కరోనా ఊరికి తరిమింది..  ఎవుసం ఏడిపిస్తంది

కరోనా ఊరికి తరిమింది..  ఎవుసం ఏడిపిస్తంది
  • కరోనా ఊరికి తరిమింది..  ఎవుసం ఏడిపిస్తంది
  • లాక్​డౌన్​ తో ఉద్యోగాలు పోయి పల్లెబాట
  • వ్యవసాయంలోకి దిగిన వేలాది యూత్
  • ప్రస్తుత పరిస్థితులలో యువ రైతుల నారాజ్

వెలుగు, నెట్​వర్క్: గత లాక్​డౌన్​ లో వేలాది మంది యువత ఉద్యోగాలు కోల్పోయి పల్లెబాట పట్టారు. ఉన్న ఎకరమో, రెండెకరాలో సాగు చేసుకొని బతుకుదామని వ్యవసాయం మొదలుపెట్టారు. తీరా వరి వద్దనడం, ప్రత్యామ్నాయ పంటలపై అయోమయం నెలకొనడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ముఖ్యంగా వానకాలం పండించిన పంటలను అమ్ముకోలేక, యాసంగిలో ఏ పంటలు వేయాలో తెలియక ఆగమవుతున్నారు. వ్యవసాయం రంగంలో ఇంతటి గందరగోళం తామెప్పుడూ చూడలేదని, తమ తాతలు, తండ్రులు ఇన్నేళ్లుగా ఎవుసం చేస్తున్నా ఇలా  పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. వ్యవసాయంపై ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల మున్ముందు ఎవుసం చేసుడా? బంద్​పెట్టుడా? అర్థం కావట్లేదని వాపోతున్నారు.

అంతా అయోమయం
ఏడాది కింద దాదాపు అన్ని రంగాలపైనా కొవిడ్​ఎఫెక్ట్​ పడింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) రిపోర్ట్​ ప్రకారం దేశంలో 73.5 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయి వివిధ నగరాల నుంచి పల్లెబాట పట్టారు. హైదరాబాద్​లోనూ ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది యువకులు గ్రామాలకు తరలివెళ్లి వ్యవసాయాన్ని ఆల్టర్నేట్​ఉపాధిగా మార్చుకున్నారు. ఈలోపే కాళేశ్వరం కడుతున్నామని, కోటి ఎకరాలకు నీళ్లిస్తామని, వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో​అన్న మాటలతో మరింత ఉత్సాహంగా ఎవుసం మొదలుపెట్టారు. కానీ ఏడాది గడిచిందో లేదో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వానకాలం వరి కోసి నెలరోజులు దాటుతున్నా పండిన వడ్లను అమ్ముకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మరోవైపు యాసంగి లో వరి వేయవద్దంటూ బాంబు పేల్చిన రాష్ట్ర సర్కారు, ఇప్పటికీ ప్రత్యామ్నాయ పంటలపై ప్లాన్​ప్రకటించలేదు. ఓ దిక్కు అదును దాటిపోతున్నప్పటికీ ఏ ప్రాంతంలో ఏయే పంటలు, ఎప్పటివరకు వేసుకోవాలో ఇంకా  క్లారిటీ ఇయ్యలేదు.  ప్రభుత్వం చెబుతున్న చాలా పునాస పంటలు పండిస్తే గిట్టుబాటు కాక అప్పులపాలవుతామనే అభిప్రాయం అన్నదాతల్లో ఉంది. అన్నింటికీ మించి విత్తనాలు, మార్కెటింగ్​ సమస్యలపై ఎన్నో భయాందోళనలు ఉన్నప్పటికీ వాటిపై సర్కారు తరఫున ఎలాంటి భరోసా దక్కడం లేదు. దీంతో యువరైతులు వ్యవసాయమంటేనే వణికే పరిస్థితి కనిపిస్తోంది.

పొలంలో పని చేసుకుంటున్న ఈ యువ రైతు పేరు అజ్మీరా భరత్ నాయక్. ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం. కరోనాకు ముందు సిటీలో ప్రైవేట్ జాబ్​చేసిన భరత్ లాక్‌‌డౌన్‌‌ టైంలో ఉద్యోగం పోయి సొంతూరికొచ్చాడు. రెండేళ్లుగా తమ రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఈసారి ఎకరం పంట కోసి వడ్లు ఆరబెట్టాడు. మరో ఎకరంన్నర వరి కోయలేదు. కోతలైన వడ్లను కొనే దిక్కులేదని ఆవేదన చెందుతున్నాడు. యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతోందని, ఇప్పుడేం చేయాలో తెలియడం లేదని వాపోతున్నాడు. కరోనా ఉన్న ఉద్యోగం పోగొట్టి ఊరికి తరిమితే ఇక్కడ ఎవుసం ఏడిపిస్తోందని చెబుతున్నాడు.

బతుకుడు కష్టమైతాంది
పీజీ కంప్లీట్​చేసినా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో హైదరాబాద్​లోని ఓ ఫార్మా డిస్ట్రిబ్యూటర్​దగ్గర డెలివరీ వర్క్​చేసిన. లాక్​ డౌన్​తో పనిలేక శాలరీలు ఆపేశారు. రూం రెంట్, ఖర్చుల కోసం హైదరాబాద్​లో  తాపీ పనికి కూడా పోయిన. అయినా మెయింటెనెన్స్​కాక మాకున్న రెండెకరాలు సాగు చేద్దామని సొంతూరికి తిరిగొచ్చిన. ఒక ఎకరం పత్తి, మరో ఎకరంలో వరి వేసిన. వర్షాలకు పత్తి దెబ్బతిని లాసొచ్చింది. వరి కోతలు కంప్లీట్​ అయి వారం దాటినా వడ్లు కొంటలేరు. వరి వద్దంటున్న  రాష్ట్ర ప్రభుత్వం  ఏ పంట వేయాల్నో ఇప్పటికీ చెప్తలేదు. ఎవుసం చేసుడా? బంద్​పెట్టుడా? అంతా అయోమయంగా ఉంది.
- నూనె సంపత్, ధర్మారం, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా

జాబ్​ దొర్కుతలే.. సాగు నడుస్తలే
హైదరాబాద్​లోని గండి మైసమ్మ దగ్గరున్న గ్లాండ్ ఫార్మాలో ఉద్యో గం చేసేవాడిని. నెలకు రూ. 27 వేల దాక జీత మొచ్చేది. లాక్ డౌన్ టైమ్​లో కంపెనీ ఉద్యోగంలోంచి తీసేసింది. ఎక్క డా జాబ్​ దొరక్క ఇంటికి తిరిగి వచ్చాను. నాలుగు ఎకరాలు  కౌలుకు తీసుకుని ఎవుసం చేస్తున్నా.  వానాకాలంలో పండించిన  వడ్లు సెంటర్​లోకి తీసుకెళ్తే ఇంకా కాంటా కాలేదు.  దీంతోనే  పరే షాన్ అయితుంటే యాసంగిలో వరి వేయొద్దం టున్నరు.  ఏ పంట వేయాల్నో సమజైతలేదు. ప్రభుత్వమే మా భూముల్లో పంట లేసుకుని మాకు నెల జీతాలిస్తే ఈ తిప్పలు ఉండయి.
- గుమ్మడి ఎల్లయ్య, చిన్న గొట్టిముక్కల, మెదక్ జిల్లా

ఆగమైతన్నం
కరోనాకు ముందు హైదరాబాద్​లో జాబ్ చేసేవాన్ని. జాబ్​ పోవ డంతో ఊరికి రావాల్సొ చ్చింది. ఇక్కడ వ్యవ సాయం చేసుకుంటు న్న.  పోయిన యాసంగిలో 8 ఎకరాల్లో వరి పంట వేసిన. 180 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ సెంటర్లలో కొనకపోవడంతో క్వింటాలు కు రూ. 1,500 రేటుకు ప్రైవేట్​వాళ్లకు అమ్మిన.  దాదాపు రూ. లక్ష  నష్టమొచ్చింది. ఈసారి బల్మూర్ లో సెంటర్​పెట్టలేదు. వానలకు వడ్లు కలర్ మారినై.సెంటర్​ ఎప్పుడు ఓపెన్​ చేస్తారో.. ఎప్పుడు కొంటరో తెలవక ఆగమైతున్నం. 
- పి.విష్ణు, రైతు, బల్మూర్, నాగర్ కర్నూలు జిల్లా