
- అన్ని అంశాలూ అర్థమయ్యే భాషలో
- ప్రతిపాదించిన ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీదారుల సౌకర్యం కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) కీలక ప్రపోజల్‌ను తయారు చేసింది. ఇక నుంచి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లను (సీఐఎస్) కంపెనీలు సరళంగా, సులభంగా అర్థమయ్యేలా తయారు చేయాలని ప్రతిపాదించింది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అన్ని ముఖ్యాంశాలను చూపిస్తుంది. సాధారణంగా పాలసీ కొనుగోలు, పునరుద్ధరణ సమయంలో ఈ షీట్‌ను అందజేస్తారు. ఈ షీట్ ప్రస్తుత రూపాన్ని మార్చాలని ఐఆర్డీఏ సూచించింది. "ఆరోగ్య బీమా పాలసీ సమాచారం సరళంగా, సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలి. ఇందుకోసం కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఆగస్టు 30, 2023 నాటి డ్రాఫ్ట్ ప్రతిపాదనలో పేర్కొంది.
" సాధారణంగా పాలసీ డాక్యుమెంట్ చాలా పొడవుగా ఉంటుంది. పాలసీదారులు కీలకమైన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్‌లు, కవరేజీ, ఆర్థిక పరిమితులు, క్లెయిమ్ విధానాలు వంటి విషయాలను ఈ కొత్త సీఐఎస్ ద్వారా సులువుగా అర్థం చేసుకోవచ్చు" అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేష్ గోయల్ అన్నారు. ఈ డ్రాఫ్ట్ ఆచరణరూపం దాల్చితే పాలసీదారులు తమ ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన సంక్లిష్ట నిబంధనలను, విధానాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సహజ్‌మనీ డాట్ కామ్ఫౌండర్ అభిషేక్ రే అన్నారు.
ఇవీ మార్పులు..
కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లో కొత్త ఫార్మాట్ పాలసీ హోల్డర్లు కవరేజీకి సంబంధించిన అన్ని ప్రాథమిక వివరాలు ఉంటాయి. ప్రతిపాదిత సీఐఎస్ ఫార్మాట్ సరళంగా ఉంటుంది. నష్టపరిహారం, ప్రయోజనం వివరాలనూ ఇస్తారు. వ్యక్తిగత, కుటుంబ ఫ్లోటర్ పాలసీల కింద బీమా మొత్తాన్ని సీఐఎస్లోనే పేర్కొనవలసి ఉంటుంది. పేమెంట్ బేసిస్, లాస్ షేరింగ్, పాలసీ ఆర్థిక పరిమితులు వంటి పాత విభాగాలను కొత్త విభాగం కింద విలీనం చేస్తారు. సబ్–లిమిట్, కో–పేమెంట్, డిడక్టబుల్ వంటి వాటిని కొత్త సీఐఎస్ విడదీసి చూపుతుంది.
సాంకేతిక పదాల్లో కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో వీటి అర్థాలను వివరిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్ వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్, క్లెయిమ్ ఫారం డౌన్లోడ్ వివరాలు చేర్చుతారు. అవసరమైన వెబ్సైట్ లింకును కూడా ఇస్తారు. క్యాష్‌లెస్ సేవల కోసం అనుసరించాల్సిన విధానాల వివరాలను, ఆసుపత్రిలో చేరే ముందు పోస్ట్‌తో సహా క్లెయిమ్‌ల రీయింబర్స్‌మెంట్ కోసం అనుసరించాల్సిన వివరాలు ఉంటాయి.
కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌లోనే కంపెనీ ఫిర్యాదుల పరిష్కార అధికారులు, ఐఆర్డీఏ నియమించిన అంబుడ్స్‌మన్ కార్యాలయాల వివరాలు, ఫోన్ నంబర్లు ఉంటాయి. కస్టమర్‌లు తమకు ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే వారి ఫిర్యాదులను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య బీమా కస్టమర్ తెలుసుకోవలసిన విషయాల గురించి ప్రత్యేక కాలమ్ ఉంటుంది. ఫ్రీ లుక్ పీరియడ్, ప్రాసెస్, పాలసీ మైగ్రేషన్ పోర్టబిలిటీ, పాలసీ పునరుద్ధరణ నిబంధనలను ఇది తెలియజేస్తుంది. ‘‘పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఇది వరకే ఉన్న అన్ని వ్యాధులను బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. వివరాలను దాస్తే దానిని మోసంగా భావిస్తారు”అని ఐఆర్డీఏ సూచించింది.