
అహుజా రేడియో కంపెనీ ఇండియాలోని పబ్లిక్ అడ్రస్ ఎక్విప్‌మెంట్ తయారుచేసే కంపెనీల్లో ముందువరుసలో ఉంటుంది. ఇండియాకు స్వాతంత్ర్యం రావడానికి ఏడేండ్ల ముందే అహుజా ప్రయాణం మొదలైంది. ఈ కంపెనీని 1940లో అమర్నాథ్ అహుజా పెట్టారు. తర్వాత కంపెనీకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నిలబడింది. గత 8 దశాబ్దాలుగా అహుజా కంపెనీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. కాలానికి తగ్గట్టు ప్రొడక్ట్స్ తయారుచేస్తూ మార్కెట్లో నిలదొక్కుకుంటుంది. విదేశీ కంపెనీలు పోటీ ఇచ్చినా తట్టుకుని ఎదురు నిలిచింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ.. కొత్త ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అందుకే సౌండ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ ఇండస్ట్రీలో నమ్మకమైన బ్రాండ్‌గా అహుజా పేరు తెచ్చుకుంది.
దేశంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్(ఆడిటోరియం, అవుట్ డోర్లో నిర్వహించే ప్రోగ్రామ్స్ కోసం వాడే మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్లతో సహా అన్ని ఎక్విప్మెంట్స్) రంగంలో అహుజా రేడియోస్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంది. అందుకే ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో అనౌన్స్మెంట్లు, ఆడిటోరియమ్, కాన్ఫరెన్స్ హాల్స్‌లో సౌండ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్, సీమ్‌లెస్ కౌంటర్ కమ్యూనికేషన్, క్రౌడ్ కంట్రోల్.. లాంటి వాటికోసం అహుజానే ఎక్కువగా వాడుతున్నారు. అంతెందుకు ఫార్ములా 1 రేస్ ట్రాక్ లాంటి వాటిలో కూడా అహుజా ప్రొడక్ట్స్‌నే ఇన్‌స్టాల్ చేయించుకుంటున్నారు. నోయిడా, ఢిల్లీ మెట్రో స్టేషన్లు, ఐఐటి, ఐఐఎం లాంటి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లలో, అనేక మాల్స్‌లో వీటినే వాడుతున్నారు. అహుజా రేడియో ప్రొడక్ట్స్‌ని ఇండియాలో 500 మందికి పైగా డీలర్లు అమ్ముతున్నారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లోని 50 దేశాలకు ఎక్విప్‌మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తోంది.
ముందుచూపుతో...
అమర్నాథ్ అహుజా ఈ కంపెనీని కేవలం డబ్బు కోసమే పెట్టలేదు. దాని వెనుక అప్పటివరకు ఇండియాలో సరిగా లేని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌ని అందరికీ తక్కువ ధరలో అందించాలనే లక్ష్యం కూడా ఉంది. ఆయన 1940లోనే ‘‘స్వావలంబన” కాన్సెప్ట్‌తో కంపెనీని నడిపించారు. 83 ఏండ్లుగా అదే సిద్ధాంతంతో కంపెనీ నడుస్తోంది. ఎందుకంటే 83 ఏండ్ల కిందట ఇండియాలో పబ్లిక్ అడ్రస్, ప్రొఫెషనల్ ఆడియో ఎక్విప్‌మెంట్ తయారు చేసే సరైన కంపెనీ ఒక్కటీ లేదు. అన్ని ఎక్విప్మెంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్లు. అంతేకాదు.. వాటికి ఏదైనా రిపేర్ వస్తే.. బాగు చేయడం కష్టమయ్యేది. అందుకే ఇండియన్ కస్టమర్ల కోసం ఇండియన్ ఎక్విప్‌మెంట్ తయారుచేయాలనే లక్ష్యంతో అమర్నాథ్ ఈ కంపెనీ పెట్టారు. అప్పటి నుండి అహుజా కంపెనీ ఒక్కో మైలురాయిని దాటుతూ అంచెలంచెలుగా ఎదిగింది.
సక్సెస్ మంత్రం
ఇండియాతోపాటు విదేశాల్లోని కస్టమర్ల కచ్చితమైన అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేయడమే అహుజా సక్సెస్‌కు కారణం. ఈ కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రొడక్ట్ వెనుక చాలా రీసెర్చ్ ఉంటుంది. ప్రొడక్ట్స్ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. హై క్వాలిటీ మెటీరియల్‌తో ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తారు. ముఖ్యంగా ఏ ప్రొడక్ట్ అయినా ఎక్కువ రోజులు వాడగలిగేలా డిజైన్ చేస్తారు. అంతేకాకుండా అమ్మకాల కోసం అహుజాకు వైడ్ రేంజ్ డీలర్ నెట్‌వర్క్ ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ప్రొడక్ట్స్‌ని వీలైనంత తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీతో తయారు చేసి, కస్టమర్లకు అందించాలన్నది అహుజా కంపెనీ నమ్మే సిద్ధాంతం. అందుకే అహుజా ఇండియాలోని అతిపెద్ద ఆడియో కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.
గతంలో ఒకసారి అహుజా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ కంపెనీ వైస్ చైర్మన్ సందీప్ అహుజా ఇలా అన్నారు. ‘‘కస్టమర్లు సరసమైన ధరల్లో క్వాలిటీ ఎక్విప్మెంట్ని కోరుకుంటున్నారు అనే విషయం తెలుసుకున్నాం. అందుకే వ్యాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్‌నే తయారు చేస్తున్నాం. అహుజా సక్సెస్‌కు కారణం అదే. అహుజా ప్రొడక్ట్స్‌లో వాడే కాంపోనెంట్ల క్వాలిటీలో కూడా ఎప్పుడూ రాజీ పడలేదు. అందుకే 83 ఏండ్లు గడిచినా ఇప్పటికీ అహుజా ప్రొడక్ట్స్ ప్రపంచంలోని బెస్ట్ బ్రాండ్‌లతో పోటీ పడుతున్నాయి. వాటి కంటే చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి” అన్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి కంపెనీకి నేషనల్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఆ అవార్డ్‌ను 2006లో అప్పటి రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ నుంచి సందీప్ అహుజా అందుకున్నారు.
నెట్‌వర్క్
అహుజాకు ఇండియా వ్యాప్తంగా మంచి నెట్‌వర్క్ ఉంది. దేశంలో ప్రతి మూలన అహుజా డీలర్లు ఉన్నారు. ఉత్తరాన లడఖ్ నుండి దక్షిణాన త్రివేండ్రం వరకు, పశ్చిమాన భుజ్ నుండి తూర్పున మోకోక్‌చుంగ్ వరకు అహుజా డీలర్లు ఉన్నారు. అంతేకాదు.. అహుజాకు గవర్నమెంట్ నుంచి గుర్తింపు పొందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ ఉంది. అంతేకాకుండా డీలర్లు, సప్లైయర్ల నుంచి సలహాలు తీసుకుని ప్రొడక్ట్స్‌లో మార్పులు చేస్తుంది. ముఖ్యంగా క్వాలిటీ చెకింగ్ టీమ్ బాగా పనిచేస్తుంది. ‘‘జీరో డిఫెక్ట్” ప్రొడక్ట్స్‌ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. కస్టమర్‌ల నుండి వచ్చే ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుంటారు.
ఎక్కడ వాడుతున్నారు?
అహుజా రేడియోస్ నిజమైన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. అందుకే ఇండియాలో ఎక్కువమంది వాడుతుంటారు. ఆడిటోరియంలు, మీటింగ్ హాల్స్, రేస్ ట్రాక్‌లు, మెట్రో స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌లో ఎక్కువగా వాడుతున్నారు. మాల్స్, రిటైల్ అవుట్‌లెట్లలో కూడా వాడుతున్నారు. అంతెందుకు లోక్‌సభలో కూడా అహుజా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. 2013లో జరిగిన అలహాబాద్ మహా కుంభమేళా, 2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ కుంభమేళలో కూడా పబ్లిక్ అడ్రస్ కోసం అహుజా యాంప్లిఫయర్లు, స్పీకర్లు ఇన్‌స్టాల్ చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి యాంప్లిఫయర్లు, సౌండ్ మిక్సర్లు, మైక్రోఫోన్లు, స్పీకర్లు, పవర్డ్ స్పీకర్లు, కాన్ఫరెన్స్ సిస్టమ్, కౌంటర్ కమ్యూనికేషన్ సిస్టమ్... లాంటివి ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు ఇళ్లలో చిన్న చిన్న పార్టీలు జరిగినప్పుడు వాడేందుకు పోర్టబుల్ స్పీకర్లు కూడా తీసుకొచ్చారు.
