బీఆర్ఎస్​కు నష్టం కల్గించకుండా .. తొమ్మిది స్థానాల్లో మజ్లిస్​ పోటీ

 బీఆర్ఎస్​కు నష్టం కల్గించకుండా  ..  తొమ్మిది స్థానాల్లో మజ్లిస్​ పోటీ

హైదరాబాద్‌, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. బీఆర్ఎస్​కి నష్టం కలిగించకుండా తాము గెలిచే నియోజకవర్గాల్లోనే పోటీ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న అంబర్​పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్​నగర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్ తదితర సెగ్మెంట్లలోనూ పోటీకి దూరంగా ఉంది. బీఆర్ఎస్ అనుకూల ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంలో మజ్లిస్ ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికితోడు తన రాజకీయ స్వార్థం కోసమే ఈ స్ట్రాటజీ ఎంచుకున్నదనే విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ సారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగుతున్నది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్.. ఇండిపెండెంట్​గా బరిలోకి దిగి 45వేల ఓట్లు సాధించాడు. 

ఈసారి జూబ్లీహిల్స్ నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దించుతున్నది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్​కు చెక్ పెట్టాలని భావిస్తున్నది. ఈ సెగ్మెంట్​లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ కు టర్న్ అయితే అజారుద్దీన్ గెలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​కు అయినా లబ్ధి చేకూర్చేలా చేయాలనేది మజ్లిస్ స్ట్రాటజీ. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. 

నాంపల్లి, చార్మినార్ సెగ్మెంట్ల ఫలితాలు రివర్స్ అయినా.. మజ్లిస్ సీట్ల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు రాజేంద్రనగర్​ను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు. కానీ.. ఈసారి ఫోకస్ అంతా కాంగ్రెస్​పైన పెట్టినట్లు స్పష్టం అవుతున్నది. మజ్లిస్ పోటీ చేసే స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​కు మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. స్టేట్​లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఆ పార్టీపైనే అసదుద్దీన్ విమర్శలు గుప్పిస్తున్నారు.