యూకే, భారత్‌‌ మధ్య విమానాలు రద్దు

యూకే, భారత్‌‌ మధ్య విమానాలు రద్దు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజు సుమారు రెండున్నర లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో భారత్‌‌కు రావాలంటే అందరూ భయపడుతున్నారు. ఇండియాకు వెళ్లాలనుకునే వారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను మానుకుంటే మంచిదని తమ దేశ పౌరులకు అమెరికా సూచించింది. ఈ క్రమంలో యునైటెడ్ కింగ్‌‌డమ్ కూడా భారత్‌‌కు ప్రయాణాలపై పలు ఆంక్షలు విధించింది. ఈ నెల 24వ తేదీ నుంచి 30 వరకు యూకే నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే విమానాలు రద్దయ్యాయి. యూకే ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇరు దేశాల మధ్య తమ విమానాలు వారం రోజులపాటు నడవబోవని ట్విట్టర్ ద్వారా ఎయిర్ ఇండియా తెలిపింది. వారంలో ఒకసారి యూకే నుంచి ఢిల్లీ, ముంబైకి ఫ్లయిట్‌‌లు నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది.