తెలంగాణను అప్పుల్లో ముంచిన బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ : అజయ్ మాకెన్

తెలంగాణను అప్పుల్లో ముంచిన బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ :  అజయ్ మాకెన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ అప్పుల్లో ముంచిందని ఏఐసీసీ ట్రెజరర్ అజయ్ మాకెన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పదేండ్లలో ఖజానాను ఖాళీ చేసిందని, ప్రజలపై పన్నుల భారం వేస్తున్నదని మండిపడ్డారు. ప్రతి ఒక్కరిపై రూ.1.30 లక్షల అప్పు మోపిందన్నారు. శనివారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, డిస్కంలను రూ.52 వేల కోట్ల అప్పుల్లో ముంచిందన్నారు. 

లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్‌‌‌‌ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. దేశంలో విద్య, వైద్య రంగాలకు బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం అతి తక్కువ బడ్జెట్‌‌ కేటాయిస్తున్నదని ఆరోపించారు. అమ్మ హస్తం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌‌లో 9 సరుకులు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ బియ్యం మాత్రమే ఇస్తున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ అటకెక్కించిందని ఫైర్‌‌‌‌ అయ్యారు. కేసీఆర్ హయాంలో నిత్యావసరాల ధరలు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు.