వెటర్నరీలో నిధులు ఏమవుతున్నాయ్?

వెటర్నరీలో నిధులు ఏమవుతున్నాయ్?

హైదరాబాద్, వెలుగుజీహెచ్ఎంసీ పరిధిలో జంతు సంరక్షణ, సంక్షేమం, వైద్యం బాధ్యతలు  నిర్వహించే  వెటర్నరీ విభాగంపై  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో  మూగజీవాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కొందరు అధికారులు  దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కలు,  కోతులు సంచరిస్తుంటే వాటిని పట్టుకోవాల్సిన బాధ్యత  వెటర్నరీ విభాగానిది.  కానీ సిటీలో  రోజురోజుకు కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి.  సీజన్ తో సంబంధం లేకుండా రోడ్లపై వెళ్తున్న వారిని వీధి కుక్కలు వెంటాడుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉండి ఫిర్యాదులు వస్తే  ఆ ప్రాంతంలో మాత్రమే  అధికారులు హడావిడి చేస్తున్నారు. అధికారులు నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్తున్న సరైన ఫలితాలు చూపడం లేదు.

ఏకకాలంలో అధికారుల తనిఖీలు

గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్లను జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎంఫోర్సుమెంట్ విభాగం అధికారులు శుక్రవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ లో కూకట్పల్లి, అంబర్ పేట్, జీడిమెట్ల, ఎల్బీ నగర్, చుడీ బజార్ లలో ఈ ఎనిమల్ వెల్ఫేర్ సెంటర్లను జీహెచ్ ఎంసీ వెటర్నరీ విభాగం  నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల నిర్వహణ పనితీరుపై తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ విభాగాన్ని కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్సుమెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి  నేతృత్వంలో  ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో  కీలక విషయాలు వెల్లడయ్యాయి. అపరిశుభ్ర వాతావరణంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయని,  ఆపరేషన్ల అనంతరం శునకాల సంరక్షణ సక్రమంగా లేదని గుర్తించారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని  కంపాషనేట్ సొసైటీ ఫర్ ఎనిమల్స్ ప్రతినిధులు శనివారం విజిలెన్స్ అధికారులతో సమావేశం అయ్యారు.

పెరిగిపోతున్న కుక్కకాటు బాధితులు

రోజుకు 200 మంది  కుక్కకాటు బాధితులు ఐపీఎంలో చికిత్స కోసం వస్తున్నరు.  ఏరియా ఆసుపత్రిలో  రోజుకు  ఈ సంఖ్య మరో 200 వరకు ఉంటుంది. ఏరియా ఆసుపత్రులలో  ప్రాథమిక చికిత్స చేసుకొని చాలామంది ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నారు. ప్రతి సర్కిల్​లో సుమారు  పదివేల కుక్కలు ఉన్నట్లు అంచనా. ఏటా వేసవిలో కుక్క కాట్లు  పెరుగుతాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవడంతో ఇవి మరింత పెరిగాయి.

వీధి కుక్కల నియంత్రణకు రూ.10 కోట్లు

వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేస్తోంది.  నిబంధనల ప్రకారం  కుక్కలను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి.  యాంటీ రేబిస్ వ్యాక్సి నేషన్  చేయాలి. కానీ అధికారులు ఈ ప్రక్రియను రెగ్యులర్ గా నిర్వహించకపోవడం వల్ల  వీధుల్లో కుక్కల సంఖ్య పెరిగిపోతుంది. జీహెచ్ఎంసీ 6 జోన్లలో  ఒక్కో జోన్ కు  4 వాహనాల్ని ఏర్పాటు చేసింది.  ఒక్కో జోన్ లో  30 మంది సిబ్బందిని  కుక్కలను పట్టుకునేందుకు  నియమించినా సమస్య పరిష్కారం కావడం లేదు.  విజిలెన్స్ దాడుల నేపథ్యంలో  పరిస్థితిని చక్కదిద్దాలని కంపాషనేట్  సొసైటీ ఫర్ ఎనిమల్స్ ప్రతినిధి  ప్రవళిక  డిమాండ్ చేశారు.
సర్వీస్ సెంటర్ లలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,  కుక్కలను పట్టుకునేందుకు  ఆధునిక వాహనాలను సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీని కోరారు