అజయ్ దే ఆడీకారు!

అజయ్ దే ఆడీకారు!

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్ గన్ ఖరీదైన ‘ఆడి’ కారు గెలుచుకున్నాడు. ఎక్కడా అని ఆశ్చర్యపోకండి. ఓ టీవీ షోలో పాల్గొనడం ద్వారా అజయ్ ఈ బహుమతి దక్కించుకున్నాడు. అదే ‘కాఫీ విత్ కరణ్’ షో. ఇటీవలే ఆరో సీజన్ పూర్తి చేసుకున్న ఈ షోకు సంబంధించిన బహుమతుల్లో అజయ్ కు ఆడి కారు దక్కింది.

ఇండియన్ సెలబ్రిటీ చాట్ షోలలో ప్రముఖంగా వినిపించేది ‘కాఫీ విత్ కరణ్’. బాలీవుడ్ స్టార్ ఫిలింమేకర్ కరణ్ జోహార్ హోస్ట్​ చేసే ఈ షోకు బాలీవుడ్, స్పోర్స్ట్, ఇతర రంగాల ప్రముఖులు వస్తుంటారు. ఈ షోకు సంబంధించి ఇటీవలే ఆరో సీజన్ ముగిసింది. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. వివాదాలు, అడల్ట్​ కంటెంట్ ఉన్నా షోకు ఆదరణ తగ్గడం లేదు.

కాఫీ అవార్డ్స్
ఈ షోలో పాల్గొనే ప్రముఖులు వివిధ అంశాలపై కరణ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెలబ్రిటీలు చాలా విషయాలపై స్పాంటేనియస్ గా స్పందించాలి. షోలో వాళ్ల స్పందనను బట్టి పలు కేటగిరీల్లో కాఫీ అవార్డులు ఇస్తారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ఆసక్తి కలిగించేది ‘ఆన్సర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు. ఈ సీజన్ లో కరణ్ అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు ఇచ్చిన సమాధానాల్లోంచి బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్లను ఎంపిక చేసి ఈ అవార్డు ఇస్తారు. ఈ సీజన్ లో ‘బెస్ట్ ఆన్సర్ ఆఫ్ ది సీజన్’ అజయ్ దేవ్ గన్ దక్కించుకున్నాడు.

కాజల్ తో కలిసి
ఇటీవలి సీజన్ లో అజయ్ దేవ్ గన్ తన భార్య కాజోల్ తో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా కరణ్ అజయ్ ను ‘మీకు తప్పనిపించే ఒక మూఢ నమ్మకం ఏంటి’ అని అడిగాడు. దీనికి వెంటనే అజయ్ సమాధానమిస్తూ ‘ ఇంగ్లిష్ లెటర్ ‘కె’తో ప్రారంభమయ్యే మీ (కరణ్) సినిమాలు బాగా ఆడతాయనే నమ్మకమే’ అన్నాడు. ఈ సమాధానానికి పక్కనే ఉన్న కాజల్ కూడా ఆశ్చర్యపోయింది. ఈ సమాధానమే ఈ సీజన్ బెస్ట్​ ఆన్సర్ గా ఎంపికైంది. దీనికే అజయ్ కు ఆడి కారు బహుమతిగా వచ్చింది. ఇటీవలే కరణ్ ఆడి కారును అందించినట్లు అజయ్ వెల్లడించాడు. తాజా సీజన్ లో అర్జున్ కపూర్, జాన్వి కపూర్, అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్, షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టార్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్ పాల్గొన్నారు. అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షోకి వస్తే మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం ఒక్కడే వచ్చి సందడి చేశాడు.