పంజాబ్‌లో ఒక్క రోజే 740 శాతం పెరిగిన వ్యవసాయ వ్యర్థాల మంటలు

పంజాబ్‌లో ఒక్క రోజే 740 శాతం పెరిగిన వ్యవసాయ వ్యర్థాల మంటలు

చండీగఢ్‌ : పంజాబ్‌లో వ్యవసాయ వ్యర్థాల మంటలు ఒక్క రోజే 740 శాతం మేర పెరిగాయి. ఆదివారం 1068 పంట వ్యర్థాల దహనం సంఘటనలు నమోదయ్యాయి. నాసా శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం తెలిసింది. దీంతో పంజాబ్ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ వ్యర్థాల మంటలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పంజాబ్‌, హర్యానాలో రైతులు ప్రతి ఏటా భారీగా వ్యవసాయ వ్యర్థాలను తగులబెడుతుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, పొగ మంచుకు ఇది దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 25 నుంచి 29 వరకు నాసా వరల్డ్‌ వ్యూ శాటిలైట్‌ చిత్రాల డేటాను పంజాబ్‌ అధికారులు విశ్లేషించారు. దీని ప్రకారం అక్టోబర్‌ 25 కంటే 26న ఎక్కువగా వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుపెట్టినట్టు తెలిసింది. అక్టోబర్‌ 27 తెల్లవారుజామున,  28న శనివారం పంట వ్యర్థాలను తగలబెట్టడం గణనీయంగా తగ్గింది. అయితే.. ఆదివారం ఉన్నట్టుండి ఇది 740 శాతం మేర పెరిగింది. పొలంలో కాల్చిన ఎర్రటి మంటలు నాసా వరల్డ్‌ వ్యూ శాటిలైట్‌ చిత్రాల్లో చుక్కలుగా కనిపించాయి.

మరోవైపు.. నాసా శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన పంజాబ్‌ అధికారులు అలెర్ట్‌ అయ్యారు. వ్యవసాయ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. గతేడాదితో పోలిస్తే సెప్టెంబరు 15 నుంచి అక్టోబర్ 29 వరకు వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడం 57 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంట అవశేషాల నిర్వహణ పథకం కింద కేంద్రం సుమారు రూ. 3 వేల 333 కోట్లు కేటాయించింది.