అందరూ భయపడ్డారు.. కృష్ణ తేజ కూల్చేశారు

అందరూ భయపడ్డారు.. కృష్ణ తేజ కూల్చేశారు

కేరళకు ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని పేరు. అక్కడి పచ్చని ప్రకృతికి, మధ్యలో పారే నదులు, సెలయేళ్లకు పరవశించిపోని వారుండరు. పచ్చటి ప్రకృతే కేరళకు ఓ వరం. అయితే.. పచ్చటి చీర కట్టుకున్న నేలపై కార్పొరేట్ కన్నుపడింది. రూల్స్ కూడా రూట్ నుంచి తప్పుకున్నాయి. అక్రమ కట్టడాలు వెలిశాయి. పచ్చని చెట్లు పోయి.. విల్లా పేరుతో ఓ కాంక్రీట్ జంగిల్ మొలిచింది. చుట్టూ నీళ్లు, మధ్యలో విల్లా చూసుకుని దాని ఓనర్ మురిసిపోయాడు. కానీ.. ఓ తెలుగోడి దెబ్బకు ఇప్పుడు విలవిలలాడిపోతున్నాడు. అక్రమాలు చేయాలనే ఆలోచన కూడా మరోసారి రాకుండా చేశాడు యంగ్ ఐఏఎస్, అలెప్పీ కలెక్టర్ కృష్ణ తేజ.

కువైట్ లో రిచెస్ట్ పర్సన్స్

అక్రమంగా నిర్మించిన ఈ రిసార్ట్‌ మొత్తం విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుంది. 7 స్టార్‌ రిసార్ట్‌ ఇది. క్యాపికో అనే కంపెనీ దీన్ని నిర్మించింది. ఇందులో ఒక్కరోజు ఉండటానికి రూ.55 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తారు. భారత్‌ లో టాటా, బిర్లాల మాదిరిగా.. కువైట్ లో క్యాపికో రిచెస్ట్ పర్సన్స్ గా ఉన్నారు. వాళ్లే ఈ రిసార్ట్ ను నిర్మించారు. వెంబనాడ్‌ సరస్సు మధ్యలో సముద్రానికి దగ్గర్లో ఓ ద్వీపం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్న ఈ స్థలాన్ని స్థానికంగా ఉండే మత్స్యకారులు వాడుకునేవారు. క్యాపికో మేనేజ్ మెంట్ 2007లో దీవిలోని 10 ఎకరాల స్థలంపై హక్కు సాధించింది. మూడెకరాల్లో రిసార్ట్‌ నిర్మిస్తామంటూ వనవెళ్లి గ్రామ పంచాయతీ నుంచి పర్మీషన్ తెచ్చుకుంది. ఆ ప్రాంతం కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌  పరిధిలో ఉంది.

కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం..

కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా క్యాపికోకు అధికారులు అనుమతి ఇచ్చేశారు. మూడెకరాల్లో విల్లాలు నిర్మిస్తామని  క్యాపికో యాజమాన్యం 2007లో  అనుమతి తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత దాన్ని 10 ఎకరాలకు విస్తరించింది. ప్రభుత్వానికి చెందిన మరో 7 ఎకరాలను కలుపుకొని.. మొత్తం దీవిని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అలా 17 ఎకరాల్లో విల్లాలు,  స్విమ్మింగ్‌పూల్‌, ఆఫీసులు నిర్మించింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోరాటం చేశారు. తమ జీవనాధారం పోతుందని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈక్రమంలో క్యాపికో మేనేజ్ మెంట్ వారిని అడ్డుకుంది. 

యువ మత్స్యకారులు వెనక్కి తగ్గలేదు

ఐదుగురు యువ మత్స్యకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. సబ్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు వెళ్లారు. చివరకు కోర్టుకెక్కారు. ఈ అక్రమ నిర్మాణాల అంశాన్ని న్యాయస్థానంలో సవాలు చేశారు. వీరికి ప్రకృతి ప్రేమికులు కూడా తోడవ్వడంతో హైకోర్టులోనూ పైచేయి సాధించారు. 2013లో హైకోర్టు తన తీర్పులో ఆ రిసార్ట్‌ను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రిసార్ట్‌ యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఏడేళ్ల పాటు విచారించిన సుప్రీంకోర్టు.. కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. రిసార్ట్ ను కూల్చేయాల్సిందేనని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. వాటిని అమలు చేసేందుకు ఏ అధికారి కూడా సాహసం చేయలేకపోయారు. రిసార్ట్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే చాలు పై స్థాయి నుంచి ఫోన్లు వచ్చేవి. అటు వైపు వెళ్లొద్దని హెచ్చరికలు వచ్చేవి. ఆ తర్వాత కరోనాతో ఈ అంశం మరుగునపడిపోయింది.

కోర్టు నుంచి ఆదేశాలను తెచ్చుకున్నా..

కోర్టు నుంచి ఆదేశాలను తెచ్చుకున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడంతో మత్స్యకారులు నిరుత్సాహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో అలెప్పీ కలెక్టర్ గా తెలుగు తేజం కృష్ణతేజ బాధ్యతలు స్వీకరించాడు. వచ్చీ రాగానే కోర్టు కేసులు, తీర్పుల అమలుపై ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ఆయనకు క్యాపికో రిసార్ట్ ఫైల్ కనిపించింది. దాన్ని కంప్లీట్ గా స్టడీ చేశారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇందులో జోక్యం చేసుకోవద్దని కోరాడు. ఇంకేముంది పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీలు రిసార్టులపైకి దూసుకెళ్లాయి. అక్రమసౌధం కూలడం మొదలైంది. ఆరు నెలల్లో కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా తొలగించాలని డెడ్ లైన్ పెట్టుకుని పనులు మొదలుపెట్టారు. సరస్సులో నీరు కలుషితం కాకుండా, శిథిలాలు సరస్సులో పడకుండా చాలా జాగ్రత్తగా కూల్చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. కూల్చివేత ఖర్చు కూడా పూర్తిగా క్యాపికో యాజమాన్యమే భరించేలా చేశారు.  

ఏ సమస్య వచ్చినా కృష్ణతేజ..

కేవలం క్యాపికో రిసార్ట్ ఇష్యూనే కాదు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కృష్ణతేజ నేనున్నానంటూ దూసుకెళ్తారు. తాను ఓ ఐఏఎస్ అధికారిని బుగ్గకారులోనే తిరగాలి. కాలు కింద పెట్టొద్దన్న కండీషన్ల మధ్య పనిచేయరు. ప్రభుత్వాలు గీసిన గిరిలోనే తిరగాలనే కట్టుబాట్లు లేకుండా పనిచేస్తారు. ఏ సమస్య వచ్చినా అది వరదైనా.. ఇంకేదైనా.. స్వయంగా వెళ్తారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కృష్ణతేజ సబ్ కలెక్టర్ గా ఉన్నారు. వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందుండి నడిచారు. కిందిస్థాయి సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. బాధితులతో మాట్లాడారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.  రాత్రీ పగలనే తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలను కృష్ణతేజ చుట్టేశారు. పునరావాస కేంద్రాల్లో చిన్న ఇబ్బంది కూడా రాకుండా చర్యలు తీసుకున్నారు. 

చేయాల్సింది చేసి ఆయన ఊరుకోలేదు

అధికారిగా తాను చేయాల్సింది చేసి ఆయన ఊరుకోలేదు. ప్రజలను కదిలించారు. ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ పేరుతో ఫేస్ బుక్ లో ఓ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఫేస్ బుక్ లో ఆయన పోస్ట్ పెట్టిన 6 గంటల్లోనే భారీ స్పందన వచ్చింది. ఆర్థికసాయం, విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం, దివ్యాంగులు, సీనియర్ సిటిజెన్లను ఆదుకోవడం,  మౌలిక వసతుల కల్పన, హెల్త్ కేర్ సేవలు, మత్స్యకారులకు సహకారంతో పాటు పచ్చదనాన్ని కాపాడటానికి ఈ క్యాంపెయిన్ ఎంతో ఉపయోగపడింది. 

40వేల మంది పిల్లలకు పుస్తకాలు

అలెప్పీ జిల్లాలో 133 మంది రైతులకు పాడి ఆవులను అందించారు. వరదల తర్వాత తమ కాళ్లపై తాము నిలబడేలా సాయం చేశారు. దాదాపు 40 వేల మంది పిల్లలకు పుస్తకాలు, స్కూలు బ్యాగులు, వాటర్ బాటిల్స్ అందించారు. వరదల్లో బుక్స్ కోల్పోయిన వారికి సాయం చేయడం మరో సత్ఫలితాన్ని కూడా ఇచ్చింది. ఆయా స్కూళ్లలో అటెండెన్స్ శాతం 100కు చేరింది. కొన్ని స్కూళ్లకు కంప్యూటర్లు అందించారు. కొందరు పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇప్పించారు. అమ్మాయిలకు సైకిల్స్ అందజేశారు. అలాగే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ఫిల్టర్లు అందించారు. మరికొందరు దాతలు ముందుకొచ్చి ఇళ్లు లేనివారికి ఇళ్లు కూడా కట్టించారు.

యాంకర్ సుమ మొదట స్పందించారు

కృష్ణతేజ పిలుపుతో యాంకర్ సుమ మొదట స్పందించారు. గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతేకాదు.. ఈ క్యాంపెయిన్ లో సినిమావాళ్లు కదిలివచ్చారు. అలాగే సినిమా పోస్టర్లపైనా ఐయామ్ ఫర్ అలెప్పీ టైటిల్ తో ప్రచారం కల్పించారు. దీని ద్వారా కూడా నిధులు సమకూరాయి. వరదల సమయంలో పూర్తిగా ప్రజల్లోనే ఉండి సేవలందించారు కృష్ణతేజ. ఆ తర్వాత కూడా ప్రజాసేవలోనే ముందుకెళ్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా క్యాపికో రిసార్ట్ ను కూల్చేవరకు వెనక్కి తగ్గలేదు. అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.