ఖమ్మం జిల్లాపై పార్టీల ఫోకస్

ఖమ్మం జిల్లాపై పార్టీల ఫోకస్
  • పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు నేతల వ్యూహాలు
  • రూలింగ్​పార్టీలోని అసంతృప్తులను టార్గెట్ ​చేస్తున్న ప్రతిపక్షాలు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టాయి. గతంలో వచ్చిన ఫలితాలను పునరావృతం చేయాలని కొన్ని పార్టీలు, ఇప్పుడైనా పాతుకుపోవాలని ఇంకొన్ని పార్టీలు ప్లాన్​ చేస్తున్నాయి. దీంతో జిల్లాలో పొలిటికల్​ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉన్న రాజకీయాలను తమవైపు తిప్పుకోవాలని కొత్తగా బీజేపీ, షర్మిల పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలకు గాలం వేయడం ద్వారా బలం పెంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు మాజీ ప్రజాప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. 

అధికారపక్షంలో అసంతృప్తులు
రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​కు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ఫలితాలు షాకిచ్చాయి. అలాంటి సమయంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకోవడం ద్వారా గులాబీ పార్టీ సంతృప్తి పడింది.  కానీ వచ్చే ఎన్నికలనాటికి సొంతంగా కారు గుర్తుపైనే మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద  ఉమ్మడి జిల్లా నేతలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లే బాధ్యతలను పెట్టింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరు  మంత్రికి మింగుడు పడడం లేదు. ఇక మాజీలు కొందరు తమకు ఎలాంటి పదవులు రాకపోవడానికి అజయే కారణమనే భావనతోఉన్నారు. దీంతో అధికారపక్షంలోనే అంటీముట్టనట్లుగా ఉంటున్న లీడర్లు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలోని పరిస్థితులను సరిదిద్దుకొని అసంతృప్తుల ఆగ్రహావేశాలను చల్లార్చకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ కారు బోల్తా కొట్టక తప్పదనే అంచనాలున్నాయి. 

క్యాడర్​పై కాంగ్రెస్​ ధీమా
మొదట కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆదరించింది. దశాబ్దాలుగా ఆ పార్టీకే మెజార్టీ స్థానాలు దక్కుతూ వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే వచ్చినా, తర్వాత పరిణామాల్లో వాళ్లంతా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. గెలిచిన వాళ్లు మారినా కేడర్ చెక్కు చెదరలేదని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వం మారడంతో మళ్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త జోష్ వచ్చినట్లయింది. ఇక కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంపై నజర్ పెట్టారు. ఇటీవల తనను జిల్లా నేతలు కలిసిన సందర్భంలో చాలా అంశాలపై వారితో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ ఇచ్చిన ఖమ్మం జిల్లా నుంచే తన కార్యాచరణ మొదలుపెడతానని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేసేలా కొత్త ఎత్తుగడలపై రేవంత్ దృష్టిపెట్టినట్లు లీడర్లు చెబుతున్నారు. ప్రధానంగా వర్గాలను ఏకం చేసేలా ప్లాన్ చేయడంతో పాటు, ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించడంపై నజర్ పెట్టారని చెబుతున్నారు.

షర్మిల పార్టీ ఫోకస్​
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వస్తున్న షర్మిల కూడా ఖమ్మం కేంద్రంగా తెలంగాణలో రాజకీయ చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. పార్టీ గుర్తు, పేరు, జెండా, అజెండాను ప్రకటించక ముందే ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నేతలు హుషారుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి జిల్లాలో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులు గెలుపొందారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉండడం, రెడ్డి సామాజిక వర్గం, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తమకు లాభిస్తుందనే అంచనాతో షర్మిల పార్టీ లీడర్లున్నారు. అందుకే పార్టీ ప్రకటన తర్వాత ఇక్కడ భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకరిద్దరు మాజీ ప్రజా ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, వైఎస్​పై అభిమానం ఉన్న మరికొంత మంది నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని షర్మిల ప్రధాన అనుచరులు చెబుతున్నారు.

పట్టు కోసం బీజేపీ వ్యూహాలు
బీజేపీ నేతలు కూడా జిల్లాపై పట్టు పెంచుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అంచనా వేసినన్ని సీట్లు రాకపోయినా బోణీ కొట్టడం సానుకూలంగా భావిస్తున్నారు. భవిష్యత్ లో మరిన్ని సీట్లు సాధించేందుకు ఇది పునాదిలా పని చేస్తుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఆర్నెళ్లలో పార్టీకి సంబంధించి జిల్లాలో చాలా సానుకూల పరిణామాలు జరగబోతున్నాయని, వాటిపై క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో కాస్త అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీలోకి రప్పించుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వారిద్దరూ వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఏదో ఒక  నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారనున్నాయి.