పేరుకే పీహెచ్‌‌సీలు! ఫస్ట్ ఎయిడ్ తప్ప మిగతా సేవలన్నీ బంద్​

పేరుకే పీహెచ్‌‌సీలు! ఫస్ట్ ఎయిడ్ తప్ప మిగతా సేవలన్నీ బంద్​
  • టెస్టులు జరుగుతలే.. మందులు ఉంటలే
  • పీహెచ్​సీల్లో 700లకు పైగా పోస్టులు ఖాళీ
  • డాక్టర్లు ఉన్నచోట ఎప్పుడొస్తరో.. ఎప్పుడు పోతరో
  • తోచిన వైద్యం చేస్తున్న నర్సులు, ఏఎన్​ఎంలు
  • పది డెలివరీల లక్ష్యాన్నీ పట్టించుకుంటలే
  • జరంత సీరియస్ ఉన్నా జిల్లా ఆసుపత్రికి రెఫర్
  • చేసేది లేక ప్రైవేట్ క్లినిక్‌‌లకు వెళ్తున్న జనం

నాలుగు నెలల చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్న ఈమె పేరు శశాంక. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన ఈమె కొన్ని రోజుల క్రితం డెలివరీ కోసం తల్లిగారి ఊరు ఎర్రపహాడ్ వచ్చి ఉంటున్నది. డెలివరీ తర్వాత మూడు రోజులుగా బాబుకి మోషన్ కావడం లేదు. డాక్టర్‌‌‌‌కు చూపిద్దామని స్థానిక పీహెచ్​సీకి తీసుకొచ్చారు. డాక్టర్ లేరని, తాము చూడలేమని, కామారెడ్డికి తీసుకెళ్లాలని స్టాఫ్‌‌ చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాయినిపాలెంకు చెందిన లింగయ్యకు హైబీపీ రావడంతో అలగడప పీహెచ్​సీకి తీసుకువచ్చారు. బీపీ కంట్రోల్ చేసేందుకు లోసార్టాన్​, మోటోప్రోలాల్, మెసిడెఫిన్‌‌లలో ఏదో ఒక టాబ్లెట్ కావాల్సి ఉండగా అవి పీహెచ్​సీలో లేవు. ఆమ్లోడెఫిన్ టాబ్లెట్ ఇచ్చినా బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశామని పీహెచ్​సీ స్టాఫ్ తెలిపారు. బీపీ ఎక్కువైనప్పుడు పక్షవాతం రాకుండా వేసే టాబ్లెట్లను ప్రభుత్వం సప్లై చేయడం లేదని సిబ్బంది తెలిపారు.

నెట్​వర్క్, వెలుగు: ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌‌సీ) కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లుగా మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా పీహెచ్‌‌సీల్లో డాక్టర్లు లేరు. ఉన్నచోట ఏ టైంకు వస్తారో, ఎంతసేపు ఉంటారో తెలియడం లేదు. దీంతో ఆయా చోట్ల నర్సులు, ఏఎన్ఎంలు తమకు తోచిన వైద్యం చేస్తున్నారు. ఎవరైనా జ్వరంతో అక్కడికి వెళ్తే పారాసిటమాల్, నొప్పి ఉందంటే డైక్లోఫెనాక్​ లాంటి టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపుతున్నారు. ఇంకే ఇతర మందులు ఉండటం లేదు. వైరల్ ఫీవర్లు, డయేరియా లాంటి సమస్యలతో వచ్చే వాళ్లను చేర్చుకోవడం లేదు. ఏమాత్రం సీరియస్‌‌గా ఉన్నా సీహెచ్‌‌సీకో, జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికో రెఫర్​ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి పీహెచ్‌‌సీ పరిధిలో నెలలో పది డెలివరీలు చేయాలని సర్కారు టార్గెట్ పెట్టినా.. డాక్టర్లు, సౌలతులు లేక అది సాధ్యం కావడంలేదు. గర్భిణులు, శిశువు హెల్త్ కండీషన్ తెలుసుకునేందుకు ప్రతినెల చెకప్‌‌లు, రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేయాలి. కానీ మెజారిటీ పీహెచ్‌‌‌‌సీల్లో గైనకాలజిస్టులు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదు. పెద్దాసుపత్రుల్లో మాత్రమే స్కానింగ్ సదుపాయం అందుబాటులో ఉండడంతో మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్​ హబ్‌‌‌‌లలో టెస్టులు చేస్తున్నా.. చాలా పీహెచ్‌‌‌‌సీలలో శాంపిల్స్ తీసే పరిస్థితి లేదు. దీంతో గతిలేక ప్రైవేట్​క్లినిక్‌‌‌‌లకు రోగులు వెళ్తున్నారు.

సగం పీహెచ్​సీల్లో డాక్టర్లు లేరు

రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా పీహెచ్‌‌‌‌సీలు, 200 యూపీహెచ్‌‌‌‌సీలు ఉన్నాయి. వీటిలో 1,369 డాక్టర్​ పోస్టులకుగాను 700 దాకా ఖాళీలున్నాయి. ఉన్న డాక్టర్లలో చాలా మంది ఇన్‌‌‌‌సర్వీస్ కోటాలో పీజీ చదవడానికి వెళ్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఉత్త కుర్చీలే కనిపిస్తున్నాయి. 24 గంటల పాటు నడవాల్సిన 200కు పైగా  పీహెచ్‌‌‌‌సీల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ  ముగ్గురి నుంచి నలుగురు డాక్టర్లకు గాను ఒకరిద్దరితో నెట్టుకొస్తున్నారు. చాలా పీహెచ్‌‌‌‌సీలలో డాక్టర్లతో పాటు స్టాఫ్​నర్స్, ఏఎన్​ఎం, ల్యాబ్​టెక్నీషియన్​లాంటి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక్కో డాక్టర్‌‌‌‌‌‌‌‌ను రెండు, మూడు పీహెచ్‌‌‌‌సీలకు ఇన్‌‌‌‌చార్జిలుగా వేయడంతో వారంలో ఒకటి, రెండు రోజులే వచ్చిపోతున్నారు. దీంతో మిగిలిన రోజుల్లో నర్సులు, ఏఎన్ఎంలే రోగులకు తోచిన వైద్యం చేస్తున్నారు. చాలా పీహెచ్‌‌‌‌సీలలో పారాసిటమాల్, డైక్లోఫెనాక్ ​లాంటి గోళీలు తప్ప బీపీ, షుగర్ టాబ్లెట్లు అడిగినా లేవనే సమాధానమే వస్తున్నది. చాలా పీహెచ్‌‌‌‌సీలకు అజిత్రోమైసిన్​లాంటి యాంటీ బయాటిక్స్ సప్లై లేకపోవడంతో బయటకు రాసి పంపుతున్నారు.

టెస్ట్ శాంపిల్స్ తీసుకునే దిక్కులేదు

పీహెచ్‌‌‌‌సీల్లో రోగుల నుంచి ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకొని జిల్లా కేంద్రాల్లోని టీహబ్‌‌‌‌ల ద్వారా 57 రకాల టెస్టులు చేయిస్తున్నామని సర్కారు చెబుతున్నది. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. సగానికి పైగా పీహెచ్‌‌‌‌సీల్లో డాక్టర్లే లేనప్పుడు.. ఇక టెస్టులు రాసేదెవరు? ల్యాబ్ టెక్నీషియన్లు లేని చోట్ల కొన్ని రకాల శాంపిల్స్​ను మాత్రమే స్టాఫ్​నర్సులు సేకరించి టీహబ్స్​కు పంపిస్తున్నారు. చాలాచోట్ల యూరిన్, షుగర్, ప్రెగ్నెన్సీ, మలేరియా, హెచ్ఐవీ లాంటి శాంపిల్స్ తీసుకోవడం లేదు. మరోవైపు టీహబ్ సెంటర్లకు సర్కారు నుంచి కెమికల్స్, ఇతర మెటీరియల్ సప్లై నిలిచిపోవడంతో సీరమ్ ఎలక్ర్టోలైట్స్, క్లోరైడ్, స్టూల్ విత్ అకల్ట్, స్టూల్ ఫర్ ఓవా అండ్ కిస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లాంటి టెస్టులు కంప్లీట్‌‌‌‌గా బంద్ పెట్టారు.

డాక్టర్లు లేకుండా టార్గెట్లు చేరుకునేదెట్ల?

