
న్యూఢిల్లీ: ఎన్‌ఆర్ఐ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనే కొత్త ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మొదట పరాగ్‌ను జాబ్ నుంచి తీసేశారు. అగర్వాల్ గత మూడేళ్లుగా కోడింగ్, రీసెర్చ్‌పై ఫోకస్ పెట్టారు. మెషీన్ లెర్నింగ్ వ్యవస్థలపై తనకున్న అనుభవంతో ఏఐ సెక్టార్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మిగిలిన కంపెనీల కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఏఐ కంపెనీలకు చెందిన ఏఐ ఏజెంట్స్ కోసం మౌలిక సదుపాయాలను ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అభివృద్ధి చేస్తుంది.
ముఖ్యంగా, వెబ్‌లో కచ్చితమైన సమాచారం సెర్చ్ చేయడంలో ప్యారెలల్ బాగా పనిచేస్తుంది. అగర్వాల్ ఇప్పటికే 30 మిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించారు. ప్రముఖ పెట్టుబడిదారుల్లో వినోద్ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్) కూడా ఉన్నారు. ప్రస్తుతం 25 మంది ఉద్యోగులతో ఈ కంపెనీ నడుస్తోంది. పరాగ్ అగర్వాల్ స్టాన్‌ఫోర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ డాక్టరేట్ పూర్తి చేశారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ విజేత అయిన ఆయన, ట్విట్టర్‌లో సీటీఓగా ఎదిగి, 2021లో సీఈఓగా నియమితులయ్యారు. ట్విట్టర్‌లో అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ, అల్గారిథమిక్ టైమ్‌లైన్ వంటి కీలక అంశాల్లో పని చేశారు.