వియ్ లవ్ బ్యాడ్‌‌‌‌‌‌‌‌ గయ్స్

వియ్ లవ్ బ్యాడ్‌‌‌‌‌‌‌‌ గయ్స్

మంచివాడిని హీరో అంటాం. చెడ్డవాడిని విలన్ అంటాం. కానీ రెండు లక్షణాలూ ఉన్నవారిని ఏమనాలి? సినిమా హీరో అనాలి. అవును. హీరో పాత్రలు మారిపోయాయి.
ఒకప్పుడు హీరో అంటే పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు నెగిటివ్ షేడ్స్‌‌‌‌‌‌‌‌లోనూ కనిపిస్తున్నాడు. అయితేనేం.. మనసులు దోచుకుంటున్నాడు. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

మొన్నటికి మొన్న ‘పుష్ప’రాజ్ వచ్చాడు. తిరుగులేని స్మగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ శుక్రవారం ‘భీమ్లానాయక్’ వచ్చాడు. తన ఇగోతో నానా హంగామా చేశాడు. త్వరలో చిరంజీవి ‘గాడ్‌‌‌‌‌‌‌‌ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా రాబోతున్నారు. చీకటి సామ్రాజ్యానికి నాయకుడిగా కనిపించనున్నారు. నాని కూడా ‘దసరా’ పండక్కి తనలోని నెగిటివ్ షేడ్స్ చూపిస్తానంటున్నాడు. కళ్యాణ్‌‌‌‌‌‌‌‌రామ్ ‘బింబిసార’గా భయపెడతానంటున్నాడు. రవితేజ సైతం ‘రావణాసుర’ అవతారం ఎత్తుతున్నాడు. మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెకె, మహాన్‌‌‌‌‌‌‌‌ చిత్రాల్లో దుష్ట పాత్రల్లో కనిపించిన విక్రమ్‌‌‌‌‌‌‌‌ ‘కోబ్రా’గానూ వస్తానంటున్నాడు. హృతిక్ ‘వేద’గా మారి విక్రమ్​తో వార్ డిక్లేర్ చేశాడు. మొత్తానికి ఇటీవలి కాలంలో హీరోలంతా తెలుగు సినిమాకి నెగిటివ్ టచ్ ఇస్తున్నారు. అయినా ఎందుకనో తెగ నచ్చుతున్నారు.

నెగిటివ్ అయితే ఏంటి?

‘పుష్పరాజ్.. తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా మాట్లాడితే ప్రేక్షకులు విజిల్స్ వేశారు. తన స్వార్థం కోసం ఎంతమందిని కొట్టినా, నిజాయతీ గల పోలీసుల్ని సైతం ఎదిరించినా వహ్వా అంటూ జేజేలు కొట్టారు. ఎందుకని? ఎందుకంటే అదొక సినిమా. తనొక హీరో. అయినా హీరో అంటే ఇలానే ఉండాలని రూలేమైనా ఉందా? లేదు కదా. హీరో అంటే మంచివాడు అనే ముద్ర సినిమాలే మనమీద వేశాయి. హీరోకూడా మామూలు మనిషే, తనకీ లోపాలూ సమస్యలూ ఉంటాయని అవే సినిమాలు ఇప్పుడు చెబుతున్నాయి. హీరోకి డెఫినిషన్ కాస్త మారి ఉండొచ్చు. కానీ చూసే ప్రేక్షకుడు మారలేదు. అందుకే పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా, నెగిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా.. హీరో అంటే హీరోనే. అతనంటే ఎప్పటికీ ఆరాధనే. అదే బ్యాడ్ బోయ్ క్యారెక్టర్స్ సృష్టించడానికి ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ మేకర్స్‌‌‌‌‌‌‌‌కి, అలాంటి పాత్రలు చేయడానికి హీరోలకి బలాన్నిస్తోంది. ‘భీమ్లానాయక్‌‌‌‌‌‌‌‌’లో పవన్‌‌‌‌‌‌‌‌తో పాటు రానా కూడా నెగిటివ్‌‌‌‌‌‌‌‌ షేడ్స్‌‌‌‌‌‌‌‌తోనే కనిపించాడు. వాళ్లలో పాత్రల్ని మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. ఇష్టపడుతున్నారు. అందుకే మొదటిరోజే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ‘హరిహర వీరమల్లు’లో కూడా పవన్‌‌‌‌‌‌‌‌ బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు. ఎలాంటి దొంగ అనేది మనకి తెలియదు. కానీ దొంగతనం ఎప్పుడూ చెడ్డదే. అయినా ప్రేక్షకులు ఫీలవ్వరు. ‘సాహో’లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ని చూసి ఫ్లాటైపోయినా.. ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌’లో యశ్‌‌‌‌‌‌‌‌ని చూసి అడ్మైర్ చేసినా..  ‘జై లవకుశ’లో ఎన్టీఆర్​ని, ‘ఖైదీ నంబర్‌‌ 150’లో చిరంజీవిని, ‘రయీస్‌‌‌‌‌‌‌‌’లో షారుఖ్‌‌‌‌‌‌‌‌ని చూసి ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ అయిపోయినా  కారణం ఒక్కటే. వాళ్లకి కావలసింది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ మాత్రమే!

మంచికీ చెడుకీ మధ్య..

అయితే హీరోలందరూ బ్యాడ్‌‌‌‌‌‌‌‌ కాదు. కొందరిని పాపం పరిస్థితులు అలా తయారు చేస్తాయి. ‘టెంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఎన్టీయార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నతనం దారుణంగా ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించాలనే కసితో లంచగొండి పోలీసాఫీసర్ అవుతాడు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌ ప్రేమ కోసం మారిపోతాడు. ‘పటాస్‌‌‌‌‌‌‌‌’లో కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ రామ్ కూడా అంతే. తన తండ్రి మీద కోపంతో అవినీతి పరుడిగా ఎదుగుతాడు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత నిజాయతీకి మారుపేరుగా నిలుస్తాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ అయిన ‘గద్దలకొండ గణేష్​’ ఆ తర్వాత మళ్లీ మంచిగా మారాడు. ఇప్పుడు ఇదే పాత్రను హిందీలో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. అవసరం కోసం ‘అతడు’లో సుపారీ కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిన మహేష్‌‌‌‌‌‌‌‌.. మంచి కుటుంబం దొరికేసరికి మంచి మనిషి అవుతాడు. ఇదే మహేష్‌‌‌‌‌‌‌‌ ‘బిజినెస్‌‌‌‌‌‌‌‌మేన్‌‌‌‌‌‌‌‌’గా మారి ముంబైలో డాన్స్‌‌‌‌‌‌‌‌ని మించిన డాన్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. ‘వి’లో వరుస హత్యలు చేసి హడలెత్తించిన నాని, తనకు జరిగిన నష్టానికి పగ తీర్చుకుంటున్నానని చల్లగా చెప్పి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ నానా యాగీ చేసిన రానా తన రాధమ్మ కోసం ప్రాణాలు వదిలేసి మనసుల్ని కదిలించాడు. ఈ పాత్రలు నెగిటివ్‌‌‌‌‌‌‌‌ కావచ్చు. కానీ వాళ్లు అలా మారడానికి బలమైన కారణాలు చూపించారు దర్శకులు. వాళ్లని మళ్లీ మంచిగా మార్చి మెప్పించారు కూడా. అందుకే ఈ పాత్రలు మంచికి, చెడుకి మధ్య వారధిలా కనిపిస్తుంటాయి.

అంత ఈజీ కాదు

కల్పిత పాత్రల్ని పోషించడం ఒకెత్తు. రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్ ఆధారంగా తీసే సినిమాల్లో క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ని పండించడం మరొకెత్తు. అలాంటి వ్యక్తి నిజంగా ఉన్నాడు కాబట్టి హీరో అచ్చం అతనిలా మారిపోతేనే తప్ప ఆ పాత్ర పండదు. అందుకే రియల్ బ్యాడ్‌‌‌‌‌‌‌‌ గయ్స్‌‌‌‌‌‌‌‌ రోల్స్ చేయడానికి కాస్త గట్టి కసరత్తే చేస్తుంటారు మన హీరోలు. ఆల్రెడీ దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్‌‌‌‌‌‌‌‌ లాంటి వారి జీవితాలు తెరకెక్కాయి. ఈమధ్యనే బెల్లంకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, రవితేజలు టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగేశ్వరరావు లైఫ్‌ స్టోరీతో వస్తామని ప్రకటించారు. స్టూవర్ట్‌‌‌‌‌‌‌‌పురం ప్రాంతంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన దొంగ నాగేశ్వరరావు. తన క్యారెక్టర్ చేయడానికి ఇద్దరు హీరోలూ ఇష్టపడ్డారు. మరి ఇద్దరూ చేస్తారా చివరికి ఒక్కరే టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తారా అనేది చూడాలి. అలాగే పౌరాణిక పాత్రలు. వీటిలో నెగిటివిటీని పండించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు ఎలా ఉండేవారో, ఎలా ప్రవర్తించేవారో పుస్తకాల్లో రాసినదాన్నిబట్టే మనకి తెలుసు. ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌గా వాళ్లని ఎవరూ చూసి లేరు కాబట్టి ఆర్టిస్టుకి పెద్ద చాలెంజే. ఆ చాలెంజ్‌‌‌‌‌‌‌‌ని ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌’ కోసం ఆనందంగా స్వీకరించాడు సైఫ్‌‌‌‌‌‌‌‌ అలీ ఖాన్. రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో ఆన్‌‌‌‌‌‌‌‌స్క్రీన్‌‌‌‌‌‌‌‌ యుద్ధం చేయబోతున్నాడు. ఇక పీరియడ్ డ్రామాస్‌‌‌‌‌‌‌‌లోని నెగిటివ్ పాత్రలు కూడా కష్టమే. ఇప్పటికే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఉదయభాన్ సింగ్ రాథోడ్‌‌‌‌‌‌‌‌ లాంటి వారిని హైలైట్ చేస్తూ సినిమాలు వచ్చాయి. వాటిని ఫేమస్ హీరోలే పోషించారు. ముందు ముందు మరికొన్ని కూడా రాబోతున్నాయి.

మేమేం తక్కువా!

ఎంతసేపూ హీరోల గురించే మాట్లాడితే ఎలా! హీరోయిన్ల గురించి కూడా చెప్పుకోవాలి కదా! ఈమధ్య కాలంలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువయ్యాయి. సినిమా భారం మొత్తం హీరోయిన్లే మోస్తున్నారు. అందుకే ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ చేసే అవకాశం హీరోలతో పాటు వీరికీ దక్కుతోంది. ‘కో కో కోకిల’ సినిమాలో నయనతార డబ్బు కోసం డ్రగ్‌‌‌‌‌‌‌‌ డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ‘మోసగాళ్లు’లో కాజల్‌‌‌‌‌‌‌‌ తన తమ్ముడితో కలిసి కోట్లు కొల్లగొట్టింది. ‘బద్‌‌‌‌‌‌‌‌లా’లో తాప్సీ ఓ మనిషి ప్రాణం తీసింది చాలక.. ఆ నేరం నుంచి తప్పించుకోడానికి మరికొందరి జీవితాలు నాశనం చేసింది. ‘మెంటల్‌‌‌‌‌‌‌‌ హై క్యా’లో కంగనా రనౌత్‌‌‌‌‌‌‌‌ అయితే తన పిచ్చితో సైడ్ క్యారెక్టర్లనే కాక ప్రేక్షకులనూ భయపెట్టింది. ‘ఫ్యామిలీమేన్ 2’లో సమంత టెర్రరిస్టుగా అదరగొట్టింది. ఇదే సమంత త్వరలో రానున్న ‘కణ్మణి రాంబో ఖతీజా’లోనూ నెగిటివ్‌‌‌‌‌‌‌‌గా కనిపించనుంది. ఇంకా చాలామంది నటీమణులు మేమేమైనా తక్కువా అంటూ హీరోలతో సమానంగా నెగిటివ్‌‌‌‌‌‌‌‌ రోల్స్ చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారు.

ఒక హీరో సినిమాలో మరో హీరో నెగిటివ్ రోల్ చేయడం చూస్తుంటాం. ‘బాహుబలి’లో రానా, ‘రోబో 2.ఒ’లో అక్షయ్ కుమార్, ‘బాగీ’లో సుధీర్‌‌బాబు, ‘వలీమై’లో కార్తికేయ.. ఇలా చాలామంది హీరోలు  నెగిటివ్ రోల్స్ తమను వెతుక్కుంటూ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. తామేంటో ప్రూవ్ చేశారు. అయితే హీరోగానే నటిస్తూ నెగిటివ్ రోల్ చేయడం వేరు. సినిమా భారం తనపైనే ఉంటుంది. పాత్రకి న్యాయం చేయడంతో పాటు తమపై నెగిటివ్ ఫీల్ రాకుండా జాగ్రత్తపడాల్సి వస్తుంది. 

ఇదీ మన నెగిటివ్ స్టార్స్‌ కథ. అయితే హీరో పాత్రని ఇలా చూపించడం కరెక్ట్ కాదని కొందరు వాదిస్తున్నారు. హీరో అనేవాడు ఆదర్శంగా ఉండాలనే భావనతో పాటు వారిని అభిమానించేవారికి హీరోలు ఆదర్శంగా కనిపించాలనే అభిప్రాయం కూడా దీనికి కారణం. అయినా చెడు ఎవరిలో లేదని! ఎంత మంచి మనిషిలో అయినా ఏదో ఒక లోపం ఉంటుంది. మరి పాత్రలు కూడా మనుషుల మనస్తత్వాల నుంచి పుట్టినవే కదా! అందుకే వాటికీ కొన్ని లోపాలు ఉంటున్నాయి, అందులో తప్పేముంది అనేది కొందరి వాదన. ఏదేమైనా, ఎవరు ఏమనుకున్నా  ప్రేక్షకులైతే వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటివి చూపించడం వల్ల యువతపై చెడు ప్రభావం పడుతుందని ఎందరు వ్యతిరేకిస్తున్నా వాళ్లు చెబుతున్న మాట ఒకటే..  వియ్ లవ్‌‌‌‌‌‌‌‌ బ్యాడ్‌‌‌‌‌‌‌‌ గయ్స్‌‌‌‌‌‌‌‌!