
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 70 శాతం కంప్లీట్ చేశామని, మిగతా 30 శాతం పనులు పూర్తి చేసి రాష్ట్రంలో ఆలేరును ఫస్ట్ ప్లేస్ లో నిలుపుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో 'మార్నింగ్ వాక్' కార్యక్రమం చేపట్టారు. కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని బీఆర్ఎస్ పదేండ్లు ప్రజలను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించి సొంతింటి కల నెరవేర్చామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆలేరులో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ తాము కొత్తగా 7,680 కొత్త రేషన్ కార్డులు, 18,600 కొత్త యూనిట్లు ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. అనంతరం యాదగిరిగుట్టలో 400 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, జిల్లా నాయకుడు వెంకట్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సురేఖ, మండల నాయకుడు శిఖ ఉపేందర్ గౌడ్, విలేజ్ సెక్రటరీ రోజా, కాంగ్రెస్నాయకులు తదితరులు ఉన్నారు.