విలీనాన్ని ఆమోదించేందుకు రూ.15 వేల కోట్లు కట్టండి

విలీనాన్ని ఆమోదించేందుకు రూ.15 వేల కోట్లు కట్టండి
  • విలీనాన్ని ఆమోదించేందుకు పలు చార్జీలు
  • వీటిపై ఎయిర్‌ టెల్‌ కోర్టుకు వెళ్లే అవకాశం

టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎస్‌)ను విలీనం చేసుకునేందుకు ఎయిర్‌ టెల్‌ భారీ మొత్తం చెల్లించాల్సి రావొచ్చు. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజ్‌ చార్జి (ఎస్‌యూసీ), వన్‌ టైం స్పెక్ట్రం చార్జ్‌‌ (ఓటీఎస్‌సీ) కింద రూ.15 వేల కోట్లు కడితేనే విలీనానికి అంగీకరిస్తామని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్ టెలికాం (డాట్‌) షరతు విధించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎస్‌యూసీగా ఎయిర్‌ టెల్‌ రూ.10 వేల కోట్లు, టీటీఎస్ఎల్‌ రూ.2,800 కోట్లు బకాయిపడ్డారని డాట్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఓటీఎస్‌సీకి గానూ ఎయిర్‌ టెల్‌ నుంచి మరో రూ.రెండు వేల కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. విలీనమవుతున్న రెండు కంపెనీల లైసెన్సు ఫీజులను డాట్‌ అధికారులు ప్రస్తుతం లెక్కిస్తున్నారు. ఇది కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుందని మరో సీనియర్‌ అధికారి తెలిపారు. లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, ఓటీఎస్‌సీ చెల్లించడానికి ఎయిర్‌ టెల్‌ గతంలోనే అంగీకరించింది. ఎన్సీఎల్టీ అంగీకరించినా.. నష్టాల్లో ఉన్న టీటీఎస్‌ఎల్‌ ఎయిర్‌ టెల్‌ లో విలీనం కావడానికి ఎన్సీఎల్టీ గత నెల అంగీకరించింది. ఇందుకు డాట్‌ అనుమతి తప్పనిసరి.

టీటీఎస్‌ఎల్‌ ను కొంటున్నట్టు ఎయిర్‌ టెల్‌ 2017 అక్టోబరులో ప్రకటించింది. డాట్‌ రూల్స్‌‌ ప్రకారం అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ ( ఏజీఆర్‌ )లో ఎనిమిది శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఎస్‌యూసీగా ఐదుశాతం వసూలు చేస్తారు. ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన టెల్కో ఓటీఎస్‌సీ కూడా చెల్లించాలి. ఒక్కో సర్కిల్‌ లో 4.4 మెగాహెజ్‌ ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్‌ ధరలు చెల్లించాల్సిందే! ఏజీఆర్‌ నిర్వచనంపై కోర్టులో కేసు నడుస్తున్నందున ఎస్‌యూసీ, లైసెన్సు ఫీజుల వసూలును నిలిపివేయాలని టెల్కోలు గతంలోనే డాట్‌ ను కోరాయి. ఓటీఎస్‌సీ చార్జీల వసూలుపై ఎయిర్‌ టెల్‌, టాటాలు కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌ కామ్‌ ఓటీఎస్‌సీ చెల్లింపు కోసం ఇచ్చిన రూ.2,000 కోట్ల బ్యాంకు గ్యారంటీలను వాపసు ఇవ్వాలని ఇటీవల టీడీశాట్‌ ఆదేశించడమే ఇందుకు కారణం. ఎస్‌యూసీ, ఓటీఎస్‌సీ, ఫీజులపైనా కోర్టుల్లో విచారణ జరుగుతున్నందున తీర్పుల ఆధారంగానే డాట్‌ వీటిని వసూలు చేస్తుందని సంస్థ అధికారి ఒకరు చెప్పారు.

ఇన్‌ ఫ్రాటెల్‌ లో వాటా తగ్గించుకోనున్న ఎయిర్‌ టెల్‌..

భారతీ ఇన్‌ ఫ్రాటెల్‌ లిమిటెడ్‌లో తన వాటాను సగానికిపైగా తగ్గించుకోవాలని భారతీ ఎయిర్‌ టెల్‌ నిర్ణయించింది. తమ గ్రూపునకు చెందిన మరో యూనిట్‌ నెటిల్‌ ఇన్‌ఫ్రా.. ఈ నెల 18 నాటికి భారతీ ఇన్‌ ఫ్రాటెల్‌ లో 32 శాతం వాటా కొంటుందని ఎయిర్‌ టెల్‌ స్టాక్‌ ఎక్సేంజీలకు మంగళవారం తెలిపింది. ఫలితంగా ఇన్‌ ఫ్రాటెల్‌ లో ఎయిర్‌ టెల్‌ వాటా 50.33 శాతం నుంచి 18.3 శాతానికి తగ్గిపోతుంది. నెటిల్‌ తదనంతరం తన వాటా అమ్మి నగదు నిల్వలను పెంచుకుంటుంది.