
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్,- ఎంఐఎంల మధ్య పొత్తు కన్ ఫర్మ్ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. బీఆర్ఎస్ ను విమర్శిస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ చేసిన కామెంట్లపై పెద్దగా స్పందించవలసిన అవసరం లేదన్నారు. ఈటల మంత్రి పదవిలో ఉన్నాకూడా ప్రగతిభవన్ గేటు దాటనివ్వలేదని.. కానీ, ఎంఐఎం నేతలను గౌరవంగా ప్రగతిభవన్ లోపలికి తీసుకెళుతున్నారని విజయశాంతి వివరించారు.
దీని ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యిందని తెలిపారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉన్నదని ఎంఐఎం ప్రకటించిన మాట వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఆ కామెంట్‌ని బీఆర్ఎస్ ఎన్నడూ ఖండించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంపైర్‌గా ఎంఐఎం, బీఆర్ఎస్ లు చేస్తున్నది కేవలం షాడో బాక్సింగ్ మాత్రమేనని విజయ శాంతి ఎద్దేవా చేశారు.