ఆదర్శ మహిళ క్లారా : బండి శ్రామిక

ఆదర్శ మహిళ క్లారా : బండి శ్రామిక

మార్చి-8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ప్రతిపాదించిన  కమ్యూనిస్టు మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెటికిన్ గురించి మనం తెలుసుకోవడం అత్యంత అవసరం. ‘ఇక మీదట యుద్ధాలు వద్దు’ అనే క్లారా ఆఖరి సందేశాన్ని నెరవేర్చాల్సిన కర్తవ్యం నేటి మహిళలపై ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వాలు, ఎన్జీవోలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజమైన ఆనందం విజయంలోనే ఉంటుంది. 

వాస్తవమే కానీ రమిజాబి, సంగీతశర్మ, ప్రతిమ, శ్రీలక్ష్మి నుంచి ఎందరో అభయలు, నిర్భయలు.. నేటి భవ్య, వైష్ణవిల ఉదంతాలు ఇంకా జరుగుతున్నాయి.  ప్రేమించకపోతే యాసిడ్, పెట్రోల్ పోయడం అందరి దృష్టికి వచ్చినవి కొన్ని మాత్రమే. రిపోర్ట్ కానివి,  ప్రపంచం దృష్టికి రానివి ఎన్నో ఉన్నాయి.  ప్రతిరోజు స్త్రీల మీద హింస పెరిగిపోతోంది. అనేకమంది మహిళలు మానసిక రుగ్మతలకు గురౌతున్నారు. మన మహిళల పురోగతిని సమీక్షించుకునే సందర్భంగా మహిళా దినోత్సవం మారాల్సిన అవసరం ఉంది.

 చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

మహిళల కదలికలను నియంత్రించడం పబ్లిక్​గా జరిగినా,  ప్రయివేటుగా జరిగినా హింసగానే గుర్తించాలి.  భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. మహిళలు కుటుంబ హింస, వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సాయుధ ఘర్షణలు జరిగిన సందర్భాల్లో మహిళను రేప్ చేయడం ద్వారా ఒక కమ్యూనిటీని మొత్తంగా అవమానించవచ్చు అని భావిస్తున్నారు.  దేశవ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. 

ప్రభుత్వం  వేలాది మందిని జైళ్లలో నిర్బంధానికి గురి చేస్తోంది. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, ఎదిరిస్తున్న ప్రజలపై ముఖ్యంగా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, దండకారణ్యంలో మహిళల మాన, ప్రాణాలను తోడేస్తున్నారు. నాటి సమైక్యాంధ్రప్రదేశ్ లో విశాఖ ఏజెన్సీ వాకపల్లిలో గ్రేహౌండ్స్ పోలీసులు గిరిజన మహిళలను రేప్ చేసిన ఘటన నేటికి పచ్చిగానే ఉంది.  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు శృతిపై జరిగిన హింస  ఒక ప్రతి ఘటన రూపమే తీసుకొని  పోరాటమైన ఘటన ప్రపంచమంతా తెలుసు. బాల్యం నుంచే పిల్లల్లో  స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమనే భావన కల్పించేలా విద్యా బోధన ఉండాలి. లింగ వివక్షత లేని చదువును అందించేందుకు పోరాడాల్సిన అవసరం ఉంది.మహిళలు చట్టాల గురించి తెలుసుకుంటే  తమపై జరుగుతున్న హింసను నిరోధించుకోవచ్చు. 

మహిళలు చైతన్యం కావాలి

పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ 2029 వరకు అది అమల్లోకి వచ్చే అవకాశం లేదు.  భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ పురుషాధిపత్యం కలిగి ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.  ఆడపిల్లలు సమాజంలో స్వేచ్ఛగా సంచరించేందుకు అవసరమైన భద్రతా వాతావరణం కల్పించేందుకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

బతుకమ్మ, సమ్మక్క, సారక్క,  మైసమ్మ, దుర్గమ్మ, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, రాజేశ్వరి, సీతాదేవి వంటి దేవతలకు పూజలు  చేస్తారు, పండుగలు చేస్తారు. దేవతల పేర్లు తమ బిడ్డలకు పెట్టుకుంటారు. కానీ, సమాజంలో, నిజజీవితాల్లో మాత్రం మహిళలను దేవతల్లా కాకుండా కనీసం సాటి మనిషిలా కూడా చూడటంలేదు.  గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మహిళలు అనేక రకాల హింస, వేధింపులకు గురౌతున్నారు.  మహిళలు తమ సమస్యల పరిష్కారానికి చైతన్యవంతంగా, శాస్ర్తీయంగా ఆలోచించి కార్యాచరణకు దిగాలి.

-బండి శ్రామిక,సోషల్​ యాక్టివిస్ట్​