అక్షర  ప్రపంచం వీర నారీమణులు

అక్షర  ప్రపంచం వీర నారీమణులు

భారతదేశం వీరాంగనలకు పుట్టినిల్లు. అందులో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రీబాయి, సరోజినీ నాయుడు గురించి మనకు కొంత తెలుసు. త్యాగానికి, స్వాతంత్ర్య పోరాటానికి, పరిపాలనా దక్షతకు ప్రతీకలైన మనకు తెలియని ఎందరో స్త్రీలను, ఒళ్లు గగుర్పొడిచే వారి గాథలను సంక్షిప్తంగా ‘జ్వాలామణులు’ పేరుతో జ్వలింపజేశాడు నన్నపనేని రాజశేఖర్. రాణి దుర్గావతి తుదిశ్వాస వరకూ మొఘలులతో పోరాడింది. రాణి నాయకీదేవి తుక్కుతుక్కుగా ఘోరీ మహమ్మద్ ను ఓడించింది. ఉన్నియర్చ కేరళలోని తన గ్రామ మహిళలను అపహరణకు గురికాకుండా రక్షించి, తానూ, తన మనుషులూ భవిష్యత్తులో మరే ఇతర స్త్రీ వంక కన్నెత్తి చూడమని, బలాత్కరించబోమని తమంతతాము చెప్పేలా పాలకులను వణికించింది. భయమంటే తెలియని రాణి అబ్బక్కచౌతా శత్రువులైన పోర్చుగీసులతో వీరోచితంగా పోరాడి వారికి ముచ్చెమటలు పట్టించింది. 2015లో మోడీ ప్రభుత్వం నౌకా దళంలోని ఒక నౌకను రాణి అబ్బక్క పేరు పెట్టి రుణం తీర్చుకున్నది. శివగంగ మీద దాడిచేసి తన రాజ్యాన్ని ఆంగ్లేయులు వశపరచుకుంటే, వేలు నాచియార్ మారువేషంలో సంచరించి, ఇరవైవేల సైనికులను సుశిక్షితులను చేసి, ఆత్మాహుతి దళాలనూ సిద్ధం చేసి ఆంగ్ల సైనికుల గుడారాలలో ప్రవేశించి వారిని అంతం చేసింది. బ్రిటిషువారి అత్యాధునిక ఆయుధాలను నాశనం చేయడం లేదా ఆయుధాలను సంపాదించడం తన అంగ రక్షకురాలైన కుయిలీ వ్యూహం. దీంతో వేలు నాచియార్ తిరిగి రాజ్యాన్ని పొందింది.

రాణి చెన్నమ్మ ధైర్యం మిగతా రాజ్యాల్లోనూ స్ఫూర్తినింపింది. 1857 తొలి స్వరాజ్య సమరంలో బ్రిటిషు వారికి ఎదురు నిలిచిన మహిళల్లో ఒకరు బేగం హజ్రత్ మహల్. లక్నోలో భీకర యుద్ధాలలో ఒకదానికి నాయకత్వం వహించిన దళిత వీరాంగన ఉమాదేవి. బ్రిటిషర్లు తమ ప్రాంతంలో పన్నులు వసూలు చేయడానికి, ప్రజల చేత బలవంతంగా పని చేయించడానికి భయపడేలా, బ్రిటిషు అధికారాన్ని సవాలు చేసింది రోపు ఇలియాని. బ్రిటిషువారి దుష్టపాలనను గుడ్డిగా అనుకరించకుండా, ధైర్యంగా పోరాడాలని పొరుగు రాజ్యాలకు దిశానిర్దేశం చేసింది రాయగఢ్ రాణి అవంతిబాయి. రాణి పూల్ కువర్ యుద్ధంలో ఆంగ్లేయులను కొందరిని హతమార్చింది. శత్రువుల చేతిలో తాను చిక్కితే తననుతాను ఆత్మాహుతి చేసుకుంటానని, శత్రువులు తనను తాకకముందే తనను అగ్నికి అర్పించాలని అంగరక్షకునికి చెప్పింది.

