ఆదర్శంగా తండాల అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఆదర్శంగా తండాల అభివృద్ధి :  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : గిరిజన తండాలను అభివృద్ధిలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం సుక్యాతండా, బాబుల్ నాయక్ తండా, బీల్యానాయక్ తండా, ధర్మారం, మల్కాపూర్, ముల్కలపల్లి, దత్తాయపల్లి, గుజ్జవానికుంటలో రూ.69 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

 ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను ఆగం చేసిందని మండిపడ్డారు. పేరుకు తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్.. కనీసం జీపీ బిల్డింగ్స్ కూడా​నిర్మించకుండా విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించామని తెలిపారు. 

కల్లు.. సర్వరోగ నివారిణి..

తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు శంకుస్థాపన చేశారు. దీంతో కృతజ్ఞతగా గౌడన్నలు మోకు, ముస్తాదును ఎమ్మెల్యే బహూకరించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన కల్లు తాగారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఎలాంటి కలుషితం లేని ప్రకృతి ప్రసాదించిన పానీయం కల్లు అని అన్నారు. ఇంగ్లిష్ మందులు తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే బదులు ప్రకృతి వరమైన కల్లును మోతాదులో తాగి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు.

 ప్రకృతి సిద్ధంగా తయారయ్యే కల్లు సర్వరోగ నివారిణి అని తెలిపారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్ పాల్గొన్నారు.