కంపెనీ ఏర్పాటు
1940లోనే కంపెనీ ఏర్పాటు చేసినా.. పూర్తి స్థాయి ఫ్యాక్టరీ మాత్రం1958లో 36,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో కట్టారు. దీన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. తర్వాత 1970లో ట్రూసౌండ్ ప్రైవేట్ లిమిటెడ్(అహుజా గ్రూప్) పేరుతో 52,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో ఫ్యాక్టరీ కూడా ఢిల్లీలోనే మొదలుపెట్టారు.1984లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో ఫ్యాక్టరీ కట్టారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న మెయిన్ ఫ్యాక్టరీ 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
ఎగుమతులకు అనుమతి
అమెరికా, కెనడాలకు ప్రొడక్ట్స్‌ని ఎక్స్పోర్ట్ చేసేందుకు యూఎల్ అండ్ సీఎస్ఏ అనుమతి పొందిన మొదటి ఇండియన్ ఆడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ అహుజా. దాంతోపాటు 1984లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ), వాణిజ్య మంత్రిత్వ శాఖ అహుజాకి ఎక్స్పోర్ట్ హౌస్ హోదా ఇచ్చింది.
ఇదివరకు థియేటర్లో సినిమా వేయడానికి అరగంట ముందు నుంచే ఆ సినిమా పాటలు ఊరంతా వినిపించేవి. అనౌన్స్మెంట్ కోసం పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టేవాళ్లు. పాటలు వినిపించడం మొదలవగానే జనాలు థియేటర్‌కు పరుగులు పెట్టేవాళ్లు. అక్కడే కాదు.. అలా పెద్ద సౌండ్ ఎక్కడ పెట్టాలన్నా అందరూ అహుజా మైక్ స్పీకర్లే వాడేవాళ్లు. అంతెందుకు ఊళ్లలో జాతరలప్పుడు కూడా ఈ స్పీకర్లే వాడేవాళ్లు. అప్పట్లో అహుజా అంటే అంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా కుంభమేళాల్లో అహుజా స్పీకర్లే వాడుతున్నారు. ఎనభై ఏండ్ల కిందట మైక్ స్పీకర్లతో మొదలై ఇప్పుడు హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్స్ ప్రొడ్యూస్
చేసే స్థాయికి ఎదిగింది అహుజా.
మైల్‌స్టోన్స్
- 1942 : పబ్లిక్ అడ్రసెస్ ఎక్విప్‌మెంట్ ప్రొడక్షన్ మొదలైంది.
- 1952: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టి బర్మాకు ఎక్స్పోర్ట్ చేసింది.
- 1973: అహుజా ప్రొడక్ట్స్ యూరప్‌కు ఎగుమతి.
- 1992: అహుజా ఎక్విప్మెంట్స్ భారత పార్లమెంట్లో అమర్చారు.
- 2001 - 02: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీగా గుర్తింపు.
- 2005: అహుజా యాంప్లిఫయర్లు సేల్స్ 2 మిలియన్ యూనిట్ల మార్క్ దాటింది.
- 2013: మహా కుంభమేళాలో యాంప్లిఫయర్లు, 4,800 స్పీకర్లు ఇన్‌స్టాల్ చేశారు. అవి 58 చ.కి.మీ. లో 55 రోజుల పాటు ఇబ్బంది లేకుండా పనిచేశాయి.
- 2018: 4 మిలియన్ యూనిట్ల యాంప్లిఫయర్ అమ్మకాల మార్కును దాటింది.