
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం (జూన్ 8) హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండోసీడ్ అల్కరాజ్ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ)కు ఊహించని షాకిచ్చాడు.
ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన టైటిల్ ఫైట్‌లో బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్, అద్భుతమైన సర్వీస్‌లు, బేస్‌లైన్ గేమ్‌తో చెలరేగిన సినర్ తొలి రెండు సెట్లలో నెగ్గినా.. తర్వాతి మూడు సెట్లలో అల్కరాజ్ దాటిని తట్టుకోలేకపోయాడు. నాలుగో సెట్ లో 3–5 (0–40)తో వెనుకబడ్డ దశలో వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్న అల్కరాజ్ అద్భుత విజయం సాధించాడు.
టోర్నీ మొత్తం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సినర్ టైటిల్ ఫైట్‌లో మాత్రం కీలక టైమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లను తీయలేకపోయాడు. దాంతో గ్రాండ్‌స్లామ్స్‌లో వరుస విజయాల సంఖ్య 20తోనే ఆగిపోయింది. తుదిపోరులో సినర్ 8 ఏస్‌లు, 53 విన్నర్లు కొట్టి బ్రేక్ 7 పాయింట్లు సాధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ చేయని అతను 64 అనవసర తప్పిదాలు చేశాడు.
మరోవైపు ఏడు ఏస్‌లు, 70 విన్నర్లు, 7 బ్రేక్ పాయింట్లు రాబట్టిన అల్కరాజ్ 7 డబుల్ ఫాల్ట్స్, 67 అనవసర తప్పిదాలు చేశాడు. సినర్ (11)తో పోలిస్తే డ్రాప్ షాట్లలో కార్లోస్ (32) పూర్తి పైచేయి సాధించాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు సుమారు రూ. 25 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా, సినర్‌కు రూ. 12.5 కోట్లు దక్కాయి.
టైబ్రేక్‌లో జోరు..
తొలి రెండు సెట్లలో ఈజీగా నెగ్గిన సినర్ ఆట మూడో సెట్ నుంచి గాడి తప్పింది. ఇందులో అల్కరాజ్ క్రాస్ కోర్టు సర్వీస్‌లను తీయలేక ఇబ్బందిపడ్డాడు. ఇక నాలుగో సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గిన అల్కరాజ్ డిసైడర్‌లో 3–1తో లీడ్‌లోకి వెళ్లినా తర్వాత క్రమంగా వెనకబడ్డాడు. సినర్ క్రాస్ కోర్టు సర్వీస్‌లతో చకచకా పాయింట్లు సాధిస్తే, అల్కరాజ్ కాస్త అలసత్వం చూపెట్టాడు. దీంతో ఐదో గేమ్‌లో సినర్ సర్వీస్‌ను కాపాడుకుని 2–3కు చేరాడు.
తర్వాతి గేమ్‌లో అల్కరాజ్ సర్వ్ నిలబెట్టుకోవడంతో స్కోరు 4–2గా మారింది. తర్వాతి రెండు గేమ్‌ల్లో ఇరువురూ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 5–3కు చేరింది. కానీ 9వ గేమ్‌లో సర్వీస్‌ను కాచుకున్న సినర్.. పదో గేమ్‌లో ఊహించని రీతిలో అల్కరాజ్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. ఫలితంగా స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో సినర్ 40–40 వద్ద కొట్టిన విన్నర్‌ను అల్కరాజ్ తీయలేకపోయాడు.
దీంతో అడ్వాంటేజ్ వద్ద సినర్ కొట్టిన బేస్‌లైన్ షాట్‌ను అల్కరాజ్ పాయింట్‌గా మలిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ హ్యాండ్ను అద్భుతంగా సంధించిన సినర్ గేమ్‌ను సాధించడంతో స్కోరు 6–5గా మారింది. తర్వాత అల్కరాజ్ సర్వీస్ కాచుకోవడంతో 6–6తో సూపర్ టైబ్రేక్‌కు దారి తీసింది. ఇందులో అల్కరాజ్ వరుసగా పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్నాడు.