లాభాల బాటలో ఎయిర్​లైన్స్​ కంపెనీలు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్లు

లాభాల బాటలో ఎయిర్​లైన్స్​ కంపెనీలు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: రెండేళ్ల కష్టాల తర్వాత ఎయిర్​లైన్స్​ కంపెనీలు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్లు లాభాల బాటలోకి నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విమాన ప్రయాణాలు పెద్దగా సాగని విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగంలోని ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో రూ. 1,900 కోట్ల నికర లాభం ఆర్జించనుందని అంచనా. మూడో క్వార్టర్లో ఎయిర్​లైన్స్​ కంపెనీల పనితీరును బట్టి ఇది అర్థమవుతుంది. 

అదరగొట్టిన ఇండిగో

మార్కెట్ వాటా ప్రకారం దేశంలో అతి పెద్ద ఎయిర్​లైన్​గా పేరొందిన ఇండిగో కిందటి క్వార్టర్లో రికార్డు లెవెల్​ ప్రాఫిట్​ ప్రకటించింది. మరోవైపు మొదలైన తర్వాత మొదటిసారిగా బ్రేక్​ఈవెన్​ సాధించినట్లు విస్తారా వెల్లడించింది. అనూహ్యంగా స్పైస్​జెట్​ లిమిటెడ్​ కూడా తన లాభాన్ని నాలుగు రెట్లు పెంచుకుంది. ఈ కంపెనీకి రూ. 106.80 కోట్ల నికర లాభం వచ్చింది. న్యూఢిల్లీ, ముంబై ఎయిర్​పోర్టులు రెండూ ప్రైవేటు రంగంలోనే నడుస్తున్నాయి. ఈ రెండు ఎయిర్​పోర్టుల వల్లే ప్రధానంగా ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ)కి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ఎందుకంటే ఈ రెండిటినీ నడిపే కంపెనీలు రెవెన్యూలో కొంత పర్సంటేజీని ఏఏఐకి చెల్లించాలి. ఎయిర్​ ట్రాఫిక్​ మెరుగుపడిన కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏఏఐ నికరలాభం సంపాదించనుందని స్పోక్స్​పర్సన్​ చెప్పారు. ఈ లాభం సుమారు రూ. 1,900 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. 

ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి 2023 దాకా అంటే 10 నెలల్లో దేశంలోని ఎయిర్​పోర్టులు 267 మిలియన్​ల మంది పాసింజర్లను హ్యాండిల్​ చేశాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. కొవిడ్​కి ముందు అంటే 2019–20 లోని ఎయిర్​ట్రాపిక్​లో 91 శాతాన్ని ఈ ఏడాది అందుకోగలిగాయి. ఫిబ్రవరి నుంచి ఎయిర్​ ట్రాఫిక్ జోరు మరింత పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సగటున రోజుకి 4.2 లక్షల మంది విమాన ప్రయాణాలు చేశారు. డిసెంబర్​ 2022 లో ఈ సంఖ్య 4.1 లక్షలు మాత్రమే. మార్చి 2022 తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో ఏఏఐకి రూ. 8.8 కోట్ల నికర లాభమే వచ్చింది. ఆ ఫైనాన్షియల్​ ఇయర్లో రెవెన్యూ రూ. 6,841 కోట్లు. 25 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా 2020–21 లో ఏఏఐ రూ. 1,962 కోట్ల నష్టం ప్రకటించింది. కరోనా కారణంగా ఎయిర్​ ట్రావెల్​ డిమాండ్​ తగ్గిపోవడం వల్లే నష్టాలు వచ్చాయి. ​ అదే కనక, 2019–20 కి చూస్తే ఏఏఐ రూ. 12,387 కోట్ల రెవెన్యూ మీద రూ. 1,985 కోట్ల నికర లాభం సంపాదించింది. 2021–22 కి డివిడెండ్​ చెల్లించలేమని ప్రభుత్వాన్ని అనుమతి కోరిన ఏఏఐ ఈ ఫైనాన్షియల్​ ఇయర్​కు మాత్రం నికరలాభంలో 30 శాతం దాకా డివిడెండ్​గా ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఏఐ కింద దేశంలోని 100 ఎయిర్​పోర్టులున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. 

టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచే వెసులుబాటు వద్దు..

ఫ్రీ మార్కెట్ ఎకానమీ పేరుతో ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లను ఎయిర్​లైన్స్​ కంపెనీలు వసూలు చేయకుండా చూడాలని పార్లమెంటరీ పానెల్​ ఒకటి అభిప్రాయపడింది. విమాన టికెట్లకు అప్పర్​, లోవర్​ క్యాప్స్​ (పరిమితులు) పెట్టాల్సిందిగా సివిల్​ ఏవియేషన్​ మినిస్ట్రీని ఈ ప్యానెల్​ కోరింది. ఒకవైపు ప్రైవేటు రంగంలోని ఎయిర్​లైన్స్​ కంపెనీల ప్రయోజనాలను కాపాడుతూనే, మరోవైపు ప్రయాణికుల బాగోగులు కూడా పట్టించుకోవల్సిన అవసరం ఉందని ప్యానెల్​ పేర్కొంది. తమ ఇష్టా రాజ్యంగా రేట్లను పెంచుకునే వెసులుబాటు  కంపెనీలకు ఇవ్వరాదని అభిప్రాయపడింది. పీక్​ ట్రావెల్​ సీజన్స్​లో రేట్లు అకస్మాత్తుగా పెరగడం తెలిసిందే. ఈ సమ్మర్​ వెకేషన్​ టైమ్​లోనూ విమాన టికెట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 27 నెలల తర్వాత కిందటి ఆగస్టు నెలలో విమాన టికెట్ల రేట్లపై పరిమితులను ప్రభుత్వం తొలగించింది.  రెండు నెలల లాక్​డౌన్​ తర్వాత మే 25, 2020 నాడు సర్వీసులు మొదలయినప్పుడు టికెట్ల రేట్లపై  లోవర్​, అప్పర్​ లిమిట్స్​ను ప్రభుత్వం పెట్టింది. ఎయిర్​లైన్స్​కంపెనీలు నష్టాల పాలవకుండా కాపాడటానికి లోవర్​ లిమిట్స్​ను కూడా నిర్ణయించారు.  టికెట్ల రేట్లు పెంచుకునేలా ఇప్పుడున్న వెసులుబాటు ఎయిర్​లైన్స్​ కంపెనీలకు ఉండకూడదని,  లోవర్​, అప్పర్​ లిమిట్స్​ నిర్ణయించే మెకానిజం ఉండాలని  పానెల్​ పేర్కొంది.