
వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హాజరు కాగా, వారి సమక్షంలో వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
చైర్మన్‌గా కమ్మగోని ప్రభాకర్‌గౌడ్ ను ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌ను ఎమ్మెల్యే, బ్యాంక్ చైర్మన్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, మండల పరిధిలోని నర్సింహులగూడానికి చెందిన బుచ్చిరెడ్డి చైర్మన్ పదవిని ఆశించగా, ఆలయ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో మనస్థాపంతో ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు.