ఆసియా గేమ్స్ ముంగిట ఇండియా మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఆసియాలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించు కుంది. సొంతగడ్డపై ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఖతర్నాక్ ఆటతో టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఓ దశలో 1-3తో వెనుకబడినా గొప్పగా పుంజుకొని మలేసియా పని పట్టింది. టోర్నీలో రికార్డు స్థాయిలో నాలుగోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకుంది.
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇండియా విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సెకండాఫ్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన హోమ్ టీమ్ 4–3తో మలేసియాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్‌లో జుగ్‌రాజ్ సింగ్ (9 వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్ (45వ ని), గుజ్రాంత్ సింగ్ (45వ ని), ఆకాశ్ దీప్ సింగ్ (56వ ని.) తలో గోల్‌తో ఇండియాను గెలిపించారు. మలేసియా తరఫున అజ్రాయి అబు కమల్ (14వ ని), రహీమ్ రెజీ (18వ ని), ముహమద్ అమినుద్దీన్ (28వ ని) తలో గోల్ చేశారు. ఏడు ఎడిషన్లలో ఇండియా అత్యధికంగా నాలుగోసారి ట్రోఫీ నెగ్గింది. దాంతో, పాకిస్తాన్ (3 సార్లు) వెనక్కునెట్టి టోర్నీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది. ఇక, థర్డ్ ప్లేస్ కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 5–3తో కొరియాను ఓడించింది.
స్టార్టింగ్‌లో డీలా
మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు వచ్చిన మలేసియా టైటిల్ ఫైట్‌లో ఇండియాకు గట్టి పోటీ ఇచ్చింది. గ్రూప్ దశలో ఆతిథ్య జట్టు చేతిలో 0–5 తేడాతో చిత్తయిన మలేసియన్స్ ఆఖరాటలో మాత్రం ఇండియాను ఓడించినంత పని చేశారు. స్టార్టింగ్ నుంచే పోటాపోటీగా ఆడింది. అయితే, బాల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఇండియా స్వేచ్ఛగా దాడులు చేసింది. ఈ క్రమంలో ఎనిమిదో నిమిషంలో ఇండియాకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. దీనికి జుగ్‌రాజ్ టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టడంతో హోమ్ టీమ్ ఖాతా తెరిచింది. కానీ, ఫస్ట్ క్వార్టర్ చివర్లో మలేసియా ప్లేయర్ అజ్రాయి చేసిన ఫీల్డ్ గోల్‌తో స్కోరు సమమైంది.
తర్వాతి నిమిషంలో ఇండియాకు మరో పెనాల్టీ కార్నర్ లభించినా హార్దిక్ తప్పిదంతో గోల్ అవకాశం చేజారింది. దాంతో, ఇరు జట్లు 1–1తో ఫస్ట్ క్వార్టర్ ముగించాయి. రెండో క్వార్టర్‌లో మలేసియా అనూహ్యంగా చెలరేగింది. 17వ నిమిషంలో ఆ టీమ్ ప్లేయర్ ఫిట్రి షాట్ సుమిత్ కాళ్లకు తగలడంతో రిఫరీ పెనాల్టీ కార్నర్ ఇచ్చాడు. దీనికి రహీమ్ తన డ్రాగ్‌ఫ్లిక్‌తో చేసిన గోల్‌కు ఇండియా ఫ్యాన్స్ స్టన్నయ్యారు. దాంతో, మలేసియా 2-–1తో లీడ్ సాధించింది. ఆ వెంటనే గ్రీన్ కార్డు అందుకున్న సుఖ్‌జీత్ రెండు నిమిషాల సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఈ టైమ్‌లో మన్‌దీప్ బాల్‌తో ముందుకొచ్చినా గోల్ చేయలేకపోయాడు. తర్వాతి నిమిషంలో మలేసియాకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. రెజీ డ్రాగ్ ఫ్లిక్ వైడ్‌గా వెళ్లింది. కానీ, ఐదు నిమిషాల తర్వాత దక్కిన పెనాల్టీ కార్నర్ ను అమినుద్దీన్ అద్భుత డ్రాగ్‌ఫ్లిక్‌తో క్రాస్ బార్‌కు కొంచెం కింది నుంచి బాల్‌ను నెట్‌లోకి పంపించాడు. దాంతో, మలేసియా 3–1తో స్పష్టమైన ఆధిక్యంతో ఫస్టాఫ్ ముగించింది.
సెకండాఫ్‌లో పంజా
టోర్నీలో తొలిసారి రెండు గోల్స్ వెనుకంజలోకి వెళ్లిన ఇండియా సెకండాఫ్‌లో పుంజుకునే ప్రయత్నం చేసింది. ఫ్యాన్స్ సపోర్ట్ నడుమ పూర్తిగా కౌంటర్ ఎటాక్ చేసింది. అయినా మూడో క్వార్టర్‌లో చివరి వరకూ గోల్ రాకపోవడంతో ఇండియా క్యాంప్‌లో టెన్షన్ మొదలైంది. అయితే, 45వ నిమిషంలో నీలకంఠ బాల్‌ను అందుకొని సర్కిల్ లోపల సుఖ్‌జీత్‌కు అందించాడు. అయితే, సర్కిల్ లోపల ప్రత్యర్థులు అతడిని కిందపడేయడంతో ఇండియాకు పెనాల్టీ స్ట్రోక్ రూపంలో గోల్డెన్ చాన్స్ లభించింది. దీనికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. ఆపై, హర్మన్‌ప్రీత్ నుంచి సర్కిల్‌లో బాల్‌ను అందుకున్న గుజ్రాంత్ చాకచక్యంగా గోల్ చేశాడు.
దాంతో, కొన్ని సెకండ్లలోనే ఇండియా స్కోరు సమం చేయగా ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. 3–3తో చివరి క్వార్టర్ ప్రారంభించిన ఇండియా విన్నింగ్ గోల్ కోసం ట్రై చేసింది. ఈ క్రమంలో వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లను హర్మన్‌ప్రీత్ వేస్ట్ చేశాడు. కానీ, తర్వాతి నిమిషంలోనే ఆకాశ్‌దీప్ ఇండియాకు విన్నింగ్ గోల్ అందించాడు. మన్‌దీప్ నుంచి పాస్ అందుకున్న ఆకాశ్‌దీప్‌కు వెనక్కి తిరుగుతూ కొట్టిన షాట్‌కు మలేసియా కీపర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. దాంతో 4–3తో ముందంజ వేసిన ఇండియా లీడ్ కాపాడుకొని ట్రోఫీ సొంతం చేసుకుంది.