ఆదివాసీలు తిరగబడతరు

ఆదివాసీలు తిరగబడతరు

ములకలపల్లి, వెలుగు: సాకివాగు ఘటనలో పోలీసులు స్పందించకుంటే ఆదివాసీలు తిరగబడతారని సీపీఐ ఎంఎల్​న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఫారెస్ట్​గార్డు ఆదివాసీ మహిళలపై దాడిచేసి వారం కావస్తున్నా ఇంతవరకు పోలీసులు అతడిని అరెస్టు చేయలేదని, వెంటనే ఫారెస్ట్​గార్డ్​మహేశ్ పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఎన్డీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి జరిగిన ప్రదేశాన్ని కనీసం ఫారెస్టు అధికారులు పరిశీలించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వచ్చినా రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, మహిళా కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రకటన చేసినా పట్టించుకోకపోగా, అదంతా దుష్ప్రచారమని ఫారెస్ట్​శాఖ ప్రకటించడంపై మండిపడ్డారు. గాయపడిన మహిళలకు వైద్య సహాయం, నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మహేశ్​పై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

 

   ఎఫ్ డీవోకు బీట్ ఆఫీసర్ అటాచ్

ఆదివాసీ మహిళలపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్​ను గురువారం పాల్వంచ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసు (ఎఫ్ డీవో)కు అటాచ్ చేసినట్లు ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ చెప్పారు. పనిష్మెంట్ కింద అటాచ్ చేశామని, ఘటనపై సమగ్ర ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు.