
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్ లో జమిలి ఎన్నికలు, 2022 నాటికి నవ భారత నిర్మాణం, మహాత్మా గాంధీ 150 జయంతి వేడుకలు, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
గతంలోనే ఒకే దేశం… ఒకే ఎన్నిక అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది మోడీ ప్రభుత్వం. దానిపై సంప్రదింపులకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఫలించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ… మరోసారి జమిలి ఎన్నికలపై దృష్టి సారించారు. అన్ని పార్టీల అధినేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు పార్లమెంట్ లైబ్రరీ హాల్ లో సమావేశం జరగనుంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు.
జమిలి ఎన్నికలతో పాటు… పార్లమెంట్ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరగనుంది. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున… అప్పటి కల్లా నవ భారత నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని… ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కార్యక్రమాలు రూపొందించడం, జయంతి సంబరాల నిర్వహణ, ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిని వేగవంతం చేసే అవశాలపైనా డిస్కస్ చేయనున్నారు.
ఈ సమావేశానికి NDA భాగస్వామ్య పార్టీల అధ్యక్షులంతా హాజరు కానున్నారు. UPAలోని పార్టీల హాజరుపై ఇంకా ఏమీ తేలలేదు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కావడంలేదు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి ఆమె లెటర్ రాశారు. సున్నిత అంశమైన జమిలి ఎన్నికలపై తక్కువ సమయంలో నిర్వహించే చర్చలతో న్యాయం జరగదన్నారు. సీఎం కేసీఆర్ ఈ మీటింగ్ కు వెళ్లడంలేదు. ఏపీ సీఎం జగన్ మాత్రమే ప్రధాని మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన ఈ రాత్రికే ఢిల్లీ వెళ్లారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్ కు హాజరుకావడం లేరు.