కాంగ్రెస్ కు పది సీట్లు పక్కా..మరో ఆరింటిపై  ఫోకస్

కాంగ్రెస్ కు పది సీట్లు పక్కా..మరో ఆరింటిపై  ఫోకస్
  • సికింద్రాబాద్, చేవెళ్ల, మాల్కాజ్​గిరి,మహబూబ్​నగర్​, కరీంనగర్​లో బీజేపీతో గట్టి పోటీ
  • మెదక్​లో బీఆర్​ఎస్​తో టఫ్ ​ఫైట్​
  • ఆయా చోట్ల విస్తృత ప్రచారంతోపాటు చేరికలు స్పీడప్​
  • నేటి నుంచి 6 రోజులపాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్​లో 
  • సీఎం బిజీ.. భారీ ర్యాలీలు.. ఎక్కడికక్కడ సభలు
  • సెగ్మెంట్లలో కాంగ్రెస్​ పరిస్థితిపై సీఎం​కు సునీల్​ కనుగోలు రిపోర్టు
  • పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్​ ప్రత్యేక వ్యూహాలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎలాగైనా14 ఎంపీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు.. ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ టార్గెట్​ను చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా, ఇందులో పది సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్​ కాన్ఫిడెన్స్​తో ఉన్నారు. పార్టీ సర్వేల్లోనూ ఈ పదిచోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్​ను మినహాయిస్తే.. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్​గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్​ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్​కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఓ రిపోర్టు ఇచ్చారు. పోలింగ్​కు మరో మూడు వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్టులో వివరించారు. 

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్​గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్​లో బీజేపీతో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నదని.. మెదక్ లో బీఆర్ఎస్ తో టైట్​ ఫైట్​ ఉందని రిపోర్టులో సునీల్​ కనుగోలు పేర్కొన్నారు. దీంతో ఆ ఆరు ఎంపీ సెగ్మెంట్లలో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు సీఎం రేవంత్​రెడ్డి రెడీ అయ్యారు. అక్కడ విస్తృత ప్రచారం చేయడంతో పాటు మండల, నియోజకవర్గస్థాయిలో చేరికలను స్పీడప్​ చేయాలని భావిస్తున్నారు. 

ఆ ఆరు చోట్ల ఇదీ పరిస్థితి

    సికింద్రాబాద్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో నిలిచారు. పార్టీలో సమన్వయ లోపంతో ఇక్కడ కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లు సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​కు రిపోర్టులు అందాయి. 


    చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల షెడ్యూల్​కు ముందే ఆయన బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్​ కేడర్​ను కలుపుకపోడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. 


    మల్కాజ్​గిరిలో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి బరిలో నిలిచారు. ఆమె చేవెళ్ల నుంచి పోటీకి రెడీ అయిన టైమ్​లో పార్టీలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలతో చివరి క్షణంలో మల్కాజ్​గిరి బ రిలో నిలవడంతో కాంగ్రెస్ లో పాత, కొత్త నేతల మధ్య కొంత కో ఆర్డినేషన్ సమస్య ఏర్పడింది. 


    మహబూబ్​నగర్​ నుంచి కాంగ్రెస్​ తరఫున వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ డీకే అరుణ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మహబూబ్​నగర్​ సెగ్మెంట్​ సీఎం రేవంత్​రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీటు కావడంతో.. ఇక్కడ  కాంగ్రెస్​, బీజేపీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్​ రెండుసార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు. శుక్రవారం వంశీ చంద్ నామినేషన్  కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్​ కానున్నారు. ఈ సీటును గెలిచి తీరాలని పట్టుదలతో సీఎం రేవంత్​ ఉన్నారు. 


    కరీంనగర్​లో బీజేపీ తరఫున బండి సంజయ్ బరిలో ఉండగా.. ఇక్కడ ఇప్పటికీ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇన్​చార్జ్​ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. వెలిచాల రాజేందర్ రావుకే కాంగ్రెస్​ టికెట్​ దక్కవచ్చనే ప్రచారం జరుగుతున్నది. 


    మెదక్​లో కాంగ్రెస్ తరఫున నీలం మధు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్​ చేయాల్సిన అవసరాన్ని సునీల్​ కనుగోలు నొక్కిచెప్పారు. దీంతో  ఈ నెల 20న సీఎం రేవంత్ ఈ సెగ్మెంట్​లో పర్యటించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నారు. 


ప్రచారంపైనే  సీఎం దృష్టి 


    కేరళలోని వయనాడ్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున  రెండు రోజులు అక్కడ ప్రచారం చేపట్టిన సీఎం రేవంత్​రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు.

దీనికి సంబంధించి షెడ్యూల్​ను కూడా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇటు నామినేషన్ల దాఖలు కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత ఏర్పాటు చేసే సభల్లో రేవంత్​ ప్రసంగించనున్నారు. ఈ నెల 25తో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో 24 వరకు దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ  నామినేషన్లు వేయనున్నారు. దీంతో సీఎం రేవంత్ శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు వరుసగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టి, సభల్లో పాల్గొని పార్టీ కేడర్​లో జోష్ తేవడంతో పాటు ప్రజలకు కాంగ్రెస్ వంద రోజుల పాలనను వివరించనున్నారు.


    ఈనెల 19న ఉదయం మహబూబ్​నగర్, సాయంత్రం మహబూబాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. మహబూబ్​నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్​ నామినేషన్ వేయనున్నారు.


    20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్​ పాల్గొని సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం కర్నాటక వెళ్లనున్న సీఎం .. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 


    21న భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్  వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసి రేవంత్  పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు.


    22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, 23న నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవి,  24న ఉదయం జహీరాబాద్ అభ్యర్థి సురేశ్​ షెట్కార్, మధ్యాహ్నం వరంగల్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ కార్యక్రమాల్లో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొంటారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 

వచ్చే నెల మొదటివారంలో అగ్రనేతల రాక

వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్​ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.  ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటిస్తారని, బహిరంగ సభలతో పాటు రోడ్​ షోల్లోనూ పాల్గొంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.