లక్ష్యానికి దూరంగా పంటల సాగు..రైతన్న ఆందోళన

లక్ష్యానికి దూరంగా పంటల సాగు..రైతన్న ఆందోళన
  • పంటల నమోదు ప్రారంభించిన వ్యవసాయ శాఖ 
  • భారీ వర్షాలతో తేరుకోని పత్తి, సోయా, వరి పంటలు
  • లక్ష్యానికి దూరంగా పంటల సాగు..దిగుబడులపై రైతన్న ఆందోళన

నిర్మల్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వానలు తగ్గుముఖం పట్టడంతో పంటల సాగు వివరాలు నమోదు చేసేందుకు వ్యవసాయ అధికారులు రెడీ అయ్యారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. వర్షాలతో వరి, పత్తి, సోయాబీన్ పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వానాకాలం సీజన్​కు సంబంధించి అగ్రికల్చర్​ ఆఫీసర్లు సాగు అంచనాలతో ప్రణాళిక తయారుచేశారు. ఈ మేరకు పంటల సాగు జరిగినా.. భారీ వానలతో సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. 

లక్ష్యం తారుమారు 

నిర్మల్ జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాలకు పైగా పంటనష్టం వాటిలినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు పంటల నమోదుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పత్తి, సోయాబీన్, వరి పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారు.  ఇటీవలే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన అధికారులు పత్తి, సోయాబీన్ పంటలు భారీగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆందోళనలో పత్తి రైతు

పత్తి పంట పరిస్థితి దయనీయంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి 20 శాతం పంట కూడా చేతికొచ్చే అవకాశాలు లేవంటున్నారు. జిల్లాలో లక్షా 60 వేల ఎకరాలలో పంటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పత్తి మొక్కలు రెండు అడుగుల ఎత్తు కూడా పెరగకపోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు పత్తి చేలల్లో కలుపు మొక్కలు పెరిగి పంటను ఎదగనివ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కలుపు తొలగించేందుకు రైతులు కూలీల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పత్తి పంట దిగుబడి కాలం 100 రోజుల నుంచి 140 రోజుల వరకు ఉంటుందని చివరి వరకు కొంతమేరకైనా దిగుబడి రావచ్చన్న ఆశతో రైతులు ఉన్నారు.

సోయాపై ఆశలు అంతంతమాత్రమే..

జిల్లాలో 80 వేల ఎకరాలలో సోయాబీన్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈసారి  10 శాతం అదనంగా 90 వేల ఎకరాలలో సాగయింది. భారీ వర్షాల కారణంగా సోయా విపరీతంగా ఎత్తు పెరుగుతోంది. ఇలా పెరిగితే కాత పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు
పేర్కొంటున్నారు. 

సాగు పరిస్థితులు తెలుసుకునేందుకే పంట నమోదు

వానాకాలం పంటల సాగు పరిస్థితులను తెలుసుకునేందుకు బుధవారం నుంచి పంటల వివరాల నమోదు  స్టార్ట్​ చేశాం. 15 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పంటల నమోదు ద్వారా జిల్లాలో పంటల సాగు, దిగుబడుల అంచనాలు వేస్తాం. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 25 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు నిర్ధారించాం. పంట నమోదు కార్యక్రమంతో పూర్తి నష్టం వివరాలు తేల నున్నాయి.
- అంజి ప్రసాద్,  జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్

వరి సగమే సాగు...

వరి సాగు పరిస్థితి ఆశాజనకంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. చాలా చోట్ల వరి పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. ఈసారి వరి లక్ష ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా 50 వేల ఎకరాలు కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే చెరువులు, ప్రాజెక్టుల కింద వరి పంట సాగు చేశారు. ఇప్పటికే పంటలపై ఆశలు కోల్పోయామని.. పెట్టిన పెట్టుబడులు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.