ప్రతీ 100 మంది పీజీ స్టూడెంట్లలో..72 మంది అమ్మాయిలే

ప్రతీ 100 మంది పీజీ స్టూడెంట్లలో..72 మంది అమ్మాయిలే
  • ఈసారి పీజీలో చేరినోళ్లు 22,078.. వీరిలో 15,894 మంది గర్ల్స్  
  • బాయ్స్ అడ్మిషన్లు 6,184 మాత్రమే  
  • లేడీస్ హాస్టల్స్ కిటకిట.. ఒక్కో రూంలో 20 నుంచి 30 మంది సర్దుబాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ క్యాంపస్ లు, పీజీ కాలేజీలు అమ్మాయిలతో నిండిపోయాయి. పీజీ కోర్సులు చెప్పే అన్ని క్లాస్ రూముల్లోనూ వాళ్లే ఎక్కువగా కన్పిస్తున్నారు. పీజీలో చేరిన ప్రతి 100 మంది స్టూడెంట్లలో 72 మంది అమ్మాయిలే ఉన్నారు. కొన్ని కోర్సుల్లోనైతే ఒకరిద్దరు తప్ప అంతా అమ్మాయిలే ఉన్నారు. రాష్ట్రంలోని 8 యూనివర్సిటీల్లో ఈ అకడమిక్ ఇయర్ లో ఇప్పటి వరకు మూడు ఫేజుల్లో కలిపి 22,078 మంది స్టూడెంట్లు చేరితే అందులో 15,894 మంది(72 శాతం) అమ్మాయిలే అడ్మిషన్ తీసుకున్నారు. పీజీ కోర్సుల్లో బాయ్స్ 6,184 మంది మాత్రమే చేరారు. అమ్మాయిల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో వర్సిటీల్లోని లేడీస్ హాస్టల్స్ లో రూమ్ లు సరిపోవడం లేదు. దీంతో ఐదారుగురు ఉండాల్సిన ఒక్కో రూమ్ లో 20 మంది వరకు సర్దుబాటు చేస్కోవాల్సి వస్తోంది. 

అన్ని వర్సిటీల్లోనూ ఇదే సీన్ 

సీపీగెట్–2‌‌‌‌‌‌‌‌022 ద్వారా ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులకు 8 యూనివర్సిటీల్లో సీట్లు అలాట్ చేశారు. ఇందులో ఉస్మానియూ యూనివర్సిటీ క్యాంపస్ తోపాటు అనుబంధ పీజీ కాలేజీల్లో మొత్తం 8,820 మంది స్టూడెంట్స్ చేరగా వీరిలో 6,132 మంది అమ్మాయిలు, 2,688 మంది అబ్బాయిలు ఉన్నారు. కాకతీయ వర్సిటీలో 5,113 మంది చేరగా 3,719 మంది అమ్మాయిలు, 1,394 మంది అబ్బాయిలు ఉన్నారు. శాతవాహన వర్సిటీ పరిధిలో 2,497 మంది చేరితే 2,124 మంది గర్ల్స్, 373 మంది బాయ్స్ ఉన్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో 1,851 మంది చేరగా 1,226 మంది గర్ల్స్, 625 మంది బాయ్స్.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 1,670 మంది పీజీ కోర్సుల్లో చేరితే 1,101 మంది గర్ల్స్, 569 మంది బాయ్స్.. మహత్మాగాంధీ యూనివర్సిటీలో 1,364 మంది పీజీ కోర్సుల్లో చేరితే 891 మంది అమ్మాయిలు, 473 మంది అబ్బాయిలు ఉన్నారు. ఫైన్ ఆర్ట్స్(జేఎన్) యూనివర్సిటీలో 220 మంది చేరితే అందులో 158 మంది గర్ల్స్, 62 మంది బాయ్స్ ఉన్నారు.   

లేడీస్ హాస్టళ్లుగా బాయ్స్ హాస్టళ్ల మార్పు 

గతంలో ఎన్నడూ లేని విధంగా పీజీ కోర్సుల్లో అమ్మాయిలు ఎక్కువగా చేరడంతో అన్ని యూనివర్సిటీల్లోనూ హాస్టల్ అకామిడేషన్ ఇబ్బందికరంగా మారింది. దీంతో అధికారులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్ కు హాస్టల్ అవకాశం ఇవ్వకుండా కొంత మేర ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాయ్స్ హాస్టళ్ల బిల్డింగ్ లను గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ లుగా మారుస్తున్నారు. ఓయూలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మించిన జెంట్స్ హాస్టల్ ను కూడా ఇలాగే లేడీస్ హాస్టల్ గా మార్చారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో 40 ఏళ్లుగా మెన్స్ హాస్టల్ గా కొనసాగుతున్న పోతన హాస్టల్ ను లేడీస్ హాస్టల్ గా మార్చాలని నిర్ణయించారు. కానీ హాస్టల్ ను ఖాళీ చేసేందుకు అబ్బాయిలు ఒప్పుకోలేదు. ప్రహరీ గోడ లేని పోతన హాస్టల్ లో అమ్మాయిలకు రక్షణ ఎలా ఉంటుందని స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇటీవల కరెంట్, వాటర్ బంద్ చేశారు. అయినా వారు మాత్రం హాస్టల్ ఖాళీ చేయలేదు. ఇతర యూనివర్సిటీల్లోనూ ఇతర అవసరాల కోసం నిర్మించిన బిల్డింగ్ లను లేడీస్ హాస్టళ్లుగా మారుస్తున్నారు.  

బాయ్స్ ప్రొఫెషనల్ కోర్సులవైపు.. గర్ల్స్ పీజీ వైపు..   

కొంతకాలంగా చాలా మంది పేరెంట్స్ అబ్బాయిలను ఇంజినీరింగ్, ఐఐటీ, మెడిసిన్ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివిస్తూ.. అమ్మాయిలను మాత్రం సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిస్తున్నారు. దీంతో ఆ ప్రభావం పీజీ కోర్సులపై పడుతోంది. పీజీ ఎంట్రెన్స్ టెస్టు ఎక్కువ మంది అమ్మాయిలు రాస్తుండడంతో సీట్లు కూడా వాళ్లకే ఎక్కువగా వస్తున్నాయి. దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఈసారి అమ్మాయిలే ఎక్కువగా జాయిన్ అయ్యారు. అయితే, అమ్మాయిలు ఇంత పెద్ద సంఖ్యలో పీజీ స్థాయి చదువులకు రావడం మంచి పరిణామమే. 
- డాక్టర్ గడ్డం కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