ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పాలనను గాలికొదిలేసినయ్

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి

ములుగు, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని, పాలనను గాలికొదిలేసి, విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి విమర్శించారు. ములుగులో ఆదివారం డీసీసీ ప్రెసిడెంట్​నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ నిర్వహించగా.. చీఫ్ గెస్టులుగా రోహిత్ చౌదరితో పాటు ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

కాంగ్రెస్ ​పార్టీ భారత్ జోడో పాదయాత్ర అనగానే కేంద్రానికి ఈడీ గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు ఒక్క ఏడాది కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల రేట్లు పెంచి, పేదలపై భారం మోపిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, పోడు పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయాయని, మాటలు తప్ప చేతలు లేని సీఎంగా కేసీఆర్ మిగిలిపోతారన్నారు.

కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?
టీఆర్ఎస్ లీడర్లకు రావు పద్మ సవాల్

హనుమకొండ సిటీ, వెలుగు :  తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్ లీడర్లు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాసంగ్రామ యాత్రకు సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చివరికి విజయవంతమైందన్నారు. హనుమకొండలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ వైపు న్యాయం గెలవడాన్ని టీఆర్ఎస్ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాకతో ఉమ్మడి వరంగల్ బీజేపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మునుగోడు ఉపఎన్నికలోనూ దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గుండె విజయరామారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి దేశానికి కూడా పాకిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను ఇంటికే  పరిమితం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు కందగట్ల సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, గురజాల వీరన్న, ఓబీసీ మోర్చా నాయకులు  సారంగపాణి 
పాల్గొన్నారు.

మళ్లీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే..
బచ్చన్నపేట,వెలుగు:  బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. ఆదివారం బచ్చన్నపేటలో కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో దేశంలోనే ముందుందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. సీఎం కేసీఆర్ పేదలను ఆదుకోవాలని చూస్తుంటే, కేంద్రం సబ్సిడీలను నిలిపివేయాలని చూస్తోందని ఆరోపించారు.. పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్​ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్​చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, పీఏసీఎస్​ చైర్మన్​ పూర్ణచందర్ తదితరులున్నారు.

మళ్లీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే..
బచ్చన్నపేట,వెలుగు:  బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. ఆదివారం బచ్చన్నపేటలో కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో దేశంలోనే ముందుందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. సీఎం కేసీఆర్ పేదలను ఆదుకోవాలని చూస్తుంటే, కేంద్రం సబ్సిడీలను నిలిపివేయాలని చూస్తోందని ఆరోపించారు.. పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్​ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్​చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, పీఏసీఎస్​ చైర్మన్​ పూర్ణచందర్ తదితరులున్నారు.

ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ
చిట్యాల, వెలుగు: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలంతా అండగా నిలవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చిట్యాల మండలంలోని దూత్​పల్లి, ఒడితల, కొత్తపేట, గోపాలపురం, ముచినిపర్తి, చల్లగరిగ, జూకల్ గ్రామాల్లో ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, రానున్న రోజుల్లో కేసీఆర్ కు ప్రజలు అండగా నిలవాలన్నారు.

పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే
పర్వతగిరి(సంగెం), వెలుగు: రాష్ట్రంలో  ప్రతి గ్రామాలకు ప్రతినెలా నిధులు కేటాయించి, అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల, తీగరాజుపల్లి గ్రామాల్లో ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. అనంతరం మండలకేంద్రంలో మహిళా భవన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
వర్ధన్నపేట, వెలుగు: పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​చెప్పారు. ఆదివారం తన క్యాంప్ ఆఫీసులో 56 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. మరో 50 మందికి సీఎం రిలీఫ్​ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. డీసీసీబీ చైర్మన్ రవీందర్​రావు, జడ్పీటీసీ బిక్షపతి ఉన్నారు.

షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం
కొత్తగూడ, వెలుగు: షార్ట్ సర్క్యూట్​లో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దబ్బెట రమేశ్, అతని కుటుంబసభ్యులు శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కాలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలింది. సర్టిఫికెట్లు సైతం దగ్ధమైంది. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. సంఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం డీటీ నర్సయ్య పరిశీలించి, పంచనామా చేశారు. ఓడీసీఎంఎస్ వైస్ చైర్​పర్సన్ దేశీడి శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం, కోదండరామాలయం ట్రస్ట్ మెంబర్స్ రూ.10వేల ఆర్థిక సాయం చేశారు.

రోడ్లపై గుంతలతో యాక్సిడెంట్లు

నెల్లికుదురు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి నెల్లికుదురు, కేసముద్రం వెళ్లే రూట్లలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా గుంతలు ఏర్పడడంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వర్షాలు తగ్గినా గుంతలు పూడ్చకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా రూట్లలో నిత్యం గ్రానైట్ లారీలు తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇకనైనా ఆఫీసర్లు స్పందించి, రోడ్లకు రిపేర్లు చేపట్టాలని ప్రయాణికులు 
కోరుతున్నారు.

మావోయిస్టులకు సహకరించొద్దు
కొత్తగూడ, వెలుగు: మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దని ఎస్పీ శరత్ చంద్ర కోరారు. ఇటీవల ఏజెన్సీలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఆదివారం ఆయన గంగారం మండలంలోని మర్రిగూడెం, కామారం గ్రామాల్లో పర్యటించారు. మావోయిస్టుల ఆచూకీ తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, తగిన పారితోషికం కూడా ఇస్తామన్నారు. అంతకుముందు కొత్తగూడ, గంగారం పోలీస్ స్టేషన్లను సందర్శించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఆయన వెంట గూడూరు సీఐ యాసిన్, ఎస్ఐలు నగేశ్, ఉపేందర్ ఉన్నారు.

పాపన్న స్వగ్రామాన్ని మండలం చేయాలి
రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా గుర్తించాలని 15 గ్రామాలకు చెందిన సర్పంచులు ఆదివారం తీర్మానం చేశారు. సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఖిలాషాపూర్ గ్రామం మండలం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మండలం చేయడం ద్వారా పర్యాటకంగానూ గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. మండలం ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సహకరించాలని కోరారు.