నేలతల్లిని నమ్ముకుని ఆనాదిగా జీవిస్తున్న మట్టిబిడ్డలపై తరతరాలు సాగించిన అకృత్యాలపై, దొరల గడీల పాలనపై తిరగబడ్డ ప్రజాకవి గూడ అంజయ్య. పల్లె అస్తిత్వాన్ని, ప్రజల మనుగడను దెబ్బతీసే దొరల పెత్తందారీవ్యవస్థపై తిరగబడ్డ మట్టి మనుషుల ఆగ్రహ జ్వాలలు ఆయన పాట నుంచి పుట్టాయి. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన ఎన్నో పాటలను కూడా అంజయ్య రచించారు. అయ్యోడివా.. నీవు అమ్మోడివా... అంటూ దోపిడీదారులను ప్రశ్నించిన తీరు ఆయన కలానికి ఉన్న పదునును తెలియజేస్తోంది. తన పాటలతో యువకులను తెలంగాణ పోరాట కదనరంగం వైపు నడిపించిన ప్రజాకవి ఆయన.
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో 1955 నవంబర్ 1న జన్మించిన అంజయ్య స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ లో బీఫార్మసీ చదివారు. చదువు పూర్తయ్యాక ఉట్నూరులో ఫార్మసిస్ట్ గా ఉద్యోగంలో చేరారు.
ఉద్యోగంలో కొనసాగుతునే ఎన్నో ఉద్యమ గీతాలను రచించారు. సినిమాల్లో పాటలు రచించడం ప్రారంభించాక హైదరాబాద్ మకాం మార్చారు. ఆయన పాటలేకాక అనేక సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన సాహిత్య శిఖరం. అంజన్న పాటల్లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆయన పాటలు దొరలు, భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ సమాజాన్ని కదిలిస్తాయి. రెండోదశలో దళిత బానిస బతుకు పోరాటాన్ని చిత్రీకరిస్తాయి. మూడోదశలో మలిదశ తెలంగాణ పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేసిన పాటలు ఉంటాయి.నిజాం కాలంలో భూములు ఇస్తామని ఆశపెట్టి జరిపిన బలవంతపు మతమార్పిడుల గురించి రాసిన కథ 'ఇనాం శెలుక' కథ. అలాగే 'గిరిజన మహిళా మేలుకో' నాటిక అప్పట్లో పీడిత ప్రజానీకాన్ని ప్రభావితం చేసింది. నమ్మిన విశ్వాసాల కోసం అంకితమైన ఎందరో శ్రమజీవుల త్యాగాల బలిదానం మరెందరో వీరుల అమరత్వమే ఆయన పొలిమేర నవలగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా వచన కవితకు ఉద్యమస్ఫూర్తినిచ్చే గీతాలను రాసిన తెలంగాణ ఉద్యమ సృజనకారుడు అంజన్న.
పాటల పోరాట కెరటం
తెలంగాణ గట్టుమీద సందమామయ్యో... అంటూ ఈ నేలను పులకింప చేసిన పాట ఆయనది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ అయ్యోనివా అవ్వోనివో/ ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా/ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/ రాజిగా ఓరి రాజిగా/ లచ్చులో లచ్చన్న/ వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా విప్లవశంఖం పూరించాయి. ఆయన రచనలకు, పాటలకు పలు అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 1986లో సాహిత్య రత్న బంధు అందుకున్నారు. 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు అందుకున్నారు. 1996లో విశాల సాహితీ సంస్థ సన్మానం 2000లో గండపెండేరంతో సత్కారం. 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి మలయశ్రీ సాహిత్య అవార్డు, 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతులమీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. నేను పాటకోసం పాట రాయలేదు. ప్రజల కష్టాలను చూసి రాశాను అని చెప్పుకున్న గూడ అంజయ్య 2016 జూన్ 21న కన్నుమూశారు. కుటుంబ కష్టాలు, కడుపేదరికం వల్ల ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ప్రతి ఏడాది ఆయన జయంతిని అధికారికంగా జరపటం, ట్యాంకుబండ్ పైన ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, పాఠ్య పుస్తకాల ద్వారా ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. పాట పైలం, పోరు చరిత పైలం, స్వరాష్ట్రం పైలం అంటూ హెచ్చరించిన ఆయన గాడితప్పని జీవితం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శప్రాయం.
- అంకం
నరేష్
