న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో కలిసి ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మార్కెట్‌ప్లేస్‌ను లాంచ్ చేసిందని భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇచ్చే స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏడాదికి 9.1 శాతం వరకు వడ్డీ లభిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో ఎయిర్‌టెల్ ఫైనాన్స్ టై అప్ అయ్యింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ట్యాబ్‌లో ఎఫ్‌డీ సెక్షన్ ఉంటుంది.
ఇందులోకి వెళ్లి ఎఫ్‌డీ ఓపెన్ చేయొచ్చు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెట్టొచ్చని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతేకాకుండా ఎఫ్‌డీ చేసిన ఏడు రోజుల తర్వాత నుంచే ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను, గోల్డ్ లోన్లను, ఫ్లెక్సీ క్రెడిట్ పర్సనల్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది.