పరిగి విద్యుత్ ఏఇపై అవినీతి ఆరోపణలు

పరిగి విద్యుత్ ఏఇపై అవినీతి ఆరోపణలు

వికారాబాద్ జిల్లా పరిగి విద్యుత్ ఏఇపై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరెంటు పోల్స్, లైన్ల మార్పిడి కోసం ఎస్టిమేషన్ లేకుండానే యథేచ్ఛగా పనులు చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఇ తీరుతో విద్యుత్ శాఖ ఖజానాకు భారీగా గండిపడినట్లు తెలస్తోంది. పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న ఓ ఫాంల్యాండ్ లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు పోల్స్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

గృహ వినియోగదారులకు ఏఇ చుక్కలు చూపిస్తున్నాడు. ఐదు, ఆరు రెంటల్ ఫోర్షన్లు ఉన్న ఇండ్లకు కూడా ట్రాన్స్​ ఫార్మర్స్​ బిగించుకోవాలని ఏఇ రూల్స్ పెడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరున్న బడాబాబుల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లు,పెద్ద ఆస్పత్రులకు రూల్స్ వర్తించవా...? అని విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న విద్యుత్ శాఖ అధికారిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

పరిగి విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ప్రైవేటు వ్యక్తుల అవసరాల కోసం విద్యుత్ లైన్లు, కరెంట్ పోల్స్ మార్చాలన్నా, కొత్త పోల్స్ వేయాలన్నా.. సదరు శాఖ అనుమతులు తప్పనిసరి. వీటికి సంబంధించి ముందుగా సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖర్చుకు సంబంధించి ఎస్టిమేషన్ వేసి విద్యుత్ శాఖకు నివేదిక పంపాల్సి ఉంటుంది. అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఖర్చుకు సంబంధించి నిబంధనల ప్రకారం.. ఈడీ తీశాక వర్క్ ఆర్డర్ వచ్చాకా టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ.. పరిగి విద్యుత్ శాఖ అధికారుల తీరు భిన్నంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

నిబంధనలను పట్టించుకోకుండానే ఎలాంటి ఎస్టిమేషన్ లు లేకుండానే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి అక్రమంగా పనులు చేసేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యుత్ శాఖకు రావాల్సిన కోట్ల రూపాయలకు గండి పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడంపై  సంబంధిత శాఖ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తే వారిని వేధింపులకు గురి చేసి నోరు మెదపకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న ఓ ఫాం ల్యాండ్ లో ఉన్న విద్యుత్ స్థంభాలు, విద్యుత్ లైన్ మార్చేందుకు లక్షల్లో వసూలు చేసి ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా పనులు పూర్తి చేసేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్టిమేషన్ వేస్తే ఇంత కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, అనుమతి కోసం వచ్చిన వారిని ఏమార్చి అక్రమార్జనకు తెగబడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా పరిగి పరిసర ప్రాంతాల్లో ఎస్టిమేషన్ లు లేకుండా చేసిన పనులు కోకొల్లలు.