బుందేల్‌‌ఖండ్ లోని ఓ అడవిలో పశువులను మేపుతున్నది ఝర్కారీబాయి అనే దళిత బాలిక. ఉన్నట్టుండి ఓ చిరుతపులి ఆవు మీదికి దాడి చేసింది. ఆమె కర్రను కత్తిలా తిప్పుతూ చిరుత పైకి దాడి చేసింది. ఆవును వదిలి చిరుత గాలిలోకి లేచి ఆమె మీదికి లంఘించింది. అత్యంత చాకచక్యంతో ఆ బాలిక మొనదేలిన చేతికర్ర భాగాన్ని ఆ చిరుత కంఠంలోకి దింపింది. చిరుత గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. ఆమె ధైర్యసాహసాలు విన్న ఝాన్సీ లక్ష్మీబాయి ఆమెను ఆహ్వానించి తన సైన్యంలో మహిళా విభాగమైన ‘దుర్గా వాహిని’కి నాయకురాలిని చేసింది. మీరట్ ప్రాంతంలో 30 మంది స్వాతంత్ర్య సమర యోధులను బ్రిటిషర్లు ఉరితీస్తే, 16 ఏండ్ల శివదేవి యువతతో కలిసి వారిపై మెరుపుదాడి చేసి కొందరిని చంపింది. కొందరు పారిపోయి, అదను చూసి తిరిగివచ్చి, ఆమెపై కాల్పులు జరిపితే శరీరం బుల్లెట్లతో జల్లెడలా మారి వీరమరణం పొందింది. ఆమె చెల్లి 14 ఏండ్ల జైదేవి వారిని వెంబడించి ఒక అధికారిని చంపి, కొందరిని గాయపరిచి, ఆ పోరాటంలో ఆమె కూడా మరణించింది.

శరీరంలోకి తుపాకి గుండ్లు దూసుకెళ్తున్నా ‘వందేమాతరం’ అంటూ చేతిలో జెండాను పైకెత్తి పట్టుకున్న మాతంగిని హజ్రా, స్వరాజ్యాన్నే శ్వాసగా మార్చుకొని పోరాడిన తారారాణి శ్రీవాత్సవ్, స్వరాజ్యం కోసం సాయుధ విప్లవం దిశగా ప్రజాసమీకరణ చేసిన ‘గులాబ్ కౌర్’, బ్రిటిషువారికీ, అమానవీయ సామాజిక జాడ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాబిరి దేవి, చంద్రశేఖర్ ఆజాద్ పోరాటానికి సన్నిహితంగా ఉన్న రాజ్ కుమారి గుప్తా, “నా అనుచరులను కాల్చడానికి ముందు నన్ను కాల్చండి” అంటూ బ్రిటిషు సైనికులకు సవాలు విసిరిన అచ్చమ్మ చెరియన్, కొండ ప్రాంతాల గెరిల్లా దళాలను పోరాట పంథాల్లో నడిపిన గిరిజనోద్యమ నాయకురాలైన రాణి గైడెన్లు, ఒక పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగురవేసే ప్రయత్నంలో తుపాకి గుండ్లకు బలైన కనకలతా బారువా, బ్రిటిషువాళ్లు తాగి తందనాలాడే క్లబ్ హౌజ్ పై విప్లవకారులతో దాడి చేసి తుపాకి గుళ్ల వర్షం కురిపించిన ప్రీతిలత, ఆంగ్ల అధికారి స్టీవెన్సను చంపి యావద్దేశం ఉలిక్కిపడేలా చేసిన 16 ఏండ్లు నిండని సునీతచౌదరి, శాంతిఘోష్, నేతాజీ తన దగ్గరి నలుగురు గూఢచారులలో ఒకరుగా నియమించుకున్న సరస్వతి రాజమణి - ఇలా ఎందరో వీరాంగనలు.

ప్రజల చేత విశేషంగా గౌరవింపబడింది ఇండోర్ సంస్థాన పరిపాలకురాలు అహల్యాబాయి. వడికిన ఖాదీని భుజాలమీద వేసుకొని అమ్ముతూ దేశభక్తి గీతాలు పాడుతూ జనంలో చైతన్యాన్ని నింపింది ఓరుగంటి మహాలక్ష్మమ్మ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన తొలి భారతీయ మహిళ రుక్మిణీ లక్ష్మీపతి. ఐర్లాండులో పుట్టి స్వామి వివేకానందుని శిష్యురాలై, తన సర్వశక్తులను మన దేశం కోసం అర్పించింది సిస్టర్ నివేదిత. 12 ఏండ్ల వయసునుంచే విరాళాలు సేకరించి, వాటినీ తన బంగారు గాజులనూ స్వాతంత్ర్య పోరాటం కోసం మహాత్మునికి అర్పించింది దుర్గాబాయి దేశ్ ముఖ్. ఇటువంటి మహనీయుల వీరోచిత గాథల్ని చదువుతుంటే వారి తెగువ, దేశభక్తిని చూస్తుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. స్వాతంత్ర్య పోరాటంలో, సాంస్కృతిక పునరుజ్జీవనంలో మహిళల పాత్ర తక్కువేమీ కాదని, వారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. 40 మంది వీరనారీమణుల ధైర్యాన్ని, శౌర్యాన్ని, దేశభక్తిని మనలో ఆవహింప జేసేలా ‘జ్వాలామణులు’ గ్రంథాన్ని అందించిన నన్నపనేని రాజశేఖర్ కు అభినందనలు.
- ఎ. గజేందర్‌‌ రెడ్డి, 9848894086 ప్రతులకు: మెగామైండ్స్ -ఫోన్​ : 8500581928