సాయుధ పోరాట లక్ష్యాలు..  అందరికీ తెలియాలి

సాయుధ పోరాట లక్ష్యాలు..  అందరికీ తెలియాలి

నిజాం రాచరిక వ్యవస్థలో కమ్యూనిస్టులపై నిషేధం ఉన్నందున ఆంధ్ర మహాసభ ఆలంబనంగా సంఘటిత ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయి.1944లో భువనగిరి లో జరిగిన11వ ఆంధ్ర మహాసభలో రావినారాయణరెడ్డి అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత గ్రామ గ్రామానికి ఆంధ్ర మహాసభ విస్తరించింది. నిజాం తాబేదారుల విచ్చల విడి దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించే, ఎదిరించే శక్తి లేని ప్రజలు కష్టాలను భరిస్తున్న తరుణంలో ఆంధ్ర మహాసభ రూపంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలను సమాయత్తపరిచింది. గ్రామాల్లో ‘సంఘాలు’ ఏర్పడ్డాయి. సంఘ సభ్యులపై నిజాం తొత్తులు దాడులకు గుండాలను ప్రయోగించాయి. ఈ నేపథ్యంలోనే 1947  సెప్టెంబర్ 11 తేదీన ఆంధ్ర మహాసభ - కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుమ్  మొయిద్దీన్ సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో నాటి కమ్యూనిస్టు పార్టీతో పాటు నైజాం రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్న నాయకులతో పాటు వేలాది మంది ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలు సమరశంఖం పూరించారు. పలుగు -పార, కారం, -రోకలి, వరిసెల, -బరిసె అందిందల్లా ఆడ, -మగ తేడా లేకుండా అందరికీ ఆయుధాలుగా మారాయి. రజాకార్లను, నిజాం బలగాలను ఎదుర్కొనడానికి సంసిద్ధులయ్యారు. 10వేలమంది గెరిల్లా దళసభ్యులుగా, లక్ష మందికి పైగా రక్షక దళ సభ్యులుగా చేరారు. తెలంగాణలోని దొరలు- భూస్వాములు, ప్రభుత్వ ఏజెంట్లు తప్ప తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా కదిలారు. ప్రాణాలకు తెగించారు. తెలంగాణ అంతట రజాకార్లు, నిజాం సేవకులకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం సాగింది.

రజాకార్ల ఆకస్మిక దాడులు

వందలాదిమంది రజాకార్లు నిజాం బలగాలతో గ్రామాలపై ఆకస్మిక దాడులు జరిపారు. రేణికుంట, బైరాన్ పల్లి , కోటి కల్లు, అల్లినగరం, మండ్రాయి,పరకాల, గుండ్రంపల్లి, మల్లారెడ్డిగూడెం మొదలైన అనేక గ్రామాల్లో అమానుషత్వం ప్రదర్శించారు. వందలాది మందిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు, కొందరిని సజీవ దహనం చేశారు, తెలంగాణ గెరిల్లాలు శత్రువులను చెండాడారు. 3వేల గ్రామాలను నిజాం పాలన నుండి విముక్తి చేశారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. వెట్టి చాకిరి, అంటరానితనం అంతం చేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనం కావాలని కోరారు. భూస్వాములు, దొరలు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు.1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు హైదరాబాదులో ప్రవేశించాయి.  నిజాం నవాబు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నవాబు లొంగిపోయినారు. హైదరాబాద్ పాలన బాధ్యతలను భారత ప్రభుత్వానికి అప్పగిస్తున్నాను అని ప్రకటించారు.

సాధించిన విజయాలు,ప్రస్తుత కర్తవ్యాలు

సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది అమరులయ్యారు.  10 లక్షల ఎకరాల భూమి పంపిణీనీ, రక్షిత కౌలుదార్ చట్టం, వెట్టి చాకిరీ చేస్తున్న వారికి ఇనాం భూముల చట్టం సాయుధపోరాటం సాధించిన విజయాలు. హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో విలీనమై సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. గత చరిత్రను, వీరుల త్యాగాలను వారు ఆశించిన లక్ష్యాలను ఈనాటి తరానికి తెలియజేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు, జెండా ఆవిష్కరణలు, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే  కార్యక్రమం చేపట్టింది. అధికారాన్ని చేపట్టిన బీఆర్​ఎస్ ప్రభుత్వం తెలంగాణ విలీనోత్సవ దినం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించుతామని ప్రకటించిన కేసీఆర్ నేటికి 10 ఏండ్లు అయినా..  ఘనంగా జరపకుండా.. ముస్లిం చాందసవాదులకు తలవొగ్గి వేడుకలను నిర్వహించడానికి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో నయా దోపిడీ వ్యవస్థ అంతానికి, మత తత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు, సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం.  అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ.. వారి ఆశయ సాధనలో ముందుకు నడుద్దాం.

 ఉజ్జిని రత్నాకర్ రావు,పాలకవర్గ సభ్యులు,  తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్