24 గంటలపాటు నడిచే పీహెచ్‌‌‌‌సీల పరిధిలో నెలకు కనీసం పది డెలివరీలు చేయాలని సర్కారు టార్గెట్​పెట్టింది. కానీ డాక్టర్లు, స్టాఫ్ కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. ఇటీవల యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట పీహెచ్‌‌‌‌సీని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సందర్శించారు. నార్మల్ డెలివరీలు ఎందుకు చేయడం లేదని అక్కడి స్టాఫ్ నర్స్‌‌‌‌ను ప్రశ్నించగా.. డాక్టర్ లేనప్పుడు తాము డెలివరీలు ఎలా చేయగలమని, డాక్టర్ ఉంటే డెలివరీలు చేయడానికి తాను సిద్ధమని బదులిచ్చారు. దీంతో షాక్ అవ్వడం డీహెచ్ వంతు అయింది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌‌‌‌సీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 

  •     మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో 14 పీహెచ్‌‌‌‌సీలు ఉన్నాయి. బోయినపల్లి, విలాసాగర్, మానాల, ముస్తాబాద్, కోనరావుపేట, లింగన్నపేట పీహెచ్‌‌‌‌సీల్లో డాక్టర్లు లేరు. దీంతో డెలివరీలకు వచ్చే గర్భిణులను ఏరియా హాస్పిటల్స్‌‌‌‌కు రిఫర్ చేస్తున్నారు. 
  •     హనుమకొండ జిల్లా ఆత్మకూరు పీహెచ్‌‌‌‌సీలో డాక్టర్ లేక డెలివరీలు చేయడం లేదు. నడికూడ మండలంలోని రాయపర్తి పీహెచ్‌‌‌‌సీకి డెలివరీ కోసం వచ్చే గర్భిణులకు పరకాల పంపిస్తున్నారు. 
  •     సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీహెచ్‌‌‌‌సీలో ఇద్దరు రెగ్యులర్ డాక్టర్లలో ఒకరిని డిప్యుటేషన్‌‌‌‌పై పంపించారు. మరో డాక్టర్ రోజూ ఓ గంట పాటు గెస్ట్‌‌‌‌లా వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ డెలివరీలను స్టాఫ్ నర్సులే చేస్తున్నారు. దీంతో భయపడుతున్న గర్భిణులు పీహెచ్‌‌‌‌సీలలో ప్రసవం చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. 
  •     నాగర్​కర్నూల్​జిల్లాలో 26 పీహెచ్​సీలు ఉండగా.. 13 పీహెచ్​సీలలో డాక్టర్లు లేరు. దీంతో గర్భిణులు ప్రైవేటు హాస్పిటళ్లలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఫలితంగా ఏ పీహెచ్​సీలోనూ డెలివరీలు డబుల్ డిజిట్ దాటడం లేదు. నాలుగు పీహెచ్​సీలలో జీరో డెలివరీస్ కాగా, మిగిలిన వాటిలో 1 నుంచి 4 వరకు మాత్రమే పరిమితమయ్యాయి.
  •     నల్గొండ జిల్లాలో 12 పీహెచ్​సీలు ఉండగా, నాలుగు డాక్టర్, 20 స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో నలుగురు డాక్టర్లకు పీజీ సీటు రావడంతో త్వరలోనే అవి ఖాళీ కానున్నాయి. ఇక్కడ అన్నిచోట్లా డెలివరీలు బంద్​పెట్టారు. 24 గంటల పీహెచ్​సీలలోనూ సీరియస్​గా ఉన్న రోగులను చేర్చుకోవడం లేదు. 
  •     మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని 22 పీహెచ్ సీలలో 46 మంది డాక్టర్లు ఉండాలి. 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్సులు కూడా 77 మందికి కేవలం 39 మందే పనిచేస్తున్నారు. దీంతో చాలా చోట్ల మధ్యాహ్నం దాటితే నర్సులు తప్ప డాక్టర్లు ఉండట్లేదు. రిమోట్ ఏరియాలు కావడంతో అక్కడి గిరిజనులు పాముకాటు, కరెంట్​షాక్, పిడుగుపాటుకు గురై వస్తే ఎమర్జెన్సీ సేవలు అందడం లేదు. డెలివరీ కోసం వచ్చే గర్భిణులనూ చేర్చుకోవడం లేదు. కానీ సిబ్బంది మంచిర్యాల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లమని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

స్వీపర్లూ వైద్యం చేస్తున్నరు!

