రేవంత్.. బీజేపీని బద్నాం చేయాలని చూస్తుండు : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రేవంత్.. బీజేపీని బద్నాం చేయాలని చూస్తుండు : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు కుయుక్తులు పన్నుతుందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాకుతో ఎన్నికలను వాయిదా వేసేందుకు, బీజేపీని బద్నాం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. జిమ్మిక్కులు చేయడంలో రేవంత్ రెడ్డి పీహెచ్ డీ చేశారని ఎద్దేవా చేశారు. మంగళవారం నల్గొండలోని బీజేపీ జిల్లా ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను నెరవేర్చకుండా, కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని స్థానిక ఎన్నికలకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 

బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సీఎం ఎందుకు బయట పెట్టడం లేదని, ‘మీరు చెబుతారా.. మమ్ముల్ని బయట పెట్టమంటారా..?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెడుతున్నాడని,  ఇప్పటికీ 49 సార్లు ఢిల్లీకి పోయినా కానీ.. సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నేతలు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.