే తిండి దొరుకుతుందని అనుకుంటున్నారా? అస్సలు కాదు. పర్యావరణం నాశనమవుతోంది. వాతావరణ మార్పు విపరీతమవుతోంది. అడవి జంతువులు అడ్రస్‌‌ లేకుండా పోతున్నాయి. అసలు ఫామ్‌‌ సబ్సిడీకి, పర్యావరణాని, జంతువులకు ఏం సంబంధం అని డౌట్‌‌ రావొచ్చు. సబ్సిడీల వల్ల ఎక్కువ సంఖ్యలో పశువుల పెంపకం, ఎక్కువ భూమిని సాగు చేసేందుకు అడవులను నరకడం, ఇష్టమొచ్చినట్టు ఎరువులు, పురుగు మందులు వాడుతుండటంతో భూమి, నీరు, గాలి కలుషితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇస్తున్న రూ.50 లక్షల కోట్ల వ్యవసాయ సబ్సిడీలో ఒక్క శాతమే పర్యావరణానికి మేలు జరుగుతోందని ఫుడ్‌‌ అండ్‌‌ ల్యాండ్‌‌ యూజ్‌‌ కోఅలేషన్‌‌ పరిశీలనలో తేలింది. సబ్సిడీలను ఆపకపోతే మానవ జాతినే రిస్క్‌‌లో పెట్టినవాళ్లమవుతామని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయానికి తగ్గించిన సబ్సిడీని నేలలో కార్బన్‌‌ స్టోరేజీకి, చెట్లు పెంచడానికి వాడాలని సూచిస్తున్నారు.

సబ్సిడీ ఇస్తే ధరేం తగ్గదు

సబ్సిడీలతో ఆహార ఉత్పత్తులు తక్కువ ధరకే వస్తాయన్న వాదనను సైంటిస్టులు కొట్టిపారేశారు. ప్రస్తుతం వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆహారం కన్నా నాశనం అవుతున్నదే ఎక్కువని చెప్పారు. సస్టెయినబుల్‌‌ పద్ధతిలో హెల్దీ ఆహారాన్ని పండిస్తే భూసారం పెరుగుతుందని, ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయని వివరించారు. మాంసాన్ని, డెయిరీ ఉత్పత్తులను తగ్గిస్తే చాలా వరకు పర్యావరణంపై భారం తగ్గించొచ్చన్నారు. పశువుల మేత కోసం 83 శాతం ఫామ్‌‌ ల్యాండ్‌‌ను వాడుకుంటున్నారని,  వీటి ద్వారా18 శాతం కేలరీలే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఉత్తర అమెరికా, యూరప్‌‌ దేశాల ప్రజలు మాంసాన్ని 80 శాతం తగ్గించాలన్నారు. ఇలా చేస్తే ప్రస్తుతం పశుగ్రాసం పెంచుతున్న 60 శాతం   భూమిని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని వివరించారు.

మరో పదేళ్లలో చేస్తే  

వచ్చే పదేళ్లలో ఆహారోత్పత్తి , భూమిని వాడే పద్ధతిని మారిస్తే పర్యావరణానికి చాలా వరకు మంచి జరుగుతుందని సైంటి స్టులు చెబుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా సబ్సిడీని తగ్గించడంపై దృష్టి పెట్టాయి. యూరప్‌ దేశాల రైతులు ఫర్టిలైజర్ల వాడకాన్ని 17 శాతం వరకు తగ్గించు కున్నారు. సస్టెయినబుల్‌ పద్ధతికి మారారు. దీంతో అక్కడ ఉత్పత్తి పెరిగింది. చైనా కూడా ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తూ వస్తోంది. కోస్టారికా దేశంలో పశువులపై ఇచ్చే సబ్సిడీని అడవులను పెంచేందుకు ఖర్చు చేయడంతో మంచి ఫలితాలొచ్చాయి.

Agricultural subsidies destroying the environment