డాక్టర్లతో పాటు సరిపడా స్టాఫ్ నర్సులు లేకపోవడంతో కొన్ని పీహెచ్‌‌సీలలో స్వీపర్లే డాక్టర్లుగా మారుతున్నారు. ఈ నెల 6న నారాయణపేట జిల్లా మాగనూర్ పీహెచ్‌‌సీలో అప్పుడే డెలివరీ అయిన ఓ బాలింతకు స్వీపర్​ ట్రీట్‌‌మెంట్ చేయడం కలకలం రేపింది. మాగనూర్, కృష్ణ మండలాల్లోని 54 వేల జనాభాకు మాగనూరులోని పీహెచ్‌‌సీ ఒక్కటే ఆధారం. ఇది 24 గంటలపాటు నడవాల్సిన పీహెచ్‌‌సీ కావడంతో రెండు  మెడికల్ ఆఫీసర్​పోస్టులున్నాయి. రెండూ ఖాళీగా ఉండడంతో కర్ని పీహెచ్‌‌సీ డాక్టర్ నవీన్​కుమార్​రెడ్డిని ఇన్​చార్జిగా వేశారు. ఆయన ఒకటి, రెండు రోజులు వచ్చిపోతున్నారు. మూడు స్టాఫ్ నర్స్‌‌ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. ఒక్కరే డ్యూటీలో ఉంటున్నారు. ఈ నెల 6న ఆమె డ్యూటీ ముగించుకొని వెళ్లాక సాయంత్రం 6 గంటలకు కొత్తపల్లి గ్రామానికి చెందిన రషీత అనే గర్భిణి ప్రసవ వేదనతో వచ్చింది. ఆమె ఆటోలోనే డెలివరీ కాగా, ఆ టైంలో ఆసుపత్రిలో స్వీపర్ తప్ప ఎవరూ అందుబాటులో లేరు. స్వీపర్​ రాములమ్మ వచ్చి బొడ్డు పేగు కట్​చేసి వైద్యం అందించింది.  

బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ లెవ్వన్నరు

మా పీహెచ్​సీలో మందులు సరిగా ఇయ్యరు. బీ కాంప్లెక్స్ టాబ్లెట్ కోసం ఏడాది నుంచి అడుగుతున్నా. ఎప్పుడడిగినా లెవ్వంటరు. డాక్టర్ రెగ్యులర్​గా ఉండరు. మూడు రోజులకో, నాలుగు రోజులకో ఒక్కసారి వస్తడు. మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోతడు. 
- ముద్దగల రాజు, శివ్వంపేట, మెదక్ జిల్లా

ఫార్మాసిస్టుకు చెప్పుకున్న

డెకరేషన్ వర్క్ చేస్తుంటా. మూడు నాలుగు రోజుల నుంచి కాలిమడిమ వద్ద నొప్పితో నడవలేకపోతున్న. పీహెచ్​సీలో చూపించుకునేందుకు వచ్చిన. ఇక్కడ డాక్టర్ లేకపోవడంతో ఫార్మాసిస్టుకు నా ప్రాబ్లం చెప్పిన. ఆయన నొప్పి, క్యాల్షియం గోళీలు ఇచ్చి వాడుమని చెప్పిండు. డాక్టరు ఉంటే బాగుండు. ఆయన ఏం టాబ్లెట్ రాసేవాడో. - పొరండ్ల మునీందర్, గుమ్లాపూర్, కరీంనగర్ జిల్లా

ఎమర్జెన్సీ సేవలు లేవు

పీహెచ్ సీలో ఔట్ పేషెంట్ సేవలు మాత్రమే అం దిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ మధ్యాహ్నం వెళ్లిపోతే స్టాఫ్ నర్సులే ఉంటున్నారు. దీంతో రాత్రివేళ అత్యవసర సేవలు అందడం లేదు. పీహెచ్​సీలలో ఎక్స్ రే, ఈసీజీ లాంటి సేవలు కూడా ఉంటలేవు. పేషెంట్స్​ఏ టైంలో పోయినా చేర్చుకొని వైద్యం అందించాలి. - గోపిశెట్టి లక్ష్మీనారాయణ, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా